అధ్యాయము 47

 పరమహంస కాస్త

ఆజ్ఞచక్ర ముద్రతో సాధన చేస్తుండగా.... ఉన్నట్టుండి అందరి మీద అనగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, గురువుల మీద దివ్య ప్రేమానుభూతి నిచ్చే భావాలు మొదలైనాయి. అంటే దివ్య ప్రేమ కల్గించే గుణము ఈ చక్రానికి ఉన్నదని ఈయన గ్రహించి ఈ చక్ర జాగృతి ఆరంభమైనదని తెలుసుకొని సాక్షీభూతముగా ఉన్నారు. ఆ తర్వాత ఈయనకి అనాహతముగా ఎవరి ప్రమేయము లేకుండా తనలో నుండి పంచ చక్రాల నాదాలు కలిసి  ఏకనాదముగా ఓంకారము వినిపించడము ఆరంభమైనదని గ్రహించారు. దానితో ఈ చక్ర శుద్ధి ప్రారంభమైనదని తెలుసుకొని ఈ నాదమును మరింత శ్రద్ధగా వినసాగారు. అపుడు కొన్ని క్షణాల తర్వాత ఈయన భ్రుమధ్యము యందు తెలుపు రంగుతో నిరాకారముగా రెండు కోణాలతో 'హాం' అనే మధ్యమ బీజాక్షరముతో యోగ పద్మము దర్శనమైంది. కొన్ని క్షణాల తర్వాత ఈ చక్ర మాయ దేవతయైన శని దేవుడు దర్శనమివ్వగానే..... ఈ చక్రమిచ్చే జీవ మాయ మొదలు అవుతోందని ఈయన గ్రహించిన మరుక్షణములోనే ఈయన మనో దృష్టి ముందు  ఈయన కోసము తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఎదురు చూస్తున్న దృశ్యాలు లీలగా కనిపించాయి. వీరి ఆవేదనలు, బాధలు, ఎదురుచూపులు ఎవరైన చూస్తే బాధ కల్గి ఆవేదన చెంది కొన్ని రోజులు వాళ్ల దగ్గరికి వెళ్లి ఉండాలని అన్పించే విధంగా ఈ దృశ్యాలు హార్వే పరికరము చూస్తున్న హార్వే, జోషి, దేవిలకి అన్పించిన పరమహంస తన వాళ్ల యందు స్పందించలేదు. పట్టించుకోలేదు సాక్షిభూతముగా చూస్తూ ఉండిపోయారు.

ఇంతలో....

తన కన్న తల్లి చనిపోతున్న మరణ క్షణాలు కనిపించాయి. అంటే ఈ చక్ర సిద్ధియైన దివ్య దృష్టి సిద్ధి తనకి వచ్చినదని ఈయన గ్రహించాడు. తల్లి మరణము గూడ ఈయనను చలింప చెయ్యలేదు. ఈ మరణ దృశ్యము చూసిన ఈ ముగ్గురికి కన్నీరు ఆగలేదు. మా గురుమాత మరణము పొందారు అనే విషయము వీళ్లు జీర్ణించుకోలేకపోయారు. కాని పరమహంసలో ఎలాంటి స్పందనలేదు. ఏదో నాటక దృశ్యము చూసిన వాడిలాగా ఆమె తన కన్న తల్లి కానట్లుగా చూశారు తప్ప పెద్దగా పట్టించుకోలేదు. కాలము తన పని తాను చేసింది. అదే సృష్టించిన పాత్రను అదే తీసుకొని వెళ్ళింది అనే స్థితిలో పరమహంస అపుడికే చేరుకున్నారు. తన తల్లి మరణ దృశ్యానికి స్పందిస్తే జీవమాయలో పడినట్లే గదా. తను సత్యమని తను చూసే ప్రపంచము అలాగే దృశ్యాలు అన్ని సత్యమేనని తను నమ్మినట్లేగదా. జీవమాయ అంటే ఇదే గదా. కనిపించేది అసత్యమని కనిపించనిది సత్యమని తను తెలుసుకుంటే ఈ చక్ర జీవమాయ దాటుకోవాలి లేదంటే తన తల్లి చనిపోయినదని తను ఒక కొడుకుగా విలపిస్తూ కూర్చుంటే ఇక తను జీవమాయను ఏమి దాటినట్లు. దాటలేదు గదా. తను దాటాకపోతే ఇక తను ఇతరులను ఎలా దాటించగలడు అంటూ కాలాముఖాచార్యుడు అనుకోసాగారు. ఈ ఆలోచనలు గూడ హార్వే పరికరములో రికార్డు అవుతుండేసరికి ఈ ముగ్గురు గూడ అవును గదా. ఇది గూడ నిజమే గదా. మన గురూజీ జీవమాయ దాటుతున్నారు. దాటాలి గదా అనుకోని కన్నీళ్లు తుడుచుకొని స్థిమిత పడ్డారు.

           పరమహంస ఎపుడైతే తన జీవమాయను దాటాడో అపుడు ఈ చక్ర శక్తి దేవతయైన 'హాకిని' దర్శనమైన ఈమెను సిద్ధులు గావాలని ఈయన ప్రార్ధించకపోయేసరికి ఈమె కాస్త అదృశ్యమైంది. ఆ తర్వాత ఈ చక్ర దైవమైన 'శంభువు' దర్శనమిచ్చాడు. ఈయనను గూడ వరాలు గావాలని పరమహంస అడగకపోయేసరికి ఈయన గూడ అదృశ్యమయ్యేసరికి అంటే ఈ చక్ర దైవము గూడ శాశ్వతుడు కాదని పరమహంస గ్రహించి తన సాధనను కొనసాగించారు. అపుడు రెండు వేలకి పైగా తపోలోకాలు అలాగే 19 వేల శని గ్రహ లోకాలు అంతరిక్షము నందు ఉన్నట్లుగా ఈయన మనో దృష్టియందు కనిపించిన పెద్దగా స్పందించలేదు.

కొన్ని క్షణాల తర్వాత

ఈయన మనో దృష్టి యందు నాలుగు గుహలుండి వీటి మధ్యలో శిలువాకరము లేదా ప్లస్ గుర్తుగా మహా ద్వారము లీలగా కనబడుతూ... ఆపై చాలా స్పష్టంగా  కనిపించసాగింది.ఈ గుహ సముదాయమునే జీవుడు మరణ సమయములో చూస్తారని... ఇవి వరుసగా కర్మ, గుణ, కాల, బ్రహ్మ చక్ర గుహాలని.....ఇవే బ్లాక్ హ◌ోల్స్ లుగా పిలువబడుతున్నాయని.... వీటిలో చనిపోయే జీవుడికి ఇంకా కర్మ ఫలితము ఉంటే కర్మను అనుభవించడానికి కర్మ చెయ్యడానికి కర్మ గుహాలోనికి వెళ్లి భూలోకము నందు పునః జన్మలు ఎత్తుతాడని అదే చేసిన కర్మ ఫలితాలు అనుభవించడానికి గుణ చక్ర గుహ యందు ప్రవేశించి పుణ్య ఫలితాలు అనుభవించడానికి స్వర్గానికి అలాగే పాప ఫలితాలు అనుభవించడానికి  నరకానికి ఈ చక్ర అనుసంధానము ఈ రెండు లోకాలకి వెళ్లతారని ఇక మూడవ చక్రమైన కాలచక్ర గుహ యందు ఊర్ధ్వ సప్తలోకాల యందు జీవించడానికి జీవులు కాస్త దేవుళ్లుగా మారి వెళ్లతారని ఇక నాలుగవ బ్రహ్మ చక్ర గుహ యందు అంతరిక్షములో ఉన్న 1000 లోకాలు అనగా గోలోకము,త్రిలోకాలు, గురులోకం, ఆనందలోకము, సప్తర్షిలోకాలు, ధృవ లోకం, గ్రహాల లోకాలు, సప్త చిరంజీవుల లోకాలు ఇలా మొదలగు లోకాలలో వారి కర్మానుసారము వెళ్లి యుగాల నుండి కల్పాంతము దాకా జీవిస్తారని.... ఈ ధ్యాన దృశ్యాలు చూస్తున్న కాలాముఖాచార్యుడు అనుకోసాగాడు. ఇవన్నీ గూడ హార్వే పరికరములో రికార్డు అవుతున్నాయి. ఈ ముగ్గురు గూడ వీటిని ఆశ్చర్యానందముతో చూస్తున్నారు. కాని పరమహంస వీటిలోనికి వెళ్లడానికి పెద్దగా ఆసక్తి చూపించడము లేరని వీళ్లు గమనించారు. కాని డాక్టరు జోషికి మాత్రము ఆనందముగా ఉంది. ఎందుకంటే జీవుడికి మరణ సమయములో కనిపించే గుహ ఇదేనని.... ఈ గుహ సముదాయములో ఉండే నాలుగు గుహలలో యముడిని చూసి చాలా భయపడే దృశ్యాలు తను చూడటము జరిగినదని, కొంతమంది మాత్రము ఆనందపడటము అనేది స్వర్గలోక దేవతలను చూసినపుడు అని జోషి తెలుసుకున్నారు. అంటే జీవుడి యొక్క భ్రుమధ్య ప్రాంతములో ఉండే గుహను చూసి జీవుడే ఇన్నాళ్లు మరణ భయముతో భయపడుతున్నాడని తనకి శాస్త్రీయముగా తెలిసింది. అంటే తన మొదటి ప్రయోగము పూర్తి అయింది. 


ఇక మరణించిన జీవి ఇక్కడికి ఎలా చేరుకుంటాడో తను తెలుసుకోవాలి అనే ఆలోచన వచ్చింది. దీనికి సమాధానముగా పరమహంస యొక్క దివ్యదృష్టికి ఒక దృశ్యము కనబడసాగింది. ఈ దృశ్యమును చూస్తున్న జోషిలో ఏదో తెలియని వణుకు, భయం, ఆందోళన, అనుమానం మొదలైంది. కారణము ఈ దృశ్యములో తను ఉండే ఇల్లు కనబడుతుంది. ఆ ఇంటి ముందు తన కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఉండి ఏడుస్తూ, బాధపడుతూ కనిపించారు. ఇంతలో ఇంటిముందు తన అన్న శవము లీలగా కనిపించేసరికి జోషికి నోట మాట రాలేదు. అంటే తన అన్నయ్య చనిపోయాడన్న ఆలోచనకే మెదడు మొద్దుబారింది. ఇంతా జరుగుతున్న తనకి ఎవరు ఎందుకు ఫోన్ చెయ్యలేదని చూసుకుంటే అది తను పైన గదిలో ఉంచినానని గుర్తుకు వచ్చి గబా గబా మెట్లు ఎక్కి పై గది చేరుకొని తన ఫోన్ చూస్తే అందులో 50 పైగా మిస్డ్ కాల్స్, 30 కి పైగా మెసేజ్ లుండేసరికి.... గబగబా తన తల్లికి ఫోన్ చేస్తూ మళ్లి తిరిగి రహస్య గది చేరుకొని ఆమెతో మాట్లాడసాగాడు. రాత్రి ఉన్నట్టుండి గుండెపోటుతో మరణించాడని తనకి తన వాళ్లు ఎన్ని సార్లు ఫోన్ చేసిన ఎత్తక పోయే సరికి గత్యంతరము లేక తప్పు అయిన చెయ్యక తప్పలేదని ఈ శవ దహన ఏర్పాట్లు చేస్తున్నారని తల్లి చెప్పగానే..... అన్ని తెలుసుకొని తను అక్కడ లేకపోయిన అక్కడ జరిగే ప్రతి విషయము తను చూస్తున్నానని బాధపడవద్దని తల్లికి ధైర్యము చెప్పి వదిన పిల్లలు మాట్లాడి ఆ తర్వాత తన కుటుంబ సభ్యులతో గూడ మాట్లాడి వాళ్లకి ఓదార్పు నిచ్చి ఫోన్ పెట్టేశాడు. ఈ దృశ్యము తనకి గురూజీ చూపించడములో ఏదో అంతరార్థమున్నదని  అనుకుంటూండగా చెట్టుక్రింద            చనిపోయిన తన అన్న కనిపించేసరికి అంటే ఇది అన్న యొక్క ఆత్మయని అదే సూక్ష్మశరీరమని జోషి గ్రహించి హార్వెకి, దేవికి గూడ చూపించాడు. అంటే ఈయన మరణము ద్వారా చనిపోయిన జీవుడు ఎక్కడికి వెళతాడో తమకి గురూజీ చూపించు పోతున్నారని వీళ్లకి అర్థమైంది. బాధకన్నా బాధ్యత గుర్తుకు వచ్చింది.

ఉన్నట్టుండి 

జోషికి కాలాముఖిడి ద్వారా శక్తిపాతము జరగడముతో...

జోషికి కనుబొమ్మల మధ్య... బొట్టు పెట్టుకొనే ప్రాంతములో ఏదో దివ్యకాంతి పుంజము వెలుగుతున్న దృశ్య అనుభూతి పొందుతూ అంటే యోగశాస్త్ర గ్రంధాలలో చెప్పబడే మూడవ కన్ను ఉండటం నిజమేనని.... అది మనోదృశ్యాలు చూపించడము నిజమేనని తను అనుకుంటూ  త్రినేత్రముతో తేరిపార చూడగా...

తన స్నేహితురాలు స్వాతి కనిపించినది.అంటే ఈమె ద్వారా తనకి మరణము తర్వాత ఏమి జరుగుతుందో లోకానికి తెలియచేస్తున్నారని జోషికి అర్ధమైంది.ఇతని ధ్యానదృశ్యాలు గూడ హర్వే పరికరములో రికార్డు అవ్వడము హర్వే,దేవి చూసి ఆశ్చర్యనందాలకి గురి అవుతూ ఆసక్తిగా గమనించసాగారు.ఇంతలో


స్వాతి...

ఈ మధ్యనే బి.సి.ఏ పూర్తి చేసి

ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుండగా...

ఈమె జీవితములో అనుకోని సంఘటన జరిగింది! తను ఇన్నాళ్లుగా ప్రాణప్రదముగా పెంచుకుంటున్న జంట తెల్లని ప్రేమపావురాలు తన కళ్ళ ముందర... తన చేతులలో అనుకొని విధంగా... ఎవరు ఊహించని విధంగా చనిపోవడము ఈమెను బాగా కలిచివేసింది! మరణ వేదన మొదలైంది! ఈ జీవులు లాగానే మనము గూడ ఎపుడో ఒకప్పుడు ఏదో ఒక వ్యాధితో లేదా కారణముతో ఆకారణముగా చనిపోవలసినదే గదా? అసలు మరణము అంటే ఏమిటి ? మనం చనిపోయిన తర్వాత మనకి ఏమి అవుతుంది! అసలు మరణము తర్వాత మనకి జీవితము ఉంటుందా? ఈ జీవితము గురించి మనకి గుర్తు ఉంటుందా? చనిపోయిన తర్వాత ఆత్మ ఏమవుతుంది? ఒకవేళ స్వర్గానికి లేదా నరకానికి వెళ్లుతామా? నిజానికి ఈ లోకాలున్నాయా? లేక కల్పితమా? మరణించిన వారు ఎక్కడికైనా వెళ్లతారా?మరణించిన తర్వాత తిరిగి వెనక్కి వస్తారా? పునః జన్మ ఎలా సంభవిస్తుంది? అసలు పునఃజన్మ ఉందా? మరణాంతర జీవితము ఏమిటో... ఇలా ఎన్నో ధర్మ సందేహాలు ఈమెను చుట్టుముట్టినాయి. వీటి జవాబుల కోసము ఆ ఊరి శివాలయ పూజారిని అడిగితే గరుడ పురాణము చదివితే ఇందులో నీ ప్రశ్నలకి సమాధానాలుంటాయని చెప్పితే... ఈ పుస్తక గ్రంధమును చదవడము ప్రారంభించినది!


                   చనిపోయినవాడికి 12 రోజుల పాటు పెట్టే పిండాల వలన పిండదేహము ఏర్పడే విధానము , అదికాస్త 13 వ రోజు యమభటుల వెంట తను భూలోకములో చేసిన పాప కర్మలను క్షయము చేసుకొనుటకు యమపురికి వెళ్లే విధానము , ఈ లోకానికి వెళ్లుటకు పట్టే ఒక సంవత్సర కాలములో పిండ ప్రధాన కార్యక్రమములో ఇచ్చే దశ దానాలు ఈ జీవుడికి ఎలా ఉపయోగ పడే విధానము అలాగే యమలోక వివరాలు , అక్కడ వేసే శిక్షలు గూర్చిన వివరాలు ఈమె తెలుసుకొని ఇదంతా చూస్తుంటే యమగోల సినిమా కథలాగా ఉందని... అటు నమ్మటానికి లేకుండా ఇటు నమ్మే విధముగా... అర్ధమై అర్ధముకాని విధముగా ఈ పురాణమున్నదని ఈమె గ్రహించినది! 

దానితో ఇలా గాదనుకొని శాస్త్రాలు ప్రక్కన పెట్టి సైన్స్ ఈ విషయము గూర్చి ఏమి చెపుతుందోనని తనకి తెలిసిన వైద్యుడి దగ్గరికి వెళ్లి తన ధర్మసందేహమును ఆయనకీ చెప్పింది. ఆయన వెంటనే " అమ్మాయి! నేను గూడ గరుడ పురాణము చదివాను! అది చెప్పేది నిజమా కాదా యని గత కొన్ని సంవత్సరాల నుండి నా దగ్గరికి వచ్చే రోగులలో చనిపోయేవారిని చాలా దగ్గరి నుండి పరిశీలించి చూసేవాడిని! వాళ్ళల్లో కొంతమంది చనిపోతూ...గు...గు...అంటూ...ఏదో గుహను చూస్తూ చనిపోతున్నట్లుగా... మరి కొంత మంది ఎంతో ప్రకాశవంతమైన కాంతి పుంజమును చూస్తున్నట్లుగా... కళ్ళను విప్పారించుకుంటూ... చనిపోవడము చూశాను. అదిగాక మరి కొంతమంది ఎందులో ఏదో నదిలో మునిగిపోతూ భయపడుతున్న కళ్ళను చూశాను! కొందరు ప్రశాంతముగా కన్నుమూస్తే మరి కొందరు అశాంతిగా కన్ను ముయ్యడము గమనించాను! అదియు గాకుండా మనిషి గుండె ఆగిపోయిన మూడు నిమిషాల వరకు స్పృహతో గూడిన ఏదో తెలియని అవగాహన స్థితిలో వాళ్ళు ఉంటారని... దీనికి కారణము గుండె ఆగిపోయిన 20 లేదా 30 క్షణాల వరకు మెదడు పని చెయ్యడము వలన ఇది జరుగుతోందని న్యూయార్క్ విశ్వ విద్యాలయ శాస్త్రవేత్త అయిన డాక్టర్ శ్యాం సోర్నియా చెప్పడము జరిగింది! పైగా చనిపోయేవారందరు గూడ ఏదో ఒక అవగాహన పొందుతున్నారని అది మనకి చెప్పలేకపోతున్నారని ఎందుకంటే వైద్యము కోసము వైద్యులు ఇచ్చే మత్తు మందు ప్రభావము లేదా రోగి వాడే మందుల ప్రభావము వలన ఈ అవగాహన విషయాలు అనుభూతులు వారు మర్చిపోతున్నారని... చచ్చి బ్రతికిన 40 % మంది అనుభవాలు బట్టి మనకి తెలుస్తోందని ఇంగ్లాండ్ లోని సౌత్ ఆంఫ్టన్ విశ్వ విద్యాలయ శాస్త్ర వేత్తలు చెప్పడము జరిగింది! 

ఈ పరిశోధనలో ఒకసారి ఒక విచిత్ర సంఘటన జరిగింది! అది ఏమిటంటే ఒక చనిపోయే వ్యక్తిని బ్రతికించాలని కార్టియో పల్మనరీ  రిసిపిటషన్ చేస్తున్నపుడు అతడి  గుండె ఆగిపోయింది! ఇతను మరణించాడని వైద్యులు నిర్ధారించుకున్న ఏడు నిమిషాల తర్వాత ఇతను కళ్ళు తెరవడము జరిగింది! ఇలా చనిపోయిన కొన్ని నిమిషాల తర్వాత బ్రతికిన వ్యక్తిని వైద్యులు ఒక ప్రశ్న అనగా నీకు ఈ ఏడు నిమిషాలలో ఏమి జరిగినది అన్నపుడు... అతడు.. నన్ను ఎవరో నా శరీరము నుండి నా ఆత్మను బయటికి లాగారు! ఇది చాలా తేలికగా అనిపించింది! ఆ తర్వాత ఇలా బయటికి వచ్చిన నేను ఈ ఆసుపత్రి రూము చివరిలో నిలబడి నా శరీర గుండెకి మీరు చేస్తున్న వైద్య విధానమును చూశాను! అందులో ముఖ్యంగా ఈ యంత్రము నుండి ప్రతి మూడు నిమిషాలకి ఒకసారి మాత్రమే విన్పించే ' బీప్ ' శబ్దాన్ని విన్నాను! ఆ తర్వాత నన్ను బయటికి లాగినవాళ్లు నన్ను ఒక గుహ మార్గము గుండా ప్రయాణింప చేశారు! ఇది చాలా గాఢాంధకార మార్గము! ఇలా ఈ మార్గముగుండా ఎంతసేపు ప్రయాణించానో నాకు తెలియదు! కాని ఈ మార్గము అవతలి వైపు ఒక దివ్యకాంతి ఉన్న అద్భుతమైన వెలుగుయున్న మహా తేజస్సును చూశాను! అక్కడ అది నన్ను అశరీరవాణితో ఏవో ప్రశ్నలు అడిగింది! వాటికి నేను సమాధానము చెప్పినట్లుగా గుర్తు! అ తర్వాత కళ్ళు తెరిచి స్పృహలోనికి వచ్చాను! అలా చచ్చి ఇలా బ్రతికి బయట పడ్డాను అని చెపుతుంటే వైద్యులు ఇతడు చెప్పే విషయాలను శ్రద్ధగా ఒక డైరీలో వ్రాసుకున్నాను! ఈ యదార్ధ సంఘటనను 1956 సంవత్సరములో డాక్టర్ రేమాండ్ మూడి అను వైద్యుడి సమక్షములో జరిగింది! తర్వాత ఈయన ఈ విషయాన్ని తను రచించిన Life after Death  అను పుస్తకములో చెప్పడము జరిగింది! అంటే ఈ లెక్కన చూస్తే లక్షలాది మంది మరణమునకు సంబంధించిన స్పష్టమైన అనుభవాలు అనుభవించి ఉంటారని అంచనాలు సూచిస్తున్న వాటిని శాస్త్రీయముగా నిరూపించే ప్రయత్నములో మన సైన్సు ఉన్నదని... " ఆయన చెప్పడముతో నమస్కారము చేసి స్వాతి అక్కడ నుండి నిరుత్సాహముగా తన ఇంటికి బయలుదేరినది!


            దారిలో గుడి పూజారి ఈమెకి ఎదురై " " అమ్మాయి! ఇంకా నీ ప్రశ్నకి సమాధానము దొరికినట్లుగా లేదని నీ ముఖము చూస్తుంటే తెలుస్తోంది. " అమ్మాయి! శాస్త్రాలు , సైన్స్ అన్నిగూడ నీ ప్రశ్నకి తగ్గ సమాధానము సాక్ష్యాధారాలుగా నిదర్శనాలు ఏవి చూపించలేవు! నీకు ఏమో నిదర్శనాలు లేనిదే దేనిని ఓ పట్టాన నమ్మవు! నమ్మకమును పెంచుకోవు! అంటే నీకు నీవు కళ్లారా ఎవరైనా మరణ అనుభవము చూస్తే కాని ఈ విషయములో నీ ప్రశ్నకి సమాధానము దొరికినట్లుగా అనుకుంటావు. శబ్ద పాండిత్యము కన్నా అనుభవ పాండిత్యమునే నమ్ముతావు! ఇలాంటి జ్ఞాన గురువులు నీకు కాశీక్షేత్రములో తప్ప ఎక్కడ దొరకరు! కాబట్టి నీవు కాశీక్షేత్రానికి వెళ్లి నీ ప్రశ్నకి సమాధానము కనిపెట్టు! " అని చెప్పి తన దారి తాను వెళ్ళిపోయాడు .


            దానితో ఇంటిలో వాళ్ళకి తన స్నేహితులతో కలిసి తీర్ధయాత్ర పేరుతో కాశీక్షేత్రం బయలుదేరి కాశీకి చేరుకుంది. అక్కడ ప్రతి 20 నిమిషాలకి వచ్చే శవాలను ప్రతినిత్యము చితాగ్ని దహనము చేసే మణికర్ణికా ఘాట్ ను ఈమె చూడగానే ఏదో తెలియని అద్వితీయమైన ప్రశాంత స్థితిని పొందసాగింది! ఎప్పుడు గూడ తన జీవితములో ఇలాంటి ఆనందస్థితి ఒకటి ఉంటుందని అనుకోలేదు! తను ఇలా పొందుతానని ఊహించుకోలేదు! అన్ని అనుకున్నట్లుగా జరిగితే అది జీవితము ఎందుకు అవుతుంది!


                 ఇలాంటి ఆనందస్థితిలో తను యుండగా... తన ఎదురుగా గంగాస్నానము చేస్తున్న నగ్న నాగసాధువు మీద ఈమె దృష్టి పడింది! తన ప్రశ్నకి ఈయన ఏమైనా సమాధానము చెపుతారా అని బలముగా అన్పించడముతో ఆయన రాకకోసము ఎదురుచూడసాగింది! ఈమె స్నేహితులు ఈమెను వదిలిపెట్టి వాళ్ళు గంగాస్నానము చెయ్యటానికి క్రిందకి దిగినారు! ఇంతలో నాగసాధువు బయటికి వచ్చి  అప్పుడే దహనము చేసినవాడి చితాభస్మమును విభూధిగా ఒంటినిండా పూసుకుంటూ... మెడలో రుద్రాక్షమాలలు , చేతిలో త్రిశూలము పట్టుకొని శివాంశ రూపధారిగా ఈ ఘాట్ నుండి బయటికి వెళుతున్న సమయములో.... ఇదే అదనుగా అక్కడే ఈ అవకాశము కోసము ఎదురు చూస్తున్న స్వాతి వెంటనే ఈయన కాళ్ళ మీదపడి " స్వామి! నా ప్రశ్నకి సమాధానము మీరు తప్ప ఎవ్వరు ఇవ్వలేరు! నాకు సంతృప్తి పరిచే సమాధానమును అనుభవపూర్వకముగా ఎవరిదైనా మరణ అనుభవము నాకు చూపించండి అని అంటుంటే... "  ఆ నాగ సాధువైన ఆత్మయోగి పరమహంస పవనానంద ఒక చిరునవ్వు నవ్వి


  " తల్లి! లోకోత్తరమైన ప్రశ్నతో ఉన్నావు! బ్రతికి ఉండగానే చచ్చేవాళ్లు ఎక్కడికి వెళ్లుతారో అక్కడికి వెళ్లి తెలుసుకోవాలనే నీ ఆలోచన సంకల్పము కోసము ఏకముగా ఈ క్షేత్రానికి రావడము బట్టి చూస్తుంటే నీ మనో సంకల్పబలము యెట్టిదో తెలుస్తోంది! లే! తల్లి! నీకు అన్ని వివరముగా చూపిస్తాను! నావంతు ప్రయత్నము నేను చేస్తాను! అంటూ ఈమెను పైకి లేపి... ఈమె భ్రూమధ్య స్థానములో తన బొటన వ్రేలు పెడుతూ " తల్లి! నీవు అడిగిన ప్రశ్నకి సమాధానానికి గావాలసిన అనుభవ నిదర్శనాలు నీ భౌతిక కళ్లతో చూడలేవు! అందుకే నాకున్న శక్తి పాత సిద్ధితో నీ మనోనేత్రమును తెరిపిస్తున్నాను! కాని ఈ కన్ను ద్వారా కనిపించే మనోదృశ్యాలను అన్నింటిని మౌనముగా... సాక్షిభూతముగా... దేనికి స్పందించకుండా... దేనికి భయపడకుండా.. దేనిని మార్చకుండా... దేనికి ఆశపడకుండా... దేనికి ఆలోచించకుండా జాగ్రత్తగా చూడు! అన్ని వివరాలు నీకే తెలుస్తాయి! అంటూ తన చేతిని తీసి వెయ్యగానే....


స్వాతి కనుబొమ్మల మధ్య... బొట్టు పెట్టుకొనే ప్రాంతములో ఏదో దివ్యకాంతి పుంజము వెలుగుతున్న దృశ్య అనుభూతి పొందుతూ అంటే యోగశాస్త్ర గ్రంధాలలో చెప్పబడే మూడవ కన్ను ఉండటం నిజమేనని.... అది మనోదృశ్యాలు చూపించడము నిజమేనని తను అనుకుంటూ తనతో వచ్చిన జలకాలాడుతున్న తన స్నేహితుల వంక త్రినేత్రముతో తేరిపార చూడగా... వారాంతాగూడ ఒకరు పందిగాను , మరొకరు కుక్కగాను , ఇంకొకరు పులిగాను , జింకగాను , ఏనుగుగా... మరొకరు సాధువుగా కనిపించేసరికి ఈమెకి ఏమి అర్ధము కాలేదు! ఆ తర్వాత ఈ నీటి ఓడ్డున గెంతులు వేస్తున్న చేపలు , అక్కడవున్న ఆవులు , కుక్కలను చూస్తుంటే వారంతా జటాధారియైన మహర్షులుగా , సాధువులుగా కనిపించేసరికి వామ్మో! ఈయన ఏదో చేసినాడు! అంతా తికమకగా కనబడుతోంది! మనుష్యులు కాస్త జంతువులుగాను... జంతువులు కాస్త మనుష్యులుగా కనబడుతున్నారు! ఏదో తెలియని భయానికి ఈమె గురి అవుతుండగా... అక్కడే ఉన్న ఆత్మయోగి ఇది గమనించి " తల్లి! కంగారుపడకు! నీ కళ్ళకి ఏమి కాలేదు! నీవు చూస్తున్నదే నిజమైనది! వారి వారి నిజ జన్మలు అవే! కర్మ నివారణకోసము మనుష్యులు కాస్త జంతువుల జన్మలు ఎత్తినారు! అలాగే జంతువుల రూపములో మనుష్యులు కాస్త సాధన చేసుకుంటున్నారు! అంతే తల్లి! ఇదే యదార్ధ జ్ఞాన రూపాలు! భౌతిక నేత్రాలకి కనిపించేది అంతాగూడ మర్చిపోయిన జ్ఞాపక జన్మలే! మనో నేత్రములో కన్పించేది అంతాగూడ జ్ఞప్తికి వచ్చిన జ్ఞానస్పురణ జన్మలు అన్నమాట! అంటుండగా


 " స్వామి! నాకు గావలసినది ఇదిగాదు! జన్మాంతర జ్ఞానము గాదు! అలాగే త్రికాల జ్ఞానముగూడ అవసరము లేదు! నా ప్రశ్నకి సమాధానము...అదిగూడ అనుభవపూర్వకమైన నిదర్శనాలతో గావాలి అనగానే.... "


అక్కడికే వస్తున్నాను తల్లి! కంగారుపడకు నెమ్మదిగా నేను చెప్పినట్లుగా పద్మాసనములో కూర్చొని... శ్వాస మీద ధ్యాసపెట్టు! నీలో వినిపించే ఓంకారనాద శబ్ధ బ్రహ్మను విను! నేను చెప్పేదాకా ఈ ధ్యానస్థితి నుండి బయటికి రాకు" అని చెప్పి చెప్పగానే స్వాతి కాస్త పద్మాసనములో కూర్చొని శ్వాస మీద ధ్యాస పెడుతూ శబ్ధనాదము వినడము ప్రయత్నములు మొదలు పెట్టింది! ఇంతలో ఈమెకి అనుకోకుండా శ్వాసకి ఇబ్బంది అయ్యి ఎగశ్వాస స్థితికి వచ్చింది! శరీరము శ్వాసకోసము బాగా ఊగిసలాడుతూ ఎగిరి ఎగిరి పడుతోంది! 


ఈమె శరీరమును చూసిన ఈమె స్నేహితులు ఈమె చుట్టూచేరి " స్వాతి! స్వాతి " నీకు ఏమైందే? ఎందుకు ఎగ శ్వాస పడుతున్నావు! లే! స్వాతి! లే! చలి ప్రాంతము గావడము వలన శ్వాసకి ఇబ్బంది పడుతోంది! అసలే దీనికి ఆస్తమా సమస్య గూడ ఉంది! దీనికి ఏమైనా జరిగితే దీని అమ్మానాన్నకు ఏమని చెప్పాలి? అనుకుంటూ భయపడుతూ , బాధపడుతూ ఉండగా.. ఎవరో ఈమె శ్వాసను చూసి "స్వాతి! శ్వాస ఆగిపోయింది!స్వాతి చచ్చిపోయింది" అని బిగ్గరగా అరిచేసరికి అందరు ఆ ఘాట్ లో ఏడుపు అందుకున్నారు! ఇంతలో స్వాతి అరుస్తూ " ఒసేయ్! నేను చావలేదే? నేను బ్రతికే ఉన్నాను! అంటున్న మాటలు తన స్నేహితురాళ్ళకి వినిపించడంలేదని తెలియగానే... అపుడు స్వాతికి తను నిజముగానే చచ్చిపోయినానని... తన సూక్ష్మదేహము అయిన ఆత్మ ఇదియని... తన భౌతిక పార్థివ దేహము ఎదురుగా కనిపించేసరికి స్వాతి సూక్ష్మ దేహమైన ఆత్మకి అసలు విషయము అర్ధమైంది! ఈ యోగి ఎవరో గాని తనకి ఇతరుల మరణ అనుభవము చూపించమని అడిగితే ఏకముగా తనని చంపి తనకే తన మరణ అనుభవమును చూపుతారా? అనుకుంటుండగా ఎవరో దూతలు ముగ్గురు వచ్చి తన ఆత్మను తీసుకొని వెళ్ళటానికి వచ్చినారని ఈమె గ్రహించింది! 


అంటే మనిషి చనిపోయినపుడు దూతలు రావడము అనేది నిజమని ఈమె తెలుసుకుంది! ఈ విషయము గుర్తుపెట్టుకొని మనవాళ్లకి చెప్పాలి! ఏమిటి చెప్పేది నా బొంద! నా బూడిద! చచ్చి చాలాసేపు అయింది గదా! బ్రతికి ఉంటే చెప్పవచ్చును! ఇప్పుడు చెప్పిన ఎవరికి వినబడి చావదు! దీనమ్మ జీవితము! ఏదో అనుకుంటే ఏదో అయింది! నా చావు నాకే చూపించినాడు ఈ యోగి ! అనుకుంటుండగా... ఈమె పార్థివ దేహము చుట్టూ చేరిన స్నేహితుల ఏడ్పులు చాలా బిగ్గరముగా వినబడసాగినాయి! కాని తన మాటలు వాళ్ళకి వినిపించకపోయేసరికి ఈమె ఆత్మ కాస్త మరింత ఆవేదన చెంది తిరిగి పార్థివ దేహములోనికి ప్రవేశించగానే... ఈమె దేహములో సూక్ష్మ కదలికలు రావడము మొదలైంది! కాని శరీరములో తన ఆత్మ ఇముడలేక ఇబ్బంది పడటము ఈమె గమనించింది! ఏదో శక్తి తన శరీరము నుండి ఆత్మను ఆకర్షించబడి బయటికి లాగుతోందని తెలుసుకుంది! అది తన  వెంట ఉన్న ఇద్దరి దైవ దూతల యొక్క చేతుల నుండి ఏదో ఆకర్షణ శక్తి ద్వారా తన ఆత్మ ఆకర్షించబడి బయటికి వస్తోందని గమనించింది! 


దానితో ఈ ఆత్మ తన పార్థివ శరీరానికి 12 అడుగుల ఎత్తులో పైన ఉండడము గమనించింది! ఈ 12 అడుగుల దూరము కోసము పిండప్రధాన కార్యక్రమాలు 12 రోజులపాటు చేస్తారని...దాని వలన ఈ అడుగుల దూరము తగ్గి... పార్థివ దేహ సంబంధమున్న మరొక పిండ దేహము ఏర్పడే విషయమును గరుడ పురాణములో చదివిన విషయము స్వాతి ఆత్మకి గుర్తుకు వచ్చింది!


                           ఉన్నట్టుండి సూక్ష్మదేహ ఆత్మ యందు ఉన్న మూలాధార చక్రముతో ఈ పార్థివ దేహము ఉన్న వెండి తీగె లాంటి ప్రేగు బంధము తెగిపోవడము గమనించింది! అపుడు బ్రొటనవ్రేలు పరిమాణమున్న తనలాంటి రూపదేహమైన యాతనదేహముగా బయటికి వచ్చింది.అంటే ఈ క్షణము నుండి తన ఆత్మకి అలాగే తన పార్థివ దేహానికి యెట్టి సంబంధము లేదని గ్రహించిన ఆత్మకు కాస్త ఆత్మ క్షోభ మొదలైంది! స్నేహితుల మాటలు వినబడుతున్నాయి! తన తల్లిదండ్రులకి  ఫోన్ చేసి అన్ని విషయాలు చెపుతున్నట్లుగా వినబడటముతో తన తల్లిదండ్రులు గుర్తుకు వచ్చేసరికి ఈమె ఆత్మకి శాంతి లేకుండా పోయింది! అందరు అన్ని గుర్తుకు రావడము మొదలైంది! చేసిన తప్పులు , పాపాలు , పుణ్యకార్యాలు , గుర్తింపులు , అవమానాలు అన్ని ఒక్కొక్కటిగా గుర్తుకు రావడము ఆరంభమైంది! తన పార్థివ దేహము నుండి తన ఆత్మకి స్వేచ్ఛ లభించేసరికి ఏదో తెలియని అద్వితీయశక్తి ఆత్మకి వచ్చినట్లుగా ఈమె గ్రహించింది! అంటే మనిషి చనిపోతే 7 గ్రాముల బరువుకు తగ్గుతాడని చెప్పిన విషయము నిజమేనని ... ఈ బరువు అనేది సూక్ష్మదేహమైన ఆత్మబరువు అని తెలుసుకుంది. 

ఇంతలో ఈమె పార్థివ దేహానికి ఈ ఘాట్ యందు అంత్యక్రియలు జరగటానికి జరిగే ఏర్పాట్లులను అనగా  కాల్చడానికి పేర్చిన తన చితికి పదిమూరల దూరములో ఉండి ఈ తంతును ఈమె ఆత్మ కళ్లారా చూస్తుండగానే జరిగింది!కాని చితికి నిప్పు పెట్టడము వాయిదా పడినది.ఈమె తల్లిదండ్రుల రాక కోసము అందరు ఎదురుచూడసాగినారు.

కాని ఏమి లాభము! తన ఆత్మఘోష వారికి... ఎవరికి వినబడదని తెలుసుకొని...దూతల సహాయ సహకారాలతో... తనకున్న ఆత్మశక్తితో చివరికోరికగా తనకి బాగా నచ్చిన ప్రాంతాలు , ప్రదేశాలు , ఆఫీసులు , పార్క్ లు , స్కూలు , కాలేజీ , స్నేహితుల ఇళ్లు, బంధుమిత్ర ఇళ్లు ఇలా అన్నింటిని ఆకాశగమన సిద్ధితో ఇచ్ఛా పూర్వకముగా చూసుకుంటూ ఉండగా తన ప్రాణస్నేహితురాలు మరణించిన దృశ్యము స్వాతి ఆత్మకి కనపడినది.ఏమి జరుతుందో చూడాలని ఆసక్తి ఈమెలో మొదలైంది.అపుడు ఈమెతో ఉన్న దూతలు"ఓ దేహమా!నీకు మరణాంతరము ఏమి జరుగుతుందో ప్రత్యక్షానుభవము గావాలనే ఆఖరి కోరికగా కోరుకున్నావు గదా.నీవు గూడ మాతోపాటు ప్రయాణించి ఇపుడు చనిపోయిన నీ స్నేహితురాలి మరణాంతర యాత్రను చూడు" అంటూ చనిపోయిన దేహము దగ్గరికి ఈ నలుగురు చేరుకున్నారు.

అపుడు ఈ దూతలు ఈమె స్నేహితురాలి బ్రొటన వ్రేలు పరిమాణము ఉన్న యాతన శరీరమును ఒక సీసాలో పెట్టుకొని ఆకాశమార్గమున ఒక గుహామార్గమునందు రెండు ముహార్తల కాలము ప్రయాణము చేస్తూ యమపురికి చేరుకొని యమధర్మరాజు ముందు ఈ దేహమును ఉంచినారు.అపుడు ఆయన వారితో "  కింకరులారా!మంచిది!ఈ జీవుని 13వరోజున నా దగ్గరికి తీసుకొని రండి.అపుడు ఈ దేహము చేసిన పాపపుణ్యాల బట్టి శిక్షలు గురించి ఆలోచన చేద్దాం అని ఆజ్ఞ చెయ్యగానే...ఈ యమదూతలు కాస్త ఈ యాతన దేహమును తిరిగి ఈమె పార్ధవదేహమున్న చోటుకి తీసుకొని రావడము జరిగింది.  ఇంతలో ఈమె పార్థివ దేహానికి తన ఊరి పొరిమేరలలో ఉన్న స్మశాన వాటిక యందు యందు అంత్యక్రియలు జరగటానికి జరిగే ఏర్పాట్లులను అనగా  కాల్చడానికి పేర్చిన తన చితికి పదిమూరల దూరములో ఉండి ఈ తంతును ఈమె ఆత్మతో పాటుగా ముగ్గురు దూతలు అలాగే స్వాతి ఆత్మ గూడ చూడసాగింది. 


4 comments:

  1. ఓం స్వామి.
    కాశీలో దత్తాత్రేయ స్వామి శివలింగాన్ని ప్రతిష్ఠించారు అని దత్త పురాణం లో ఉంది. ఎక్కడో వివరంగా చెప్పండి.

    ReplyDelete
    Replies
    1. అమ్మ..మనకి ఈ దత్తలింగము ఎక్కడ ఉన్నదో వివరముగా శ్రీ గణపతి సచ్చిదానంద వారు రచించిన శ్రీదత్తదర్శనము అను గ్రంథములో 312 పేజీలో మనకి కనపడుతుంది.ఇది చదివి మేము కాస్త కాశీకి వెళ్ళి ఈ దత్తలింగము అలాగే అక్కడే శిలగా మారిన శ్రీ దత్తస్వామి నల్లటి విగ్రహమును గూడ దర్శించుకోవడము జరిగింది.

      Delete
    2. ఓం స్వామి
      వెంటనే బదులిచ్చినందుకు , తెలియచేసినందుకు ధన్యవాదములు స్వామీ.

      Delete
  2. ఓం స్వామి
    చనిపోతున్న వ్యక్తి గు గు గు అంటూ చనిపోతున్నారని ఇది వరకు చాలా మంది చెప్పారు. కానీ గుహ తరువాత ఏంటి అన్నది ఎవ్వరూ చెప్పలేదు.
    మీరు గుహలు ఎన్నిరకాలో , మిగిలిన విషయాలు అన్నీ చాలా చాలా వివరంగా తెలియచేసారు. ధన్యవాదములు స్వామి.

    ReplyDelete