అధ్యాయము 25

 పరమహంస....

ఏమీ చెయ్యకుండ.... అన్ని తెలిసి గూడ యోగము లేదని సాకు చెప్పి తప్పించుకోవడము హార్వెకి అలాగే జోషికి నచ్చడము లేదు. మానవ మాత్రుడిగా అయిన ఆమె పడే బాధను చూసి ఏదో ఒకటి చెయ్యవచ్చు గదా

అని వీరు అనుకుంటున్న సమయములో...

వాలు కుర్చీలో యున్న పరమహంస కళ్లు తెరిచి.... వీళ్లని తన దగ్గరికి రమ్మని సైగ చేసి.....

నాయనా! వాడు ఈమె మీద, కడుపులోని అపాన వాయువు అదే గ్యాస్ ని ఇచ్చే వాయువు మీద ప్రయోగము చేసి స్మశానము నుండి వెళ్లాడు. రేపు వేరే భాగము మీద ప్రయోగము చేస్తాడు. ఇలా ఈమెను నాలుగు రోజుల పాటు శారీరకముగా, మానసికముగా హింసించి చంపాలని వాడి తంత్రప్రయోగ ఉద్దేశ్యము అనగానే.....


గురూజీ! వాడు ఆమెనే ఎందుకు టార్గెట్ చేశాడు? మా మీద చెయ్య వచ్చును గదా.


నాయనా! వాడికి కన్యత్వమున్న స్త్రీ ఆత్మ గావాలి. దేవికి ఈ గుణమున్నదని వాడు తెలుసుకున్నాడు. ఆమె కన్యత్వము పోలేదని గ్రహించి ఈ తంత్ర ప్రయోగమునకు పూనుకున్నాడు. కారణము లేనిదే, కార్యము లేనిది ఇలాంటి తంత్ర యోగులు ఇలాంటి ప్రయోగాలు చెయ్యరు. వాడికున్న విశ్వాధినేత

గావాలనే  ఆకాంక్ష కోసము ఈమె ఆత్మశక్తి వాడికి గావాల్సి వచ్చింది.


అదే ఎందుకు ?


ఎందుకు అంటే ఫోర్త్ డైమెన్షన్ కి  వెళ్లాలంటే వాడు అస్కలిత బ్రహ్మచారిగా అంటే కనీసము నిద్రలో లేదా కలలో గూడ వీర్యస్కలనము కాని వాడై ఉండాలి.ఇది మానవ మాత్రుడికి సాధ్యపడదు. రెండవది కన్యత్వమున్న స్త్రీ ఆత్మ గావాలి. కర్కోటకుడికి మొదటి దానిని క్షుద్ర దేవతలను వశపర్చుకోవటానికి వాడి బ్రహ్మచర్య దీక్ష కోల్పోవడము జరిగింది. స్త్రీ శవాలతో, స్త్రీలతో వాడు ఎన్నో సార్లు శృంగార ప్రక్రియలు జరిపాడు. దానితో కన్యత్వమున్న స్త్రీ కోసము వెతుకులాటలో వీడికి దేవి కనిపించింది. దానితో ఈమె మీద చేతబడి ప్రయోగము చేసి ఆమెను చంపి ఆమె ఆత్మను బంధించి.....ఈ లోపుల ఆమె పడే నరకయాతనను చూసి నన్ను బలహీనపడేటట్లుగా చేసి వాడు నా తలను కాళీమాతకి బలి ఇవ్వాలని ఈ ప్రయోగానికి పూనుకున్నాడు.


జోషి వెంటనే....

స్వామి! మీకు ఇన్ని తెలిసినా మౌనముగా ఏమీ చెయ్యకుండా ఎందుకున్నారు. వాడు ఎవడో ఫోర్త్ డైమెన్షన్ వెళ్ళడానికి మా దేవి ప్రాణాలు తియ్యడము  ఏమిటో? మీ తల బలి వాడి విశ్వాధినేత కోరిక నెరవేర్చడము ఏమిటో నాకైయితే ఏమీ అర్ధమై చావడము లేదు.


నాయనా! ప్రకృతిలో అన్ని ఉన్నాయి. మంచి ఉంది. అలాగే చెడు ఉంది. మన ఆలోచన, భావము, ఆశ, ఆశయం, సంకల్పము, స్పందన బట్టి అవి అలా ఉంటాయి. గుమ్మడికాయను దృష్టి దోషాలకి వాడవచ్చును అలాగే తాంత్రిక పూజలకు వాడవచ్చును.వాడుకను బట్టి విధాన ఫలితముంటుంది. పులి అనేది మాంసమే తింటుంది. ఆవు అనేది గడ్డియే తింటుంది. ఈ రెండు జీవులు గూడ చచ్చిన తమ ఆహారపు అలవాట్లు మార్చుకోలేవు. ఎవరి తత్త్వము వారిది. నాకు ఈ విశ్వమంతా ప్రేమగా కనబడితే వాడికి ఈ విశ్వమంతా విషముగా కనబడింది.

యత్ భావము తత్ భవతి. వాడి భావాలు తగ్గట్లుగా కనిపించడానికి వామాచారములో తాంత్రిక ప్రయోగాలు ఉంటే దక్షిణాచారములో శాంతి ప్రయోగాలు ఉన్నాయి. ఎవరు ఏ ఆచారములో నిష్టగా నిశ్చలముగా, నియమముగా, ఉండి నిష్ణాతుడు అవుతారో వారే జయం పొందుతారు మంచికి రోజులుంటాయి.చెడుకి క్షణాలే ఉంటాయని తెలుసుకో. అన్నింటికి కాలము కలిసి రావాలి. అన్నింటికి కాలమే పరిష్కారము అలాగే సమాధానము చెపుతుంది. అపుడిదాకా ఎవరైనా ఎదురు చూడక తప్పదు. అంతెందుకు తారకాసురుడు ముగ్గురు కొడుకులను చంపటానికి సాక్షాత్తు మహాశివుడే 1000 సంవత్సరాలు ఎదురుచూడక తప్పలేదని శివపురాణము చెపుతోంది గదా. మరి కాలము ముందు మనమెంత. నువ్వు ఇందాకటి నుంచి ఎన్నో వైద్యాలు ఆమెకి చేశావు. ఇసుమంత అయిన గుణము కన్పించిందా? ఇదే వైద్యము ఇతరులకి చేస్తే గంటలలో తగ్గేది. మరి అదే వైద్యము ఈమెకి చేస్తే ఎందుకు తగ్గడము లేదో నువ్వే ఒక వైద్యుడిగా ఆలోచించు. ఎందుకంటే భౌతిక శరీరానికి కడుపు నొప్పి వస్తే నీవు ఇచ్చే మందులు పనిచేసేవి. కాని వాడు చేసిన ప్రయోగము వలన ఈమె పిండదేహానికి కడుపు నొప్పి వచ్చి.... అది భౌతిక శరీరము మీద చూపిస్తోంది. నువ్వు చేసే భౌతికశరీర వైద్యము బాధపడే పిండదేహానికి వెళ్ళడము లేదు.అందుకే ఆమె కడుపు నొప్పి తగ్గడము లేదు. వైద్యము ఒకే చోట.... బాధ మరొక చోట ఉన్నాయని తెలుసుకో. ఆమె పిండదేహము ఆమె దేహములో లేదు.వాడు స్మశానములో చేసిన పిండి బొమ్మలో అష్ట దిగ్బంధనములో బంధించబడి ఉంది. అది ఇక్కడికి  రాలేదు. ఇక్కడున్న ఈమె బాధపడక తప్పదు. ఆమె పిండ దేహము తిరిగి ఈమె భౌతిక దేహమునకు వచ్చేదాకా మనము చూడక తప్పదు. భరించక తప్పదు. ఈ నాలుగు రోజుల పాటు నీకు తెలిసిన అన్ని రకాల వైద్యాలు చెయ్యి. ఆమెకి ఇసుమంత ఉపశమనము కల్గించు. నీకు గావాలసిన సహాయ సహకారాలు నేను ఇస్తాను. ఒకటి గుర్తుంచుకో. నువ్వు ఎన్ని రకాల వైద్యాలు చేసిన ఆమెకి ఉన్న ఈ నాలుగు రోజులు ఏమి  పని చెయ్యవు. ఆమె ఉపశమనము పొందడము అనేది ఉండదు. ఎందుకంటే ఆమె శరీరములో పిండదేహము అదే వాయు శరీరము అనేది ప్రస్తుతానికి లేనేలేదు.అది ఎలా బయటికి వెళ్లిందో..... అలా తిరిగి లోపలికి  వచ్చేదాకా నేనే గాదు ఆ భగవంతుడు గూడ ఏమి చెయ్యలేడని తెలుసుకో. నీకు చేతనైనంత ఏదైనా  చేసుకో. నేను అభ్యంతరము చెప్పను. నీ వైద్యము నువ్వు చేసుకో. ఏమైనా ఫలితము కనబడితే మంచిదేగదా అంటూ 

ఆయన లేచి తనునిత్యము పూజ చేసే హోమాగ్ని దగ్గరికి వెళ్లి ధ్యానములో కూర్చున్నారు.


No comments:

Post a Comment