పరమహంస కాస్త
హృదయ గ్రంధి విబేధనముతో వాయు శరీరమును వదిలి సంకల్ప శరీరముతో సూర్యనాడి మార్గము ద్వారా ప్రయాణము చేస్తున్నారు. అపుడు ఈయన మనో దృష్టికి సింహగర్జన మూడు సార్లు విన్పించింది. అంతరిక్షములో శూన్యము తప్ప ఏమి కనిపించని చోటులో ఈ సింహగర్జన ఎవరు చేస్తున్నారో ఈయనకి అర్ధము కాలేదు. కొన్ని క్షణాల తర్వాత ఉగ్ర స్వరూపముగా నృసింహస్వామి అవతారము దర్శనమిచ్చింది. ఈయన ఉగ్ర స్వరూపానికి మిగిలిన వాళ్లు అయితే జడుసుకొని చచ్చేవాళ్లు. కాని పరమహంస అలా గాదు. ఎందుకంటే ఎక్కడైనా సింహ పిల్లలు తన తండ్రి సింహమును చూసి భయపడవు గదా. అలా పరమహంస గూడ ఈయన నరసింహ ఉగ్ర స్వరూపమును చూసి చలించలేదు, భయపడలేదు. సాక్షిభూతముగా మౌనముగా ఈయన కేసి చూస్తుండిపోయాడు. కొన్ని క్షణాల తర్వాత నరసింహ స్వామి మళ్లీ మరొకసారి తీవ్ర స్థాయిలో సింహ గర్జన చేస్తూ అదృశ్యమై శూన్యమయ్యారు. ఆ తర్వాత కొన్ని క్షణాలకి ప్రత్యంగిరా దేవి తన కాలి క్రింద పరమహంస తలను పెట్టుకొని దర్శనమిచ్చింది. ఈ రూపము నరసింహ స్వామి వారి యొక్క స్త్రీ రూపములాగా ఉంటుంది. ఈమె ముఖము గూడ సింహ ముఖమే. ఈమె గూడ తీవ్ర స్థాయిలో సింహ గర్జన చేసింది. అయిన పరమహంస బెదరలేదు. అలాగే ఈమె కాలి క్రింద తన తల ఉండటము చూసిన అదరలేదు, భయపడలేదు. ఈ తల కాస్త ఉన్నట్టుండి కపాలముగా మారింది. అంటే తనకి బ్రహ్మ కపాలముండే బ్రహ్మరంధ్రానికి వెళ్లడానికి అనుమతి అలాగే యోగ్యత లభించినట్లుగా పరమహంసకి అర్ధమయింది. ఈమె మరొక సారి సింహ గర్జన చేసి ఈమె గూడ అదృశ్యమై శూన్యమైంది.
ఆ తర్వాత విశ్వానికి ఉన్న దశ దిక్కులకి అధి దేవతలుగా మహాదేవి యొక్క దశ మహా విద్య దేవతలు వరుసగా అనగా
1. కాళీ 2. తార 3. త్రిపుర సుందరి 4. ధూమావతి 5. భువనేశ్వరి 6. భైరవి 7. ఛిన్నమస్త 8. మాతంగి
9. బగళాముఖి 10. కమలాత్మిక
ఈ దశ మహా విద్యల తత్వాన్ని చూస్తే,
కాళీ, ఛిన్నమస్త - కాల పరిణామము
తార, మాతంగి - వాక్కు, వ్యక్తావ్యక్తము
త్రిపుర సుందరి, కమల - ఆనందము, సౌందర్యము
భువనేశ్వరి, ధూమావతి - అంతరాళము, అతీత పరబ్రహ్మ శక్తి
భైరవి, బగళాముఖి - శక్తి, గతి, స్థితి
అవి ఇలా సూచిస్తాయి.
ఇలా దర్శనమిచ్చారు. వీళ్లు పలుకలేదు. పరమహంస మాట్లాడలేదు. మౌనముగా వీరంతా కనబడి.... వెళ్ళిపోతూ .... అదృశ్యమై శూన్యమయ్యారు
ఆ తర్వాత....
ఈయన ప్రయాణము సూర్యనాడి మార్గమునకు అవతలి వైపుకి చేరుకున్నారు. అపుడు ఈయనకి సహస్ర చక్రమునకు మూడు అంగుళాల పై భాగములో అలాగే కపాలము యొక్క బ్రహ్మరంధ్ర క్రింది భాగములో రక్తము కారుతున్న ఒక అంగుళ పరిమాణములో ఉన్న కపాలము దర్శనమిచ్చింది. ఈ కపాలము నోటి నుండి రక్తము కాస్త రక్త ముద్దలుగా సహస్ర చక్రములో పడుతున్న దృశ్యము ఈయనకి అలాగే మిగిలిన వాళ్లకి కనిపించింది. అంటే జీవుడికి పుట్టుక యొక్క రక్త మాంసాలు అనేవి ఈ కపాలమునుండే ఏర్పడుతున్నాయని పరమహంస గ్రహించారు.
ఆ తర్వాత ఈ కపాలము యొక్క ముక్కు రంధ్రము నుండి పరమహంస సంకల్ప శరీరము ప్రవేశించింది. అపుడు అగ్ని జ్వాలలలో మండుతున్నఅగ్ని కపాలము మరొకటి దర్శనమైంది. అగ్ని ఈ కపాలమును నాశనము చెయ్యలేకపోతుందని ఈయనకి అర్ధమైంది. అంటే జీవుడి మరణాలైన భౌతిక, అశాశ్వత మరణాలకి ఈ కపాలము కారకమని ఈయన గమనించాడు. ఈ కపాలములోనికి ఈయన శరీరము ప్రవేశించగానే మూడు తలలతో అమ్మవారి దివ్య దర్శనమైంది. ఒక వైవు దుర్గాదేవి మరొకవైపు చంఢీమాత మధ్యలో కాళికా మాతతో ఈ మూడు తలల విశ్వమాత దర్శనమైంది. అంటే ఇచ్చాశక్తితో దుర్గాదేవి విశ్వసృష్టి చేస్తుంటే, క్రియాశక్తితో కాళికాదేవి ఈ విశ్వస్థితిని చేస్తుంటే, జ్ఞానశక్తితో చంఢీమాత ఈ విశ్వ లయ ప్రక్రియ చేస్తోందని ఈయనకి జ్ఞాన స్ఫూరణ అయింది. ఈ మహా ఉగ్ర స్వరూపము ఏమి మాట్లాడలేదు, పలుకలేదు. దానితో పరమహంస గూడ మౌనము వహించగానే.....
కాళీమాత మెడలోని 27 కపాలమాలలోని ఈ మాలకి మణిపూసగా ఉన్న బ్రహ్మ కపాలములోనికి ఈయన శరీరము ప్రవేశించింది. అపుడు ఈయన లోపలకి ప్రవేశించిన తర్వాత ఒక దివ్య తేజస్సు ఉన్న అగ్ని జ్వాల దర్శనమిచ్చింది. విచిత్రము ఏమిటంటే ఈ అగ్నియే పాముగా, కపాలముగా, వివిధ దేవతల రూపాలుగా కనబడసాగింది.అంటే ఈ విశ్వములోని జీవ సృష్టి, దైవ సృష్టి యొక్క కాంతి శరీర అగ్ని తత్త్వ రూపాలకి మూల కారణము ఈ బ్రహ్మ కపాలములోని ఈ జ్వాలాగ్నియే కారకమని ఈయన గ్రహించాడు. పైగా అగ్ని తత్త్వానికి రూపమిచ్చే గుణమున్నదని శాస్త్రవచనము గదా. ఈ అగ్ని జ్వాలాముఖిలోనికి పరమహంస సంకల్ప శరీరము ప్రవేశించిన మరుక్షణమే ఈ శరీరము పడిపోయి అణువు అంత ఆకాశ శరీరము ఏర్పడింది. ఈ అగ్ని జ్వాలను దాటగానే... ఈయనకి చిమ్మ చీకటి గాఢ అంధకారమైన శూన్య ప్రాంతము దర్శన మిచ్చింది. ఎలాంటి కాంతి కాని శబ్దము కాని లేదు. కాని నిశ్శబ్ద నాదము వినిపిస్తోందని ఈయన గమనించారు. ఈ నాదమునే తుంకార నాదమంటారని... దీనినే మహాశివుడు సాధన చేస్తూ వింటూ ఉంటారని శివ పురాణములో చెప్పిన విషయము ఈయనకి లీలగా గుర్తుకువచ్చింది. ఏకాంతము, ఓంటరితనము, ఏమి లేదు. అంతటా శూన్యము తప్ప మరొకటి కనిపించడము లేదు. అగుపించడము లేదు. రాత్రిపూట ఎడారిలో ఉంటే ఎలా ఉంటుందో అలా ఈ శూన్యస్థితి ఉన్నదని ఈయనకి అర్ధమయింది. అలా....అలా.... కొంతదూరము ప్రయాణించిన తర్వాత ఈయనకి ఒక గుహ మార్గము అగుపించింది.
కాని మార్గము చాలా చిన్నదిగా ఉంది. అణువంత ఈయన శరీరము అందులో పట్టడము లేదు. ఏమి చెయ్యాలో ఈయనకి అర్ధము కాలేదు. అపుడే ఈ విశ్వ శూన్యములో విన్పించే తుంకారనాదమును వినడము మొదలు పెట్టిన 48 క్షణాలకి ఈ శరీరము కాస్త పరమాణువు అంత ఆత్మ శరీరముగా మారింది. అపుడు ఈ గుహలోనికి వెళ్ళడము సులువైంది. ఈ గుహలోపల పై భాగములో ఒక రంధ్రముంది. దీని నుండి కాంతి లోపలకి ప్రవేశిస్తున్నట్లుగా ఈయనకి అర్ధమైంది. ఈ గుహ లోపల కొద్దిపాటి నీరున్న కొలను కనబడింది. అంటే మానవ మెదడు లోపల సహజముగా నీరు ఉంటుంది. ఈ నీటినే గోముఖ తీర్ధము అని శాస్త్ర వచనము. అంటే ఈ గుహలో కనిపించే తీర్ధమే గోముఖ తీర్ధమని అలాగే ఈ గుహ రంధ్రమే బ్రహ్మరంధ్రమని తను బ్రహ్మరంధ్ర గుహలో ఉన్నానని ఈయనకి జ్ఞాన స్ఫురణ అయింది. అంటే మూలాధార చక్రములో శివలింగ రూపముగా అంటే అదే ఈ బ్రహ్మరంధ్రమునందు ఎవరో ఏదో ఒక రూపములో ఉండి ఉండాలి గదాయని ఈయనకి అన్పించసాగింది. ఎందుకంటే రంధ్రము ద్వారా కాంతి ప్రసరణ అలాగే దాహార్తి కోసము జలము ఉండుట బట్టి ఎవరో ఈ గుహ యందు అనగా బ్రహ్మరంధ్ర గుహయందు ఆవాసము చేస్తున్నారని ఈయనకి అర్ధమైంది. వాళ్లు ఎవరో తను తెలుసుకోవాలి. అపుడే తను ఎవరో తనకి జ్ఞానస్ఫూరణ అవుతుందని ఈ గుహ యందు తన మనో నేత్రముతో వెతకడము ఆరంభించారు.
No comments:
Post a Comment