అధ్యాయము 27

 నాలుగు రోజుల తర్వాత....

రక్షించిన పావురము మరణము పొంది మరో నాలుగురోజులలో కుక్కగా పునఃజన్మ ఎత్తటానికి వెళ్లింది. దానితో దేవికి అనారోగ్య బాధలు తగ్గి ఆరోగ్య స్థితికి చేరుకొని పావురము చనిపోయినదని తెలుసుకొని బాధపడింది.

దేవి ఆరోగ్యము కుదుటపడేసరికి అందరూ ఆనందపడ్డారు. కాని ఎలా కుదుటపడిందో ఎవరుగూడ తెలుసుకునే ప్రయత్నము చెయ్యలేదు. ఎందుకంటే రక్షించవలసిన పరమహంస ఏమీ చేయకుండా యోగానికి, కాలానికి వదిలెయ్యడము చేసారని జోషి అలాగే హార్వే కలిసి దేవికి చెవిలో నూరి పోశారు. ఇవి ఏవి నమ్మనట్లుగా దేవి ఉండేది.

పరమహంస...రక్షించినాడని కర్కోటకుడికి మాత్రమే తెలుసు. తెలిసినవాడు చెప్పలేడు. అందుకే...జ్ఞానము తెలిసిన వాడు మాట్లాడలేడు.తెలియనివాడు మాట్లాడకుండా ఉండలేడని ఊరికే మన పెద్దలు చెప్పలేదు. అన్ని చేసిన పరమహంస... అన్ని తెలిసిన కర్కోటకుడు.... ఏమీ తెలియని వారిలాగా మౌనముగానే ఉన్నారు.

ఆ తర్వాత....

దేవి అక్కడే ఉన్నా పరమహంసతో....

గురూజీ! మన వాళ్లంతా ఏదో తెలియక అలా మాట్లాడుతున్నారు. మీరు పైకి కనిపించకుండా అన్నీ చేస్తారని నాకు తెలుసు. ఎందుకంటే ఈ పద్దెనిమిది రోజుల మరణావస్థను ఒక పరమ యోగి తప్ప ఎవ్వరు గూడ రక్షించలేరని వారినే పరమహంస అంటారని....నా జ్యోతిష్య గురువు నాకు చెప్పి మీ గూర్చి చెప్పడము జరిగింది. మీ సాధన స్థితిగతులు గూడ చెప్పి యుగానికి ఒక్కరు మాత్రమే ఇలాంటి పరిపూర్ణ యోగసాధన స్థితికి చేరుకుంటారని... నాకున్న విశ్వ రహస్యాలు ఈయన మాత్రమే తీరుస్తారని.... మీ దగ్గరికి నన్నుపంపించడము జరిగింది. నన్ను తంత్ర ప్రయోగ ఈతి బాధల నుండి మీరు తప్ప ఎవరుగూడ రక్షించలేరని నాకు తెలుసు. ఎందుకంటే భౌతిక శరీరమే నాది. కాని నాలో ఉన్న సూక్ష్మ శరీరము పావురము అని నాకు తెలిసింది. ఏదో నాకు గూడ దివ్యదృష్టి చూపించే త్రినేత్ర సాధన స్థితిలో ఉన్నాము అనుకొండి.అనగానే...

పరమహంస నవ్వి ఊరుకున్నారు.

ఇంతలో.....

అక్కడికి హార్వే, జోషి వచ్చి....

గురూజీ! మీరు చేసే ధ్యానాల వలన ఏర్పడిన ధ్యానశక్తి తరంగాల వలన ఆ తాంత్రికుడైన కర్కోటకుడి తంత్ర ప్రయోగము ఫలించలేదు అనుకుంటూ. మీరు ప్రత్యక్షముగా ఏమీ చేయకపోయినా పరోక్షముగా ఇలా ధ్యానాలు, హ◌ోమాలు చెయ్యడము వలన ఆ శక్తి వలన దేవి కోలుకుంది. మా దేవిని తిరిగి ప్రాణాలతో మాకు అప్పగించారు. అందుకు మా కృతజ్ఞతలు అంటూండగా....

దేవి వెంటనే....

గురూజీ! మరి ఎపుడు మీరు టైమ్ ట్రావెలింగ్ చేస్తారు? అనగానే....

ఎప్పుడో ఎందుకమ్మా! ఇప్పుడే ఈ క్షణమే ఈ రోజు ఆ ప్రయోగానికి వెళ్దాం. నా రహస్య సైన్సు గదికి వెళ్లి ఈ ప్రయోగానికి నాంది పలుకుదాం.ఇపుడు మనకి కర్కోటకుడి వలన ఎలాంటి ప్రమాదము రాదు. ఎందుకంటే వాడికి తగిలిన ఈ దెబ్బని తట్టుకోవడానికి  తిరిగి కోలుకోవటానికి మూడు నెలలకు పైనే  పడుతుంది.

ఈ లోపుల నేను నా యోగనిద్ర సాధన స్థితి వలన కాలములో ప్రయాణించి విశ్వములో ఆదిలో, అంతములో ఏముందో తెలుసుకుంటాను. వాటిని మనవాడు తయారు చేసిన పరికరాలలో రికార్డింగ్ చేస్తే నా అనుభవాలు శాస్త్రీయంగా లోకానికి నిరూపించే అవకాశముంటుంది గదా అంటూ....


వీరంతా కలిసి రహస్య గది వైపుకి బయలుదేరారు.


No comments:

Post a Comment