అధ్యాయము 49

 పరమహంస తదేక ధ్యాన నిష్టలో ఉండగా....

ఈయన మనోదృష్టి ముందు వరుసగా మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ చక్రాల దర్శనమై.... అవి కాస్త పంచభూతాలుగా మారి అవి కాస్త స్త్రీ ప్రకృతిగా మారాయి. అనగా పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారము అనే అష్టాంగాలు కలిసి స్త్రీ ప్రకృతిగా మారడము ఈయన గమనించాడు.ఇందులో మనస్సు, బుద్ధి, అహంకారము అనేవి త్రి గ్రంధులు అనగా బ్రహ్మ, విష్ణు, రుద్ర గ్రంధికి సంబంధించినవి అన్ని గ్రహించాడు.

ఆ తర్వాత.....

కొన్ని క్షణాల తర్వాత ఆజ్ఞచక్రము, కర్మ, గుణ, కాల, బ్రహ్మ చక్రాలు దర్శనమైనాయి. ఇవి కాస్త పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, జీవుడు అనే అష్టాంగాలతో పురుష ప్రకృతిగా కన్పించాయి.

ఆ తర్వాత.....

ఈ రెండు ప్రకృతులు అనగా స్త్రీ మరియు పురుష ప్రకృతులు కలిసిపోయి అర్ధనారీశ్వరి తత్వము కనబడసాగింది. ఆదిలో ఆది బ్రహ్మ మొదటిలో పురుషులను సృష్టించాడు. వాళ్లు వైరాగ్యముతో ఉండి పోవడము పైగా జీవ సృష్టి జరగకపోవడము పరమేశ్వరుడిని ప్రార్ధించగా... జీవ సృష్టికి స్త్రీ ఆధారమని చెప్పగానే.... అంత వరకు స్త్రీ మూర్తి అంటే ఎవరో తెలియని బ్రహ్మ దేవుడి కోసము పరమేశ్వరుడు తన శరీరము నుండి అర్ధభాగముగా ఒక స్త్రీ మూర్తి రూపముతో అనగా అర్థనారీశ్వరతత్త్వము చూపించగానే.... ఆయన ఆనాటి నుండి స్త్రీ మూర్తులను సృష్టించడము జరిగినదని ఇలా మానసాదేవి పుట్టుక జరిగినదని అలాగే ఈ అర్ధనారీశ్వర తత్త్వము కాస్త కుంభకర్ణుడి కుమారుడైన జంబూకాసురుడిని సంహారము చేసినదని కాలాముఖుడు ఈ ముగ్గురికి వివరించాడు.

   పరమహంస మనోదృష్టి యందు ఇంతటి శక్తియైన అర్ధనారీశ్వర తత్త్వము రూపము కన్పించిన ఈయన మనస్సు చలించలేదు, స్పందించలేదు, వరాలు అడగలేదు. దానితో ఈ రూప తత్త్వము గూడ అదృశ్యమైంది.అప్పుడు ఈయనకి జన్మాంతర జ్ఞాన సిద్ధి కలిగింది. తద్వారా 27 గత జన్మలు 27 రాబోవు జన్మలు ఈయనకి తెలిశాయి. చచ్చేవాడికి ఏమి తెలిసిన ఏమి లాభము అనుకొని ఈయన ఈ జన్మలన్నింటిని సాక్షిభూతముగా చూస్తూండగా తన ఆది జన్మ వివరాలుదృశ్యాలుగా కనబడసాగాయి.

     ఉన్నట్టుండి తన మనస్సు కాస్త మనోజపసిద్ధి ద్వారా ఏటో వెళ్లుతోంది.తన కళ్ల ముందర దృశ్యాలు అన్నిగూడ టెంపుల్ రన్ ఆటలాగా దాటుకుంటూ శరవేగంగా వెళ్ళిపోతూండగా.... బద్రీనాధ్ క్షేత్ర దర్శనమైంది. ఈ దృశ్యము గూడ అదృశ్యమై.... అక్కడికి దగ్గరిలో ఉన్న వేదవ్యాసుడి గుహలోనికి తన మనస్సు వెళ్లే దృశ్యము కనబడింది. అలా లోపలకి...... లోపలకి....వెళ్లుతూండగా..... ఒక చోట మానవ కపాలము, బొమికలు కన్పించాయి. ఆపై ఒక రాతి బండ మీద పెద్ద గడ్డాలు, మీసాలతో ఉన్న వృద్ధుడు కాస్త ధ్యానము చేసుకుంటూ కనిపించాడు. వీరి రాక వలన ఆయన తపోదీక్షకి భంగము కలుగడముతో ఆయన కళ్లు తెరవడము..... ఆయనను చూసి వేదవ్యాస మహర్షి అని మనస్సు చెప్పడముతో తన ఆది జన్మ వేదవ్యాస అంశమని పరమహంస గ్రహించిన ఆనందపడలేదు, స్పందించలేదు.

దానితో.....

ఈ సారి మనస్సు కాస్త ఏటో వెళ్లుతున్న దృశ్యాలు దాటుతున్నాయి. ఈ కాశీక్షేత్రములోని దశ్వామేధ  ఘాట్ దగ్గరిలో ఉన్న చిన్నపాటి హనుమంతుడి గుడికి వెళ్ళింది. అక్కడ విగ్రహమూర్తిగా వీరాంజనేయ స్వామి ఉన్నాడు. ఉన్నట్టుండి అక్కడికి ఒక పెద్ద మానవ వానరము ఒకటి వచ్చి వీళ్లని ఆశీర్వదించి వెళ్ళిపోయింది. అంటే తన ఆది దైవ జన్మ హనుమంతుడని పరమహంస గ్రహించిన స్పందించలేదు. చూస్తూ ఉండిపోయాడు. వేదవ్యాసుడికున్న విష్ణు భక్తి కాస్త త్రేతాయుగములో అది కాస్త రామ భక్తిగా మారి హనుమ అవతారమునకు కారకమైనదని పరమహంసకి జ్ఞాన స్ఫురణ అయింది. దానితో వీళ్లు సప్త చిరంజీవులలో ఒకరిగా ఉండిపోయి అనుకున్నారు.

ఆ తర్వాత....

తన మనస్సు కాస్త హిమాలయాల వైపు వెళ్లే దృశ్యాలు కాస్త శరవేగంగా  టెంపుల్ ఆటలాగా మారడము కనిపించాయి. అష్టదళాకారముగా ఉండి మధ్యలో ఉన్న కైలాస పర్వతము దర్శనమైంది. ఉన్నట్టుండి ఒక మానవ  వానరము అయిన యతీశ్వరుడు  తెల్లని బొచ్చుతో, కోతి ముఖముతో, దాదాపుగా 12 అడుగుల ఎత్తుతో,ఒకటిన్నర అడుగుల పాదాలతో మనిషిలాగా ఉండి ఈ పర్వతము ఎక్కే మహత్తర దృశ్యము ఈయనకి కన్పించింది. అంటే హిమాలయాలలో యతిలున్నారని ఈయనకి అర్ధమైంది. ఈ యతి ఎటు వెళ్లితే తన మనస్సు అటే వెళ్లసాగింది. కైలాస పర్వత శిఖరాగ్రము చేరుకుంది. ఉన్నట్టుండి అక్కడ ఒక పెద్ద అనకొండ ఈ పర్వత అగ్ర భాగమును చుట్టుకొని ఈ పర్వతానికి రక్షణకవచముగా ఉన్నట్లుగా ఒక దృశ్యము కన్పించింది.వెంటనే ఇది నిద్రలేచి బుసబుసలు కొడుతూ కాటు వెయ్యటానికో లేదో మ్రింగటానికో  ఈయన దగ్గరికి వచ్చే దృశ్యము చూసిన ఈయన భయపడలేదు, చలించలేదు. అపుడు యతి కాస్త చెయ్యి ఊపగానే ఈ పాము శాంతించి అడ్డముగా ద్వార బంధనముగా ఉన్న తన తోకను తియ్యడముతో... అపుడిదాకా మంచుతో కప్పియున్న ఒక మహా ద్వారము అక్కడ ఉన్నట్లుగా పరమహంస దృష్టికి వచ్చింది. అంటే ఇక్కడ ఈ పర్వతము మీద అదృశ్య శక్తి వాసుకి మహా  కాలసర్పము ఉండుటవలన ఈ పర్వతము మీద  ప్రయాణించే విమానాలు, హెలికాఫ్టర్లు అదృశ్యమవ్వటానికి కారణము ఈ సర్ప శక్తియేనని పరమహంస గ్రహించి.... యతీశ్వరుడు తెరిచిన మహా ద్వారము వైపు లోపలకి తన మనస్సు ప్రవేశించే దృశ్యాలు కన్పించాయి. యతి మాత్రము ఈ ద్వారము బయటే ఉండి కాపలాకాస్తూ ధ్యాననిష్ఠలో ఉండిపోయారని ఈయన గ్రహించాడు. తన మనస్సు లోపలకి వెళ్లుతున్నపుడుసుమారుగా 11km దూరము వెళ్లిన తర్వాత ఒక మంచు లింగాకారము 20 అడుగుల ఎత్తులో కన్పించింది. కొన్ని క్షణాల తర్వాత ఈ దిమ్మె కాస్త కదలడముతో మంచు కాస్త నేలమీద పడుతూండగా.... ఆజ్ఞ చక్ర ముద్రతో ఉన్న ఒక చెయ్యి కన్పించగానే....

అది కైలాసనాధుడి హస్తమని మనస్సు గ్రహించగానే....

ఆ దృశ్యము కాస్త అదృశ్యమైంది. తన మనస్సు తిరిగి శరవేగముగా వెనక్కి తిరిగి రావడము పరమహంసకి జ్ఞాన స్ఫురణ అయింది. అంటే కైలాస పర్వతములో సాక్షాత్తుగా సజీవమూర్తిగా కైలాసనాధుడే ధ్యాన నిష్ఠలో ఉన్నారని.... ఈయనకి కాపలాగా సర్పము రూపములో వాసుకి సర్పము అలాగే యతి రూపములో హనుమంతుడు ఉన్నారని పరమహంస గ్రహించిన పెద్దగా ఆనందించలేదు, ఆలోచించలేదు, స్పందించలేదు. ఈ మహత్తర దృశ్యాలు అన్నిగూడ హార్వే పరికరము ద్వారా ఈ ముగ్గురు చూసి "వామ్మో! అంటే హిమాలయాలలో నిజముగా మహాశివుడున్నాడని తెలుసుకొని ఆశ్చర్యానందాలకి గురై వీళ్ల మనస్సులు చెప్పలేని అద్వితీయ ఆనందస్థితికి వెళ్లిపోయాయి.

ఎప్పుడైతే...

పరమహంసకి ఈ కైలాస నాధుడి నిజరూప దర్శనమైందో ఆ క్షణమే ఈయన స్థూల శరీరము కాస్త సమాధి చెంది ఈయన సూక్ష్మ శరీరము బయటికి రావడము మొదలైంది. తనలాంటి రూపమున్న వ్యక్తి తన భ్రుమధ్య స్థానము నుండి బయటికి వచ్చిన గూడ పరమహంస పెద్దగా పట్టించుకోలేదు, భయపడలేదు. ఎందుకంటే అది తన సూక్ష్మ శరీరమని ఈయనకి అర్ధమైంది. గాకపోతే స్థూల శరీరానికి అలాగే ఈ సూక్ష్మ శరీరానికి అనుసంధానముగా ఒక ప్రేగు బంధముంటుంది.ఇది లేకపోతే స్థూల శరీరము నుండి ఈ సూక్ష్మ శరీరము బయటికి వెళ్లిపోతే స్థూల శరీరమునకు ప్రాణశక్తి లేనట్లే. మరణము పొందినట్లే అవుతుంది. కాని స్థూల శరీర సాధన విశుద్ధ చక్రము దాకానే ఉంటుంది. ఆపై ఆజ్ఞ చక్రము నుండి సహస్ర చక్రము దాకా తను సూక్ష్మ శరీరముతోను అలాగే సహస్ర చక్రములో కారణశరీరముతో ఆపై హృదయ చక్రములో వాయు శరీరముతో ఆపై బ్రహ్మరంధ్రము వద్ద సంకల్పశరీరము ఆపై విభూధి రేణువు వద్ద ఆకాశ శరీరము ఆపై వచ్చే వాటికి ఆత్మ శరీరముతో ఇలా సప్త శరీరాల సాధనతో సాధన చేయాల్సి ఉంటుందని ఈయనకి జ్ఞాన స్ఫూరణ అయింది. ఈ లెక్కన ఈ శరీరాలు అన్నిగూడ ఆయా చక్రాల యందు సమాధి చెందుతాయని గూడ ఈయనకి తెలిసిన పెద్దగా బాధపడలేదు. ఇదం శరీరం పరోపకారార్ధం అన్నట్లుగా ఈ శరీర అనుభవాలు ఇతరుల జ్ఞాన సంపదను పెంచే విధంగా ఉపయోగపడితే చాలని పరమహంస ఉద్దేశ్యము అన్నమాట.

     పరమహంస భౌతిక శరీరము నుండి సూక్ష్మ శరీరము బయటికి వచ్చి విశ్రాంతిగా నది ఓడ్డున పై భాగములో కూర్చొని యుండగా అక్కడే యున్న కర్కోటకుడి దృష్టికి ఈ విషయము అందింది.


No comments:

Post a Comment