దేవి... చేతిలోంచి చనిపోయిన పావురమును తీసుకున్న పరమహంస మనస్సులో ఏదో తెలియని ఆందోళన చెందడము మొదలైంది. కడుపులో ఆవేదన మొదలైంది. గుండె అదురుతోంది, చెమటలు పడుతున్నాయి, కాళ్లు చేతులు నెమ్మదిగా వణకడము మొదలైంది. తను ఇప్పడికి ఎన్నో జీవులకి ఇలా పునః ప్రాణము పోశారు కాని ఇప్పుడే ఇలా ఎందుకు జరుగుతుందో ఈయనకి ఒక పట్టాన ఏమి అర్థముకాలేదు. తల మీద నుంచి ఒక కాకి ఎగురుతూ దేవి తల మీద రెట్ట వేసి వెళ్ళింది. వేళ కాని వేళలో శబ్దము చెయ్యసాగింది. ఎక్కడో నక్కల అరుపులు లీలగా వినబడసాగింది.ఆహారము కోసము గ్రద్ద తమ తలల మీద ఎగురుతూనే ఉంది. అన్ని శకునాలు గూడ అపశకునాలుగా పరమహంసకి అన్పించసాగాయి
ఎప్పుడు లేనిది.... అనుకోని విధంగా ఒక పచ్చని చెట్టు కొమ్మ అకస్మాత్తుగా విరిగి పడింది. ప్రకృతిలో మార్పులు రావడము మొదలైంది. అప్పటిదాకా ఉన్న ఎండ కాస్త వర్షముగా మారే సూచనలు, భగ భగ మండే సూర్యుడిని కప్పివేస్తూ నీటి మేఘము అడ్డురావడము.... ఇవి అన్ని చూస్తున్న పరమహంసకి ఒక పట్టాన ఏమి అర్థముకాలేదు. తన మనస్సు అలాగే ప్రకృతి తనకి ఏదో చెప్పాలని తమ ఆవేదనను ఈ విధమైన సంకేతాల ద్వారా చూపిస్తున్నాయని ఈయనకి అర్థమైంది.
స్వామి! స్వామి! మీరు ఏమి ఆలోచిస్తున్నారు? పావురమును బ్రతికించకుండా ఏదో ఆలోచనలో ఉన్నారు అని దేవి అనగానే.....
అంటే.... అంటే.... ప్రశ్నాకాలము ప్రకారము చూస్తే ఈమెకి ఏదో తెలియని ప్రమాదముందని పరమహంసకి అర్థమైంది. చేతిలో చచ్చిన పావురమును బట్టి చూస్తే... అంటే పావురం మరణావస్థను ఈమె తీసుకుందా? పావురము చచ్చిపోవాలసిన చోట ఈమె చనిపోతుందా?
ఒక్క క్షణము పాటు పరమహంస కళ్లు మూసుకున్నాడు. శకుంతలా దేవి జన్మ జాతక చక్రము ఆయన మనో దృష్టి ముందుకి వచ్చింది. 12 గడులలో ఉన్న గ్రహాలు, గ్రహస్థితులు, గృహయోగాలు, గ్రహదశలు, వరుసగా కనబడసాగాయి. వాటిని గమనించిన పరమహంసలో ఏదో తెలియని భయము మొదలైంది. తన ఊహ నిజమేనని తన గ్రహస్థితి చూపించేసరికి. ఈయనకి ఏమీ అర్థముకాలేదు.
అంటే...
దేవికి రాబోవు 18 రోజుల పాటు మరణ మారక గ్రహస్థితి చూపుతున్నాయి. పైగా తాంత్రిక ప్రయోగములో ప్రాణాలు పోయే అవకాశాలున్నాయి. పావురము యొక్క 18 నిమిషాల మరణావస్థను ఈమె తీసుకోవడముతో అదికాస్త 18 వ రోజున మరణ మారక స్థితికి మారనుందని ఈయనకి అర్థమైంది. ప్రస్తుతానికి ఈమె తాంత్రిక ప్రయోగానికి గురై రోగిగా మారి మరణము పొందే అవకాశాలు ఉన్నాయని ఈమె జాతక చక్రము చెపుతోంది.
నిజానికి జ్యోతిష్య శాస్త్రము అనేది భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు ముందుగానే మనకి చెప్పి వాటికి మన మనస్సు సిద్ధపడే విధంగా చేస్తోందని ఎవరికీ తెలియని నగ్నసత్యము. కాని ఇలాగే జరుగుతుందని చెప్పదు. జరిగే అవకాశాలున్నాయని మాత్రమే చెబుతుంది. దానికి తగ్గ గ్రహపరిహారాలు చేయించుకుంటే ఆ గ్రహ సమయములో రోగికి సేవ చేస్తాడు. అంటే రోగి కావాలసిన రోగికి సహాయకుడిగా మారతాడు. ఇది నిజ అనుభవ జ్యోతిష్య జ్ఞాన పండితులకి తెలిసిన నగ్న సత్యము. కాని మిడిమిడి జ్యోతిష్య జ్ఞాన పండితులు మాత్రము లేని గ్రహ పరిహారాల పేరుతో నిలువుదోపిడీలు చేస్తూ ఏదో జరిగిపోతుందని భయపెట్టి.... బాధపెట్టి.... ఆశపెట్టి... ధన, మానాలు దోచుకుంటున్నారు. నమ్మకమును అమ్మకముగా చేస్తున్నారు.మోసపోయే వారు ఉన్నంత వరకు ఇలాంటి వారు మోసాలు చేస్తూనే ఉంటారు. ఏది గూడ అతిగా నమ్మరాదు! అతిగా చెయ్యరాదు! జ్వరము వస్తోందని తెలిసినప్పుడు దానికి తగ్గ టాబ్లెట్లు వాడాలి. అంతేకాని జీవితాంతము జ్వర బాధలు రాకుండా చెయ్యాలని ఎవరూ అనుకోరాదు. ఎవరుగూడ అలా చెయ్యలేరు. బాధ వచ్చినప్పుడు ఉపశమనము కోసము గ్రహ శాంతి చేయించుకుంటే మనకి మనఃశ్శాంతి కలుగుతుంది. ప్రతి బాధకి గ్రహశాంతియే అంటే మంచిది కాదు. ఏదైనా అతిగా చేసిన అతి వికటించే ప్రమాదముంది అనుకుంటూ.....
అంటే....
దేవి జాతకము ప్రకారము చూస్తుంటే....
తాంత్రిక ప్రయోగము వలన మరణము అని తెలుస్తోంది. మరి అతను ఎవరు? ఎందుకు ఈమె మీద ఈ క్షుద్ర ప్రయోగము చెయ్యాలని అనుకుంటున్నాడు ఏమి ఆశించి దీనికి సిద్ధపడ్డాడు. నా సమక్షములో ఉన్న ఈమె మీద ఇలాంటి ప్రయోగాలు జరగకుండా తనే ఏదైనా చేసి కాపాడాలి....
ఇతను ఎవరో...ఇతని వివరాలు ఏమిటో తన మనోదృష్టితో చూడాలి అనుకుంటూ...
సంజీవిని మంత్రము చదివి చచ్చిపోయిన పావురమును బ్రతికించి దేవి చేతిలో పెట్టి.....
శరవేగంగా....
పరమహంస తను ధ్యానము చేసుకొనే గదిలోనికి వెళ్ళిపోయాడు.
అకస్మాత్తుగా....
గురుజీలో వచ్చిన ఈ మార్పుకి గల కారణము ఏమిటో ఈ ముగ్గురికి అర్ధము కాలేదు.
పావురమును గూటిలో పెట్టినక్షణము నుండి దేవి శరీరము తీవ్రమైన జ్వరాసెగలు చూపించడము మొదలైంది. ఏదో వైరల్ ఫీవర్ అయ్యుంటుందని డాక్టర్ జోషికి చెప్పి మందులు రాయించుకుంది. వాటిని తెప్పించుకొనే ప్రయత్నములో ఆమె ఉంది.
No comments:
Post a Comment