అధ్యాయము 28

కర్కోటకుడు

తనకి జరిగిన చేతబడి ప్రయోగ అవమాన బాధను మర్చిపోలేకపోతున్నాడు. తన చేతబడిని కేవలము బుద్ధి బలము ఉపయోగించి నాశనము చేసిన పరమహంస మీద కోపము ఎక్కువైంది. ఆవేశము తట్టుకోలేకపోతున్నాడు. శరీర తాపము ఎక్కువైంది. కల్లు త్రాగిన కోతిలాగా వాడి మనస్సు గంతులేస్తోంది.

ఏదో ఒకటి చెయ్యాలి. ఏమి చెయ్యాలి! ఏమి చెయ్యాలి!  ఏదో చెయ్యాలి!

తాంత్రిక ప్రయోగాలకి మించి ఏదో చెయ్యాలి. తనకి మాత్రమే తెలిసి ఎవరికీ తెలియని తంత్ర ప్రయోగము ఈ సారి ఏకముగా పరమహంస మీదే ప్రయోగించాలి.తనని ఫోర్త్ డైమెన్షన్ కి వెళ్లనియ్యకుండా చేశాడు. కాని విశ్వాధినేత ఆకాంక్షను అమ్మవారు అయిన కాళీమాత తీర్చాలంటే తనకి పరమహంస తల ఇవ్వాలి. ఇపుడు తను అవకాశము కోల్పోతాడు. కాని అమ్మవారి ద్వారా తను అనుకున్నఆకాంక్ష అదే విశ్వాధినేత అయ్యే అవకాశమును ఎట్టి పరిస్థితులలో జారవిడుచుకోకూడదు. అంటే తనకి మాత్రమే తెలిసి అతి రహస్య గుప్త ప్రయోగము తను పరమహంస మీద చెయ్యాలి, చెయ్యక తప్పదు. ఎందుకంటే చేతబడి ప్రయోగమును కళ్లు కదల్చకుండా, మంత్రము చదువకుండా, చెయ్యికదపకుండా కేవలము వివేక బుద్ధితో తిప్పి కొట్టిన వాడికి బాణామతి, కిల్లాంగి, కాష్మోరా లాంటి ప్రయోగాలు వెన్నతో పెట్టిన విద్యలాగా తిప్పికొడతాడు.ఇవి చేసి అభాసు పాలవ్వడము తప్ప ఏమీ ప్రయోజనముండదు. తను ఏదో ఒకటి ఆయనకి తెలియని లేదా ఆయనకు మించిన తంత్ర ప్రయోగము ఏది ఉందో తెలుసుకొని తను దానిని వశపరుచుకొని ఆ ప్రయోగము చెయ్యాలి. ఏమి చెయ్యాలి? అది ఏమై ఉంటుందా అని తంత్ర శాస్త్ర గ్రంధాలు తిరగవెయ్యడము మొదలు పెట్టాడు.

అందులో.... ఒకచోట... చిన్నగా మూలలో....

అఘ◌ోర సంప్రదాయానికి అఘ◌ోరాచారుడైన కీనారామ్ అఘ◌ోరీని ఎవరైతే ప్రసన్నము చేసుకొని వారి అనుగ్రహము పొందుతారో.... వారికి విశ్వానికి తెలియని...విశ్వ గురువుకి తెలిసిన 'ఛోడ్' తంత్ర ప్రక్రియ చెప్పబడుతుంది. అని వ్రాసి ఉంది.

ఇది చదవగానే....

కర్కోటకుడికి పోయిన ప్రాణము తిరిగి వచ్చినట్లుగా అన్పించింది. తనకి జరిగిన అవమానానికి ఈ తాంత్రిక ప్రక్రియే పరమహంసకి బుద్ధి చెపుతుందని ఇతడి మనస్సు బలముగా చెప్పసాగింది. విశ్వ గురువు అంటే దత్తాత్రేయ స్వామి. ఈయనకి తెలియని తంత్ర శాస్త్రమే లేదు. ఆది నుండి అంతము వరకు ఎరుగని వాడు. ఈయనను మన కీనారామ్ గురూజీ ప్రసన్నము చేసుకొని ఈ తంత్ర ప్రయోగము నేర్చుకొని ఉంటారు. ఇపుడు తను ఈయనను ప్రసన్నము చేసుకుంటే కీనారామ్ అనుగ్రహము వలన తనకి 'ఛోడ్' తంత్ర ప్రయోగ సిద్ధి కలిగితే దాని వలన 'అగ్ని భేతాళుడు' వశము అవుతాడు. ఈ భేతాళ తాండవము వలన అగ్నిశిఖలేర్పడి పరమహంసను దహించివేస్తాయని కర్కోటకుడికి అర్ధమై .... ....

దానితో.... తను ఉన్న కాశీక్షేత్రములోని కీనారామ్ జీవ సమాధి దర్శించుకోవడానికి తన శిష్యుడితో కలిసి కర్కోటకుడు బయలుదేరాడు.


 

No comments:

Post a Comment