Tuesday, August 24, 2021


 

నాంది

విశ్వము....
ఎందుకు?
ఎలా? ఏర్పడినది...
ఎవరైనా నడిపిస్తున్నారా?

ఎందుకు.....
ప్రళయాల రూపములో
నాశనమయ్యి.... మళ్లీ
ఏర్పడుతుంది?

ఎందుకు....
జీవజాతి పుడుతూ
ఛస్తున్నాయి? వీటికి
విశ్వానికి ఏమైనా
సంబంధముందా?

ఇలాంటి.....
ఎన్నో... మరెన్నో... విశ్వరహస్యాల ఛేధన
కోసము...

డాక్టర్ జోషి, సైంటిస్ట్ హార్వే, ఆస్ట్రాలజర్ శకుంతలాదేవి.......
అనే ముగ్గురు కలిసి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కాని వీరి ప్రయత్నాలు ప్రయోగాల దాకా వచ్చి నిరూపణ గాకుండా ఆగిపోతున్నాయి! కారణాలు తెలియడము లేదు!

దీనికోసము....

వేదశాస్త్రాలను శాస్త్రీయముగా నిరూపించే ధ్యాన అనుభవ పాండిత్యమున్న పరమయోగి మాత్రమే సమాధానము చెప్పగలడని వీరికి అర్ధమైంది! ఆ పరమ యోగియైన పరమహంస కోసము కాశీక్షేత్రమునకు చేరుకున్నారు!

ఇది ఇలా ఉంటే.....

తన 36 సంవత్సరాల చిరకాల వాంఛయైన విశ్వాధినేత అవ్వటానికి పరమహంస తలను తన ఇష్ట దైవమైన మహాకాళిమాతకి సమర్పిస్తే తన ఇష్ట కోరిక నెరవేరుతుందని తెలుసుకున్న కర్కోటక అనే తాంత్రిక యోగి గూడ కాశీక్షేత్రానికి బయలుదేరాడు!

ఇప్పుడు....

శాస్త్రవేత్తల మనోవాంఛ నెరవేరుతుందా ? 
లేదా.....
తాంత్రికవేత్త కోరిక నెరవేరుతుందా ? 
తెలుసుకోవాలంటే...

ఈ నవల కథాంశములోనికి మనము వెళ్లాలి.....

మీ ఆధ్యాత్మిక రచయిత

పరమహంస పవనానంద 
(ఇదే నా ఆఖరి రచన)






ఒక యోగ ప్రార్థన



ఓ సర్వాంతర్యా మి

సర్వకాల సర్వావస్థలయందు 
నా మనసు ప్రాపంచిక విషయాల నుంచి మరలించి 
నీ మీద లగ్నం అయ్యేలాగా చెయ్యి స్వామి…..



నిద్ర లేచింది మొదలు నిద్ర పోయే లాగా 
స్వార్థం తో కూడిన చర్యలు మాటలు ఆలోచనలు 
నాలో రాకుండా కాపాడు పరమాత్మ…..



ఈరోజు అలా వచ్చిన వాటికి 
నాలో ప్రతాపం వచ్చిన వాటికి 
నాలో పశ్చాతాపం కలిగించి
ఇక మీద దుష్ట సంకల్పాలు 
నాలో కలగకుండా చూడు స్వామి…..



నన్ను అసత్యం నుంచి సత్యం వైపుకి
…. చీకటి నుంచి వెలుగులోకి
మృత్యువు నుంచి అమరత్వం వైపుకి
… ప్రయాణింప చెయ్యి స్వామి…..
నాలోని చెడువాసనలను
… సంస్కారాలను ప్రక్షాళన చేసి మాయ నుంచి
నన్ను విడుదల చేసి నీ దరి చేర్చుకో స్వామి….


నేను అనేక జన్మల గా చేస్తున్న 
అన్ని పాపపు కర్మలకి నాలో పశ్చాతాపం కలిగించి
వాటి ఫలితాలను అనుభవించే సమయంలో 
వాటిని సహనముతో, ధైర్యంతో
అనుభవించే శారీరక మానసిక స్థైర్యాన్ని, 
మనో ధైర్యాన్ని ఇవ్వు స్వామి….



నాలోని కామపూరిత కోరికలని.. 
ద్వేషాన్ని, అసూయని, పగని, అహంకారాన్ని, 
అరిషడ్వర్గాలను ,సప్త వ్యసనాలను, ఇతర వ్యతిరేక భావాలను
దహించివేసే స్వచ్ఛమైన వివేక జ్ఞాన బుద్ధిని నాకు ప్రసాదించి
నాకు ఆధ్యాత్మిక మార్గమును చూపించే గురువులను నాకు పంపు దేవా….


నా వలన ఎవరికీ అపకారం కలగని బుద్ధిని
… ఇతరులకి ఇతర ప్రాణులకీ ప్రతిఫలం ఆశించకుండా
ఉపకారం చేసే మంచి బుద్ధిని ప్రసాదించు స్వామి…
నాలో కర్మ భక్తి జ్ఞాన ధ్యాన వైరాగ్య బీజాలు అంకురించి 
జ్ఞాన యానము వేగంగా పూర్తి అయ్యేలాగా ఆశీర్వదించు స్వామి……



స్వచ్ఛము, సత్యము, ధర్మము, 
కరుణ, ప్రేమ ల నుంచి వేరు చేయకు దేవా ….
నువ్వు ఎల్లప్పుడు నాతో ఉండు… నాలో ఉండు.. 
నేను సదా నీతో ఉండేలా అనుగ్రహించు దేవా ….
ప్రతినిత్యం నీ నామస్మరణ చేసే విధంగా అనుగ్రహించు….



పాహిమాం పాహిమాం పాహిమాం

ఓం సర్వేజన సుఖినోభవంతు

ఓం శాంతి

సర్వం శ్రీ బ్రహ్మార్పణ మస్తు
                               
                                                                        ******************************