కర్కోటకుడు తాను చేసిన ప్రయోగము దేవి భౌతిక శరీరము మీద ప్రతాపము చూపిందని చారుకేశ ద్వారా తెలుసుకొని.... వరుసగా నాలుగు రోజుల పాటు స్మశానమునకు వెళ్లి పిల్లి, మేక, గొర్రె, దున్నపోతును బలి ఇస్తూ..... పిండిబొమ్మ శరీరాంగాల మీద రోజుకి 27 తుమ్మ ముళ్లు చొప్పున 108 ముళ్లు గుచ్చడముతో.......
దేవి భౌతిక శరీరము బ్రతికున్న శవములాగా తయారు అయింది. శ్వాసను బట్టి ఆమె బ్రతికే ఉన్నదని అక్కడున్న వారికి తెలుస్తోంది. ఇది 4 వ రోజు పరిస్థితి. శ్వాసగమనము తగ్గింది . పల్స్ రేటు క్షణ క్షణానికి పడిపోతుంది. మరణానికి చేరువలో ఉంది. అప్పడిదాకా మొదటి రోజు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడి మరుసటిరోజు కాళ్లు , చేతులు కదలకపోవడము ఆపై మరుసటి రోజు విపరీతమైన తలనొప్పితో బాధపడి ఇపుడు ఈ నాలుగవ రోజు గుండె నొప్పితో బాధపడుతూ.... ఒక ప్రక్క రక్తపువాంతులు,విరేచనాలు, తీవ్రమైన జ్వరము, అంగాల నొప్పులు, కండరాల నొప్పులు, మాటపడిపోవడం, చూపు మందగించడం,చెవులు వినిపించకపోవడం ఇలా నానారకాల వ్యాధి ఈతి బాధలు పడింది. ఈమె పడే బాధలు చూడలేక జోషి ఈమెకి పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చి చంపి వెయ్యాలని ఎన్నోసార్లు అనుకున్నాడు. పరమహంస మనోదృష్టికి తాను చేసే పని తెలియకుండా ఉండదని తెలిసి చెయ్యలేకపోయాడు. దిన దిన గండముతో 100 సంవత్సరాలు జీవించే కన్నా ఆరోగ్యముగా ఒక్క రోజు జీవించినా చాలు గదా అనేది జోషి సిద్ధాంతము. ఎవరి సిద్ధాంతము వారికి గొప్పది గదా. ఎవరిని ఏమి అనలేము.ఏమి చెయ్యలేము. ఈ నాలుగు రోజులు తను నేర్చుకున్న వైద్యమంతా ఈమెను రక్షించడానికి చేసిన ఏమీ ఉపయోగము లేకుండా పోయిందని ఒక వైద్యుడిగా జోషి నరకవేదన పడుతున్నాడు. ఆమె ఆఖరి క్షణాలలో ఉన్నదని అతడికి తెలుస్తున్న ఏమీ చేయలేకపోతున్నాడు. చెయ్య కలిగే పరమహంస మౌనముగా ఉన్నాడు.
కాని.......
కర్కోటకుడికి ఇదంతా గూడ తన మనో దృష్టికి తెలిసిన గూడ ఏమాత్రము కనికరము చూపకుండా తను మంత్రించిన తుమ్మ ముళ్లతో రోజుకి ఒక వాయువును బంధింస్తూ ఈమెకి నరకము చూపుతున్నాడు. అన్ని తెలిసిన పరమహంస తనని ఏమీ చెయ్యకపోవడము కర్కోటకుడికి ఆశ్చర్యమేసింది.తన శిష్యురాలిని రక్షించుకోవడము కోసం గురువుగారు ఏదో ఒక ప్రయత్నము చెయ్యాలిగదా, బాధపడాలి గదా. కనీసము తన ప్రయోగము తిప్పి కొట్టడానికి దక్షిణాచార శాంతి దేవతల ప్రయోగము ఏమైనా చేస్తాడా? అంటే ఏమీ చెయ్యడము లేదు. అటు బాధపడటం లేదు. ఇటు ఏమీ చెయ్యడము లేదు.ఆమెను రక్షించాలనే ధ్యాస లేకుండా తన శ్వాస మీద ధ్యాస పెడుతున్న పరమహంసను చూసి అంత కఠినమైన హృదయమున్న కర్కోటకుడికి గూడ బాధ వేసింది. ఇలాంటి పాషాణ గురువులుంటే శిష్యుల ప్రాణాలు ఇలా తమలాంటి వారి చేతిలో పోవాల్సిందే అనుకుంటూ....
5 వ రోజు యధావిధిగా స్మశానమునకు వచ్చి....
దేవి పిండదేహము దగ్గరికి వెళ్లుతూ....
శిష్య! ఈ రోజుతో ఆమెకి ఆఖరి రోజు... భూమ్మీద నూకలు చెల్లినట్లే. ఆమె ప్రాణాలు అనంత వాయువులో కలిసి పోయినట్లుగా ఈ రోజు ఆమె పిండి దేహము నుండి తలను వేరు చేస్తున్నాను. దానితో ఆమె అక్కడ రక్తము కక్కుకొని చచ్చిపోతుంది. ఆ బాధను చూడలేక పరమహంస దిగులు పడి మంచాన పడతాడు. అపుడు చచ్చిన ఆమె యొక్క ఆత్మను బంధించి బ్రతికున్న పరమహంస దేహము బంధించి మన ఆశ్రమానికి తీసుకొని వెళ్లి అమ్మకి బలి ఇచ్చి ఆమె కోరికను తీర్చి నా కోరికను తీర్చుకుంటాను అంటూండగా..
"అంతా అనుకున్నట్టు జరిగితే దైవమెందుకు? " అన్నట్లుగా
దేవి పిండిబొమ్మను చూసి
కర్కోటకుడికి నోటమాట రాలేదు.
అసలు ఏమీ జరిగిందో వాడికి అర్ధము కాలేదు.
కారణము.....
ఆ దేహము మీద ఈ నాలుగు రోజుల్నుంచి ఉన్న దేవి వెంట్రుకలు, గోరులు, ఇసుక, రక్తము స్థానములో.....పావురము ఈకలు, దీని కాలి గోరులు, దీని రక్తము కనబడుతున్నాయి. కాని ఇసుక మాత్రము దేవిదని తెలుస్తోంది. అంటే ఇన్నాళ్లు పిండి బొమ్మ దేహములో దేవి పిండదేహము కన్పిస్తే.... ఈ ఆఖరిరోజు మాత్రము పావురము యొక్క పిండదేహము కనిపించడము అలాగే దాని వస్తువులు కనిపించేసరికి
ఒక్క క్షణము పాటు....
కర్కోటకుడికి మతి పోయింది.
అంటే తను ఈ నాలుగురోజులు తంత్ర ప్రయోగము పావురమును చంపటానికి చేసినదని తెలిసేసరికి వాడికి నోటమాట రావడము లేదు. అలా ఎలా జరిగింది. తనకి
అర్ధము గావడము లేదు. ఎక్కడో ఏదో పొరబాటు జరిగింది. అది తను తెలుసుకోకుండా పట్టించుకోకుండా ఈ ప్రయోగానికి కూర్చున్నాడు. మరి పొరబాటు జరిగితే.... ఈ నాలుగు రోజులు అక్కడ ఆ అమ్మాయి ఎందుకు బాధపడింది. తను ఏయే భాగాలు పని చెయ్యకుండా చేశాడో ఆమెకు ఆ భాగాలు అక్కడ పని చెయ్యలేదు. మరి ఇది ఎలా సాధ్యపడింది? అని కర్కోటకుడు ఇందులో తనకే తెలియని మర్మ రహస్యము దాగి ఉందని....
చారుకేశతో....
ఓరి శిష్య! మన ప్రయోగము వికటించింది. అమ్మాయికి బదులుగా పావురము చచ్చింది. అమ్మాయి మరణావస్థను పొందితే పావురము మరణము పొందింది రా ? ఇది ఎలా సాధ్యపడిందో....ఏమి జరిగిందో నేను తెలుసుకోవాలి.
అంటూ 48 నిమిషాలపాటు ధ్యాన నిష్ఠలోనికి వెళ్ళిపోయాడు.
కర్కోటకుడి మనోదృష్టి యందు....
ధ్యాన దృశ్యాలు కానరావడము మొదలైంది.
తను మారు రూపములో వంటవాడిగా పరమహంస ఇంటికి వెళ్లే సమయములో ఒకటి జరిగింది. అది ఏమిటంటే....
పరమహంస....
కాలభైరవుడి గుడికని బయటికి వెళ్లిపోతూ...
తన మనస్సు అలాగే ప్రకృతి చూపించిన సంకేతాలు చూసి....
దేవికి ఏదో కీడు జరగబోతుందని గ్రహించి....తనకి తెలిసిన పరకాయ ప్రవేశ విద్యతో....
పావురము దేహములోనికి దేవి యొక్క ఆత్మను... అలాగే దేవి శరీరములోనికి పావురము యొక్క ఆత్మను ప్రవేశపెట్టి అన్ని చేసి... ఏమీ చెయ్యనివాడిలాగా ఏమీ తెలియని వాడిలాగా... ఏమీ పట్టించుకొని వాడిలాగా అమాయకముగా బయటికి వెళ్లిపోవడం.....ఆయన వెళ్లిపోయాడని ఆనందములో తను ఏమీ ఆలోచన చెయ్యకుండ ఎవరి శరీరములో ఏ ఆత్మ ఉన్నదో గమనించకుండా.... తెలుసుకోకుండా....నిర్జీవములాగా పడియున్న దేవిని చూడగానే.... ఆవేశములో ఉన్నవాడు అవివేకము పొందుతాడు అన్నట్టు తను అమాయకముగా ఆమె వస్తువులు అదే గోర్లు, వెంట్రుకలు, రక్తము తీసుకున్నానని తను అనుకున్నాడు.
నిజానికి అవి ఆమె శరీరములో ఉన్న పావురము యొక్క పిండదేహమువేనని తను గమనించలేదు. బయటికి వెళ్లిన పరమహంస వచేస్తాడని తొందరలో అనుమాన భయముతో బయటికి ఏమీ ఆలోచించకుండా వచ్చాడు. కేవలము తను దేవి యొక్క పాదాల ఇసుకను మాత్రమే తేవడము వలన.... దీని వలన ఆమె భౌతిక శరీరము ఈ నాలుగు రోజుల పాటు వ్యాధి అవస్థలు పడింది.నిజానికి బాధలుపడింది ఈమె గాదు. ఈమె దేహములో ఉన్న పావుర దేహమని... ఈమె భౌతిక శరీరము కేవలము బాధలు పడినట్లుగా కన్పించినదని ఆమెకి ఇసుమంత బాధగూడ తెలియకుండ పరమహంస ఇలా చేశాడని.... అంటే తను కామరూప విద్యను ప్రదర్శిస్తే..... ఆయన కాస్త పరకాయ విద్యతో తిప్పి కొట్టాడని తెలుసుకొనేసరికి.....
కర్కోటకుడికి తెలియని వెర్రి ఆవేశము వచ్చి పెద్దగా అరిచాడు. దానితో అర్ధరాత్రి ఆ స్మశానమంతా నిద్రలేచింది.
ఏమి లాభము....
తను చేసిన చేతబడి ప్రయోగము ఎందుకూ పనికి రాకుండా పోయినందుకు కర్కోటకుడికి శారీరక, మానసిక నరకయాతన మిగిలింది.
ఇదంతాగూడ....
పరమహంస తన మనోదృష్టితో చూస్తూ....
తల తన్నేవాడుంటే వాడిని తన్నేవాడు ఉంటాడని మర్చిపోతే ఎలా మిత్రమా... అంటూ నవ్వుకోవడము ప్రారంభించాడు.
No comments:
Post a Comment