అధ్యాయము 21


దేవి పరిస్థితి గూర్చి

పరమహంసకి చెప్పాలని వీరిద్దరు కలిసి ఆయన ఉన్న రహస్య గది వైపుకి వెళ్లుతూండగా ఆయనే పైకి వస్తూ కనిపించగానే....

గురూజీ!గురూజీ! దేవికి ఎదో అయ్యింది. పెద్దగా రక్తపు వాంతి ఇప్పుడే తన గదిలో చేసుకుంది. డాక్టర్ జోషి గూడ ఈ వాంతిని చూసి భయపడుతున్నాడు. పరిస్థితి మందుల స్థితి నుండి దాటిపోయిందని చెపుతున్నాడు. మీరు వచ్చి చూడండి అని హార్వే కన్నీళ్లు పెట్టుకుంటూ అంటూండగా....

హార్వే! కంగారు పడకు! భయపడకు! బాధపడకు! ఆమెకి ఏమి కాదులే.నేను ఉన్నాను గదా. ఆమెకి జబ్బు అనారోగ్యము వలన రాలేదు. ఈ రక్తపు వాంతి గూడ తాంత్రిక ప్రయోగ ఫలితమే. నేను చూసుకుంటానులే. ఇదిగో ఈ నేపాలి రుద్రాక్ష మాలను ఆమె మెడలో వెయ్యి. అన్ని నెమ్మదిగా సర్దుకుంటాయి. ఏమి చెయ్యాలో ఆలోచిద్దాం అంటూ ఓదార్పు మాటలు చెప్పి తన మెడలోని రుద్రాక్ష మాలను హార్వే చేతికి ఇవ్వగానే.... దానిని దేవి మెడలో వేశాడు. 

అపుడు కాని దేవి ముఖములో ప్రశాంతము కనిపించలేదు.

కళ్లు తెరిచి ఒక చిరునవ్వు నవ్వి ఇపుడు ఏదో తెలియని హాయిగా ఉందని కళ్లు మూసుకుంది. 

ఈ మాటలు విన్న హార్వే,జోషి ఆనందపడ్డారు. వీరిద్దరికి తనకి ఏమి జరిగిన గురూజీ చూసుకుంటారని నమ్మకము వచ్చింది.

గది బయటికి వచ్చి వీరితో.....

నాయనా! మీకు తెలియని విషయము ఆమెకు, నాకు మాత్రమే తెలిసిన విషయము ఇపుడు ఒకటి జరిగింది. కర్కోటకుడు, వాడి శిష్యుడు కలిసి చేసిన క్షుద్ర పన్నాగానికి ఈమె బలి అయింది. మనలో ఎవరి మీద తన తాంత్రిక ప్రయోగము చెయ్యాలో వాడు తెలుసుకోవటానికి మంత్రించిన మూటను ఆ కనిపించే అరటి చెట్టు క్రింది పాతి పెట్టి వెళ్లాడు. అది తెలియక దేవి తీసింది. వాడి ప్రయోగానికి బలి పశువుగా మారింది అని చెప్పగానే....

హార్వే శరవేగంగా.... ఆ అరటి చెట్టు దగ్గరికి వెళ్లి చూస్తే.... అక్కడ ఏదో చిన్నమూట కన్పించింది. దానిని ముట్టుకోవాలని అనుకుంటున్న సమయములో ఆ మూట అదృశ్యమయ్యేసరికి పరమహంస కేసి   చూడగా.... ఆయన చేతులతో గాలిలో ఏవో ముద్రలు చేస్తూ కన్పించారు. ఈ మూట ఇక్కడ ఉన్నదని తెలిసినపుడు దేవి ముట్టక ముందే దీనిని తన శక్తితో అదృశ్యము చెయ్యవచ్చు గదా అనుకుంటూ పరమహంస దగ్గరికి వచ్చి.... అదే అడుగబోతూండగా.....

హార్వే! నువ్వు ఏమి అడగాలని అనుకుంటున్నావో నాకు తెలుసు. ఆ మూటను దేవి తాకక ముందే మాయం చెయ్యవచ్చు గదా అనే గదా. అన్ని ఉన్న అల్లుడు నోట్లో శని ఉన్నట్లుగా కాలము ఏమి చెయ్యనియ్యదు. గావాలంటే నేను ఇచ్చిన రుద్రాక్షమాల ఇపుడు ఎక్కడ ఉందో చూడు అనగానే....

హార్వే వెంటనే దేవియున్న గదికి వెళ్లగా.... ..... .....

దేవి మెడలో ఉండవలసిన రుద్రాక్షమాల ఆమె మంచానికి ఉన్న కోడుకి  వేళ్లాడుతూండేసరికి

కోపము వచ్చి నిద్రలో ఉన్న దేవిని లేపి......అడగ్గా..... 

హార్వే! అది వేసుకున్న పది నిమిషాలకి నాకు చిరాకుగా అన్పించింది. దాన్ని తీసివేస్తేనే కాని ప్రశాంతముగా ఉండలేనని అన్పించి ప్రక్కనే ఉంచాను. తర్వాత వేసుకుంటాను. ఇపుడు వేసుకోను.నన్ను కాసేపు ప్రశాంతముగా, విశ్రాంతిగా పడుకోనివ్వు అంటూ గాఢ నిద్రలోకి జారుకుంది. 

హార్వేకి నోటమాట రాలేదు. కాలము కలిసి రాకపోవడము అంటే ఏమిటో ఇపుడు తాను స్వానుభవముగా చూస్తున్నాడు. తంత్ర ప్రయోగాలను కంటి చూపుతో తిప్పి కొట్టగలిగే పరమయోగి సమక్షములో దేవి ఉన్న గూడ తనకి యోగము లేకపోవడము వలనే కాలము కలిసిరాక దురదృష్టము తెచ్చుకొంటుందని అర్ధమై ఏమి అనాలో..... ఏమి చెయ్యాలో అర్ధమవ్వక యధావిధిగా గది బయటికి వచ్చి అక్కడే తాపీగా ఉన్న పరమహంస వైపు మీరు చెప్పింది నిజమేనని అంటూ ఆయన దగ్గరికి వచ్చాడు.

హార్వే ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. మనకి జాతక రీత్యా యోగము లేకపోతే గురువైన, దేవుడైనా, పూజలైనా, జపహ◌ోమాలైన ఏవి ఫలితాన్ని ఇవ్వలేవు. నీకు అనుభవించే యోగమే లేనపుడు ఈ విశ్వ సృష్టిలో ఎవరు ఏమి ఇచ్చిన దానిని అనుభవించలేవు. అందుకే మన పెద్దలు ఎప్పుడుగూడ సంపాదించడమే కాదు దానిని అనుభవించే యోగము ఉండాలని అంటారు. అంతెందుకు నువ్వు ఎంతో కష్టపడి తయారు చేసిన పరికరాలు నీవు ఉపయోగించుకోలేవు. ఇతరులకి మాత్రమే అవి ఉపయోగపడతాయి అంటే నీకు వీటిని తయారు చేసే యోగమే ఉంది. ఉపయోగించుకొనే యోగమే లేదు. ప్రకృతి రాతను, ఆమె కర్మరాతను ఎవరు తప్పించలేరు. అలా ఇపుడు దేవికి గూడ తాంత్రిక బాధలు అనుభవించే యోగము నడుస్తోంది. ప్రకృతి రాతను, ఆమె కర్మరాతను ఎవరు తప్పించలేరు.ఇలా చూస్తూ ఉండక తప్పదు. ఆమె ఈ కర్మ ఫలము అనుభవించక తప్పదు. ఇపుడు అనుభవించకుండా ఈ కర్మను మనము చేస్తే తను మరుజన్మలో లేదా ఈ జన్మలో ఎపుడో ఒకపుడు ఏదో ఒక బలహీన గ్రహయోగ సమయములో ఈ కర్మను అనుభవించక తప్పదు. అది ఏదో ఇపుడే మన కళ్లముందే అనుభవిస్తే... ఏమి జరుగుతుందో... దానికి ఏమి చెయ్యాలో మనకి తెలుస్తుంది గదా.

హార్వే వెంటనే....

స్వామి! ఇలా తను ఎన్నాళ్లు ఈ బాధలు పడాలి?

ఇంకా అసలు బాధలు మొదలు అవ్వలేదు. ఇపుడు ఇపుడే క్షుద్ర ప్రయోగ బాధలు మొదలు అవుతాయి. అవుతున్నాయి. వాడు స్మశానమునకు వెళ్లాడు. ఈమె మీద తనకి తెలిసిన 'చేతబడి' ప్రయోగానికి సిద్ధపడుతున్నాడు. రాబోవు నాలుగు రోజులు ఈమెకి ప్రాణ గండ ప్రమాదమే ఉంది.అది గూడ పావురము ద్వారా ఈమెకి వచ్చింది. ఈ నాలుగు రోజులలో పావురమా లేదా ఈమె.... వీరిలో ఎవరు చనిపోతారో విధాత రాతను బట్టి ఉంటుంది. ఎవరు చనిపోయిన పునః జన్మ ఎత్తుతారు. ఇది తధ్యం.

అపుడిదాకా మనము ఓపికగా, సహనముగా ఉండాలి. ఈమె బ్రతికితే ఆపై జరగబోయే ప్రయోగ ఫలితాలు మనము ఆపవచ్చును. లేదా వాడు చేసే ప్రయోగాలకి ఈమె బలి కాక తప్పదు. ఈమెకి ఎలాంటి మరణ యోగమున్నదో ఈ నాలుగు రోజులే నిశ్చయిస్తాయి. ఈ నాలుగు రోజులు ఆమె ప్రాణము నిల్పుకుంటే ఆమె ఓడ్డున పడినట్లే. అపుడిదాకా జరిగే దానిని మనమంతా ఏదో నాటకము చూస్తున్నట్లుగా చూడక తప్పదు. మనము ఎంత రక్షించాలని ప్రయత్నాలు చేసిన ఈ నాలుగు రోజులు విఫలమావుతూనే ఉంటాయి. ఫలితమును అనుభవించే రాత ఆమెకి నాలుగు రోజులు తర్వాతనే ఉంది.

జోషి, హార్వే కలిసి....

పంజరములో ఆరోగ్యముగానున్న పావురము కేసి అలాగే మంచము మీద అనారోగ్యముతో పడియున్న దేవికేసి..... అదోలా చూస్తూ.....

నేల మీద కూర్చుండిపోయారు.

కాలనిర్ణయము ఏమిటని......




No comments:

Post a Comment