అధ్యాయము 53

ఇదేమి తెలియని స్థితిలో...

అలౌకిక స్థితిలో....  పరమహంస సాధన స్థితి కొనసాగుతోంది. సహస్ర చక్రము మీద ఆధిపత్యము కోసము శూన్యముద్రతో సాధన చేస్తూండగా....

పరమహంస కాస్త మహారుద్రుడిలాగా మారిపోయాడు. విభూధి రేఖలతో, ఓంటి నిండా భస్మముతో, రుద్రాక్ష మాలలతో శివుడిలాగా మారి ధ్యాన నిష్ఠలో ఉన్న పరమహంసను చూసిన ఈ ముగ్గురికి నోట మాట రాలేదు. విశ్రాంతి స్థితిలో యున్న కాలాముఖుడు వీరి అవస్థను గమనించి.....

అయ్యలారా! మీ గురువుగారు శివోహం స్థితికి చేరుకున్నారు. అనగా తానే శివుడు అనే జ్ఞాన స్థితిని పొందారు. దానితో ఆయన రూపము శివోహం అయింది. సాక్షాత్తు పరమేశ్వరుడే అన్నమాట. ఇన్నాళ్లుగా శవములాగా ఉన్న ఈయన ఈ క్షణము నుండి శివమ్ అయ్యారు. దేవుడయ్యాడు! మహాదేవుడయ్యాడు! ఆది దేవుడయ్యాడు! జంగమ దేవరయ్యాడు! ఆదియోగి అయ్యాడు! ఆదిగురువైయ్యాడు! ఆదిమవాసి అయ్యాడు.

స్వామి! ఇది ఎలా సాధ్యము అని హార్వే అడిగేసరికి....

సాధన సాధ్యతే సాధ్యం! సాధన సిద్ధితో సాధ్యము కానిది ఈ లోకములో అలాగే ఈ ప్రకృతి మరియు ఈ విశ్వములో లేనిది లేదు. ఉన్నది లేదు. విశ్వములో ఉండే సర్వ దైవాలు ఈ దేహములోను ఉంటారు. విశ్వ దేవతలు సర్వాంతర్యామిగా బయట ఉంటే... అదే దేవతలు మన దేహాల అంగాలలో అంతర్యామిగా అంతర్గతముగా ఉంటారు. ఎవరైతే తమ సాధన సిద్ధి చేత ఈ యోగ చక్రాలలో అంతర్గతముగా ఉన్నవాళ్లు కాస్త ఇలా బహిర్గతము అవుతారు. అంతెందుకు మన శరీర 18 అంగాలలో 18 మంది దేవతలు ఆవాసమున్నారు. కాపాలములో బ్రహ్మ, నుదురులో కుమారస్వామి, మస్తకములో వీరభద్రుడు, కన్నులలో సూర్య, చంద్రులు, త్రినేత్రములో రుద్రుడు, నాసికములో గణపతి, నాసికాగ్రములో మహావిష్ణువు, శ్వాసలలో రుద్రుడు, ముఖములో మహాలక్ష్మి, దంతాలలో వరలక్ష్మి, దంతాల అగ్రభాగములో యముడు, కపాల అగ్రభాగములో నృసింహస్వామి, నఖాగ్రము లో అష్టమి, నాభిలో అగ్ని, మనస్సులో మారుతి, బుద్ధిలో శ్రీకృష్ణుడు, అహములో శివుడు, మేండ్రములో ప్రజాపతి, ఆవ్యావయనములలో  అష్ట దిక్పాలకులు  ఆవాసము చేస్తున్నారు. 

అలాగే విశ్వములో ఉండే 14 లోకాలలో సప్త ఊర్ధ్వ లోకాలు వరుసగా మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర చక్రాలలో వరుసగా భూలోకం, భువర్లోకం, సువర్ణ లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకము ఉన్నాయని మీకు తెలుసుగదా. అలాగే సప్త అధో లోకలైన అతల, సుతల, వితల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ లోకాలు గూడ వరుసగా మానవ దేహములో అధోభాగమములో అనగా తుంటి భాగములో, తొడల భాగములో, తొడ ఎముకలో, పిక్కల్లో,కాలి చీల మండలాలలో, పాదాలలో, అరికాలులో ఈ సప్త అధోలోకాలుంటాయి. 

ఈ విశ్వములో ఏది అయితే ఉన్నట్లుగా కనిపిస్తుందో ప్రతీది గూడ మన దేహములోను గూడ ప్రతిబింబిస్తుంది. ఈ విశ్వానికి అలాగే ఈ దేహానికి బేధభావము లేదు. ఈ రెండు గూడ అద్దము అలాగే ప్రతిబింబము లాంటివే. యత్ భావము తత్ భవతి. ఎవరు ఏవిధంగా చూసి భావించుకుంటారో వారికి ఆ విధంగా ఈ విశ్వము అలాగే ఈ దేహము కనబడుతుంది.నువ్వు జీవుడు అనుకుంటే ఈ దేహము జీవాత్మ అవుతుంది. అదే నువ్వు దేవుడు అనుకుంటే ఈ దేహములో పరమాత్మ కనబడుతుంది. ఇపుడు మీ గురూజీకి దేహాత్మ పోయి దైవాత్మయనే భావన కల్గింది. అందుకే అయన ఇప్పుడు మన కంటికి దైవాత్మగా, శివాత్మగా దర్శనమిస్తున్నారు, కనబడుతున్నారు.నిజానికి అందరు దేవుళ్లే. కాని మాయ జ్ఞానము వలన దేవుళ్లుగా ఉన్న మనము మానవులుగా ఉన్నాము. అదే మాయా రహిత జీవులైన మానవులు కాస్త మాధవులుగా కొనియాడ బడుతున్నారు, పూజించబడుతున్నారు. ఒక రకముగా చెప్పాలంటే ఒక దేవుడిని మరొక దేవుడు పూజిస్తున్నాడు, భజన చేస్తున్నాడు.ఎందుకంటే వీరిలో ఒక దేవుడికి మాయారహితం మరొక దేవుడికి మాయా సహితము అయింది. ఈ జ్ఞాన భేధము తెలుసుకున్న జీవుడు కాస్త దేవుడవ్వక తప్పదు. ఇదే సత్యం. ఇదే తధ్యం. అంటూ కాలాముఖుడు తిరిగి ధ్యాననిష్ఠలోనికి వెళ్లి పరమహంస యొక్క ధ్యానదృశ్యాలను తన మనో దృష్టి ద్వారా చూడటము ప్రారంభించాడు. ఈయన చూస్తున్న దృశ్యాలు అన్ని గూడ హార్వే పరికరములో రికార్డు అవుతూనే ఉన్నాయి. వీటిని ఈ ముగ్గురు గూడ కళ్లు ఆర్పకుండా తదేక దృష్టితో చూస్తున్నారు.

 పరమహంస కాస్త తదేక దీక్షతో శూన్యములో సాధన చేతున్నట్లుగా అందరికి కన్పించారు. ఈయన మనోదృష్టికి వరుసగా ఈయన గురువులైన మంత్రగురువు, శక్తిపాతగురువు, సద్గురువు, పరమగురువు, జగత్ గురువు, ఆది గురువు దర్శనమిచ్చారు. అంటే ఈ చక్ర మహామాయ అయిన గురు మాయ ఆరంభమైనదని గ్రహించారు. ఈయన మెదడు అగ్రభాగములో 1000  రేకుల పద్మము ఒకటి వయొలెట్ రంగులో దర్శనమిచ్చింది. ఆ తర్వాత ఒక నీల మేఘశ్యామా రంగుతో శ్రీకృష్ణుడు దర్శనమిచ్చాడు. అంటే జగత్ గురువైన ఈయన తనకి గురుమాయకి కారకుడని గ్రహించాడు. ఆ తర్వాత ఆకాశములో సుడులు తిరుగుతున్న పాంచజన్య మహా శంఖము దర్శనమైంది. దీని నుండి అనాహతముగా ఓంకారనాదము వస్తోంది. ఈ శంఖ ధ్వనియే ఓంకారనాదముగా మారి ఈ విశ్వములో నాదము అవుతోందని ఈయన గ్రహించాడు. ఆ తర్వాత కోటికి పైగా సత్యలోకాలు అలాగే 16 వేలకి పైగా గురుగ్రహాలోకాలు అంతరిక్షము నందు దర్శనమిచ్చాయి. అయిన ఈయన పెద్దగా స్పందించలేదు. అష్ట సిద్ధులు ఇచ్చే దేవతలు దర్శనమిచ్చారు. అలాగే దశసిద్ధులు, పంచసిద్ధులు ఇచ్చే దైవాలు దర్శనమిచ్చారు. అయిన ఈయన స్పందించలేదు. వీరందరిని సాక్షిభూతముగా చూస్తు ఉండిపోయారు.

ఆ తర్వాత విశ్వ అంతరిక్షము దర్శనమైంది. గ్రహాలోకాలు దర్శన మిచ్చాయి. దైవలోకాలు దర్శనమిచ్చాయి. సప్త మండలాలు అనగా వాయు, అగ్ని, జల, భూ, ఆకాశ, సూర్య చంద్ర మండలాలు దర్శనమిచ్చాయి. ఆపై సప్తర్షి లోకాలు అనగా అత్రి, అంగిరసు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, మరీచి, వశిష్ట మహర్షి లోకాలు దర్శనమిచ్చాయి. ఆ తర్వాత సప్త చిరంజీవులు అశ్వద్ధామ, బలి, హనుమ, విభీషుణుడు, కృపుడు,పరశురాముడు, వ్యాస మహర్షి లోకాలు దర్శనమిచ్చాయి. ఆ తర్వాత అష్ట వసువుల లోకాలు అనగా వరుణుడు, వృషభుడు, నహుషుడు, జయుడు, అనిలుడు, విష్ణువు, ప్రభాసుడు, ప్రత్యాషుడు, లోకాలు దర్శనమిచ్చాయి. ఆపై ధృవ మండలము దర్శనమైంది. ఆ తర్వాత 36 దేవతల లోకాలు అనగా త్రిలోకాలు కైలాసము, వైకుంఠము, బ్రహ్మ లోకాలు మరియు ఏకాదశి రుద్ర లోకాలు అనగా అజపా, అహిర్బుదుడు, చండుడు, కపాలి, భవుడు, భీముడు, పింగళుడు, విలోహితుడు, విరూపాక్షుడు, శంభుడు, శాంతుడు, అనే రుద్రలోకాలు అలాగే ద్వాదశ ఆదిత్య లోకాలు అనగా దాత, మిత్ర, ఆర్యముడు, శక్యుడు, వరుణ,ఆంశుమంతుడు,వివస్వంతుడు, భగుడు, పూషుడు, సవిత, త్యష్ఠ, విష్ణువు, అనే లోకాలు దర్శన మిచ్చాయి. ఇలా సుమారుగా ఒక్కొక్కటి ఇవి గాకుండా శ్రీకృష్ణ వాసమైన గోకులం అలాగే శ్రీరామ వాసమైన ఆనందలోకము, పరశురామ లోకము, బుద్ధుడి యొక్క శాంతిలోకము, ఇలా 1000 కి పైగా ఎన్నో ఎన్నెన్నో లోకాలు దర్శనమిచ్చాయి.

ఇవి అన్నిగూడ ఒక్కొక్కలోకము కోటి చొప్పున సహస్ర కోటి లోకాలున్నట్లుగా ఈయనకి దర్శనమైంది. నిజానికి మానవ మెదడులో గూడ 100 మిలియన్ల న్యూరాన్లు ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్పడము జరిగింది. ఈ మానవ న్యూరాన్లులే ఈ విశ్వములో లోకాలుగా దర్శనమిస్తున్నాయని పరమహంస గ్రహించాడు.ఆ తర్వాత విశ్వరూప దర్శనమైంది. సహస్ర శిరస్సులతో, సహస్ర బాహులతో, సహస్ర కాళ్లలతో ఈ రూప దర్శనమైన ఈయన స్పందించలేదు. 

ఆ తర్వాత షట్ కోణము ఉన్నట్లుగా గ్రహించారు. ఈ కోణాలు అన్ని కలిపి చూస్తే ఒక తేనె పట్టులోని గదులుగా ఇవి అన్నియు ఉన్నట్లుగా గమనించాడు. ఈ షట్కోణము అనేది షట్ కాలాలైన కాలమునకు ప్రతీకే. అంటే ఈ విశ్వములోని సర్వ లోకాలు అన్ని గూడ కాలము యొక్క ఆధీనములో ఉండి నడుస్తున్నాయి. లిప్త కాలం  నుండి మొదలై క్షణాలు, నిముషాలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు, కల్పాలు, యుగాలు, మహాయుగాలు, మన్వంతరాలు, కల్పాలు, మహాకల్పాలు,పరమాత్మ శ్వాసలు దాకా ఈ కాల విభజన జరిగి ఈ సహస్ర కోటి లోకాలను ఆవరించి తన చెప్పు చేతలలో ఉంచుకుంటుందని గ్రహించాడు. గాకపోతే ఈ కాలచక్రము పైన 50  ఆకులతో మూడు చట్రాలతో తిరుగుతున్న ఒక దివ్య చక్ర దర్శనమైంది. దానిని మరింత దగ్గరగా వెళ్లి పరిశీలించి చూడగా అది శ్రీకృష్ణుడి ఆయుధమైన సుదర్శన చక్రముగా దర్శనమైంది. అంటే ఈ సహస్ర కోటి లోకాలలోని  జీవులు ఎవరు గూడ ఈ కాల చక్ర మిచ్చే కాలమునకు అతీత స్థితి పొందకుండా ఈ సుదర్శన చక్ర మాయ చేస్తోందని ఈయన గ్రహించాడు. అందుకే శ్రీకృష్ణ మాయ అన్నారు. ఈ మాయను తన జ్ఞాన మాయతో కప్పి ఉంచాడు. అందుకే అరవిందయోగి తన మంత్ర గ్రంథమైన 'సావిత్రి' గ్రంధము యందు శ్రీ కృష్ణ పరమాత్మ తన జ్ఞానముతో సప్త యోగ చక్రాలను సప్త యోగ జ్ఞాన భూమికలుగా తన ఆధీనములో కాలము రూపములో ఉంచుకున్నారని.... ఈ జ్ఞాన మాయను దాటడానికి మహా నిర్యాణశక్తి అవసరమవుతుందని చెప్పిన విషయము నిజమేనని పరమహంస గమనించాడు. ఈ మహా నిర్యాణ శక్తిని ఎలా పొందాలో గౌతమ బుద్ధుడు తెలుసుకొని లోకానికి తెలియ చెయ్యడముతో తనకి శ్రీకృష్ణ మాయ ప్రభావము చూపలేదని ఈయన గ్రహించాడు. అంటే తనకి ఇపుడు మహా నిర్యాణ శక్తి ఉన్నదని తెలుసుకున్నాడు. ఈ శక్తి వలనే తను ఈ సహస్ర చక్రములోని అన్ని రకాల విషయ జ్ఞానాలు అందుతున్నాయని గ్రహించాడు. అలాగే శ్రీ కృష్ణుడు ఈ సహస్ర చక్రము ఆదిలో పాంచజన్య శంఖమును అలాగే అంతములో సుదర్శన చక్రమును రక్షణ కవచ మాయలుగా ఉంచి ఎవరు గూడ కాలాతీత స్థితికి వెళ్లకుండా చేస్తున్నారని పరమహంసకి అర్ధమైంది. ఈ విశ్వములో కనిపించే ప్రతి పదార్ధము, లోకము, దైవము, అన్ని గూడ ఈ సహస్ర చక్ర ఆధీనము నుండే జరుగుతాయి, కనబడతాయి, చూపబడతాయి అని ఈయనకి తెలిసింది.

ఇంతలో....

ఈయన మనో దృష్టి యందు ఈ అంతరిక్ష లోకాల దృశ్యము అదృశ్యమై.... శూన్యములో ఎవరో 25 సంవత్సరాల యువకుడు ఒక చీకటి గదిలో ఉండి అటు ఇటు తిరుగుతూ కన్పించాడు. శరీర రంగు నీలి  రంగులో ఉంది. పైగా చేతిలో మెరుస్తున్న వేణువు ఉన్నదని గమనించగానే అంటే ఈయనే...శ్రీ కృష్ణ పరమాత్ముడిని.... ఇపుడు తనని తన మాయలో ఉంచుకోవడానికి వేణుగానము చేస్తారని... ఈ నాదము ఎవరైతే వింటారో వారందరు గూడ ఈయన వశమవ్వక తప్పదని పరమహంస గ్రహించి ఈయనను సాక్షిభూతముగా చూడటం ప్రారంభించాడు. వేణు గానము మొదలైంది. ఈ నాదము వింటున్న మిగిలిన నలుగురు అయిన కాలాముఖుడు, హార్వే, జోషి, దేవి ఎంతో తన్మయత్వము చెంది ఈయన గానానికి భక్తి పారవశమైయ్యారు. కాని పరమహంస వశము అవ్వలేదు, చలించలేదు, స్పందించలేదు. దానితో ఈ నాదము ఆగిపోయింది. వేణునాధుడు అదృశ్యమయ్యాడు. అంటే ఈయన గూడ శాశ్వతుడు కాదని కేవలము కాల పురుషుడు అని పరమహంస గ్రహించే లోపుల...

జగన్మోహిని రూపము దర్శనమైంది. ఈ సుందరాంగి రూపదర్శనమే హార్వేకి, కాలాముఖుడికి, జోషికి ముచ్చెమటలు పట్టాయి. అతిలోక సౌందర్యముతో, దేవ లోక దేహముతో, దివ్య తేజస్సు శరీరముతో చేప కన్నులు, శంఖము నడుముతో, నడుస్తూ ఓంపు సొంపులు చూపిస్తూ మతైన కళ్ళతో గమ్మత్తుగా చూస్తుంటే ఎంతటి నర మాధవుడైన గూడ గతి తప్పక మానడు. పాదాక్రాంతము అవ్వక మానడు. అయిన గూడ పరమహంస పెద్దగా పట్టించుకోలేదు. ఎంతటి సౌందర్యమైన గూడ ఎప్పుడికైనా వడలి పోవాల్సిందే గదాయని ఈయన భావము. గాకపోతే మానవులకి సంవత్సరాలు పడితే దైవాలకి యుగాలు పడుతుంది అంతే తేడాయని ఈయన ఇంద్రియ నిగ్రహముతో ఉండేసరికి ముగ్ధమనోహరమైన జగన్మోహిని రూపము గూడ అదృశ్యమైంది. దానితో తమ పరికరాలలో రికార్డు అవుతున్న ఈ దృశ్యాలను చూస్తున్న ఈ ముగ్గురు చాలా నిరుత్సాహపడ్డారు. ఈమెతో మన గురూజీ సరసాలు ఆడి ఉంటే ఎంతో బాగుండేదని జోషి, హార్వేఅలాగే కాలాముఖుడు అనుకున్నారు. అంతెందుకు దేవికి మనస్సు లయ తప్పింది. ఈమెతో తను రతిలో పాల్గొంటే ఎలా ఉండేదని తను ఆలోచించే స్థితికి వచ్చిందంటే ఈ జగన్మోహిని మాయ ఎలాంటిదో ఈ పాటికే మీకు అర్ధమయ్యి ఉంటుంది.


No comments:

Post a Comment