అధ్యాయము 31

 పరమహంస....

మణికర్ణిక ఘాట్ వద్దకి చేరుకొని....

ఈ క్షేత్రములోని..... ఈ ఘాట్  లోని మరణమే అన్ని బంధాల నుండి విముక్తి కల్గించి అవిముక్తిని చేసి మోక్షము ఇస్తుందని....తెలుసు కాబట్టి ఈ ఘాట్ కి ఈయన చేరుకున్నాడు.

అక్కడ ప్రవహించే గంగానదిమాతకి నమస్కరించి.....

తన చేతి సంచిలోంచి తాను తెచ్చిన పసుపు, కుంకుమ, సారె, గాజులు, పువ్వులు ఆ నదికి సమర్పించి.....


అమ్మా! గంగమ్మ! నీ బిడ్డ అయిన నేను నీ నదీ గర్భము నందు 48 రోజుల పాటు తల దాచుకోవటానికి అవకాశము ఇవ్వు తల్లి! అలాగే నేను చేయబోయే విశ్వరహస్య చేధన ప్రయోగము గూడ జయము పొందేటట్లుగా దీవించు. నా కాల ప్రయాణములో ఏవైన ప్రమాదాలు, కల్గితే నన్ను దాటించు.ఒకవేళ నేను వీటి మాయలలో పడితే నన్ను నీలో ఐక్యము చేసుకో. అనగానే....


ఉన్నట్టుండి....

నదీ భాగములో ఒక పెద్ద సుడి గుండము ఏర్పడింది. అపుడు పరమహంస కాస్త ఈ సుడి వైపు వెళ్లడము  అక్కడున్న పడవ వాళ్లు చూసి.....


అయ్యో! ఎవరో స్వామి! తెలియకుండా నీటి సుడి గుండము లోకి వెళ్లుతున్నాడు. ప్రాణాలు పోతాయి అంటూ ఈయన వైపు శరవేగముగా 64 పడవలు దాకా రావడము చూసిన ఈయన......తనకళ్లతో...... ఈ పడవలను లెక్కవేసి 64 ఉండటము గమనించి అంటే తను కాల డైమెన్షన్స్ గూడ 64 లే గదా అనుకొని.... అక్కడ నుండి లలిత ఘాట్ వైపు కను చూపు మేరలో కనిపించే కాశీ విశ్వనాధుడి గుడి వైపు చూసి ఈయన నమస్కారము చేసి...... అటు పంచగంగా ఘాట్ వైపు చూసి అక్కడ ఉండే కాల భైరవుడి గుడికి... శ్రీ త్రైలింగస్వామి వారి మఠానికి హృదయపూర్వక నమస్కారాలు చేసి.... ఈ సుడి గుండములో చిక్కుకొని...... గంగానది బొడ్డుకి ప్రాణాలతో చేరుకున్నారు. 

ఈ విషయము తెలియని పడవ వాళ్లు అయ్యో! పాపము! అనవసరముగా ఒక స్వామి శరీర త్యాగము చేశాడని ప్రాణాలు పోయాయని అనుకొని వెను తిరిగారు.

ఇక్కడేమో....

రహస్య గదికి కాలాముఖచార్యుడు, జోషి, హార్వే, దేవి కాస్త చేరుకున్నారు.

హార్వే వెంటనే....


స్వామి! మీరు అచ్చు గుద్దినట్లుగా మా గురు పరమహంస లాగా కామరూప విద్యతో అనుకరించారు. ఈ విషయము కర్కోటక మహాశయుడికి తెలియకుండా పోతుందా?


నాయనా! కర్కోటకుడు సాధనస్థితి 11 వ స్థితి. నాది 63 వ స్థితి  అలాగే మీ గురువు సాధన స్థితి   64 వ స్థితి.అదే మా సాధన ష్టితికి వాడు రావాలంటే ఇదే సాధన స్థితిలో వాడు 108 సంవత్సరాలుండాలి. అపుడు గాని నేను చేసిన మాయ జ్ఞానము వాడికి తెలియదు. అపుడికి రాజు ఎవరో రెడ్డి ఎవరో ఎవరికి ఎరుక. మనకి 48 రోజులే గదా. ఈ లోపుల నా పని నేను చేసుకొని నా దారి నేను పోతాను. 


మరి స్వామి! మీరు మా గురువులాగా మారడమెందుకు? మీకులాగా ఉండవచ్చుగదా?


నాయనా! ఈ వేషము అంతాగూడ ఆ కర్కోటకుడికిని మభ్యపెట్టడానికే. మీ గురువు సాధనకి వాడు అడ్డంకులు కల్గించకుండా ఉండటానికి ఈ వేషము వెయ్యక తప్పదు. ఆయనలాగా ఉన్న నా మీద వాడు తంత్ర ప్రయోగాలు చేస్తుంటే ఈ లోపుల మీ గురువు ఆయన పని ఎలాంటి ఆటంకాలు, ప్రమాదాలు లేకుండా చేసుకొని పోతాడు. అది నా ఉద్దేశ్యము. ఈ జగన్నాటకమునకు కారకము, కార్యము అన్నమాట. 

అంతా బాగానే ఉంది.స్వామి! మీ కాలముఖ సాంప్రదాయము గూర్చి ఇప్పుడే వింటున్నాను. మీ శాఖ వివరాలు కొంచెము చెపుతారా?

నాయనా! మాది అలాగే కాపాలికులకు ఒక్కటే సాంప్రదాయము. విధి విధానాలలో తేడాలున్నాయి. అవి ఏమిటంటే శివుడి చేత నరకబడిన బ్రహ్మ దేవుడి యొక్క 5 వ బ్రహ్మకపాలమునకు ప్రతీకగా వాళ్లు కపాలమును చేతితో ధరిస్తారు. అందుకే వారిని కాపాలికులు అంటారు. వాళ్లు గూడ 12 సంవత్సరాల పాటు 5 నియమాలు పాటించవలసి ఉంటుంది. అది ఏమిటంటే గుడిసెలో నివసించాలి.గడ్డి మీద నిద్రించాలి. మూడు రోజులకి మించి ఒకే గ్రామములో భిక్ష చెయ్యరాదు. రోజుకి మూడుసార్లు స్నానము చెయ్యాలి, వీళ్ళ చేత చంపబడిన ఒక వ్యక్తి కపాలమును ధరించాలి. దానిలోనే ఆహారము, నీరు త్రాగాలి అనే నియమాలు ఉన్నాయి. నరమాంసము తినడం, శివారాధన చెయ్యడం, శవాలతో నగ్న పూజలు చెయ్యడము, శవాలతో శృంగార ప్రక్రియలు జరపటము ఇష్టములేక వీరి నుండి ఒక క్రొత్త శాఖ బయలుదేరింది. అదే కాలాముఖ శాఖ అన్నమాట.మేము ఎపుడు మా ముఖాల యందు అమ్మవారి నల్లటి తిలకమును ధరించడము వలన మమ్మల్ని కాలాముఖులు అన్నారు. మేము దేవి ఆరాధన చేస్తాము. అంటే అమ్మవారిని స్త్రీ శివలింగమును ఆరాధన చేస్తాము. ఇది లోకానికి తెలియని సత్యము ఏమిటంటే శివలింగాలలో పురుష శివలింగము అలాగే స్త్రీ శివలింగము ఉంటాయి. పురుష శివలింగము యొక్క పానమట్టము గుండ్రముగా ఉంటే అదే స్త్రీ శివలింగ పానమట్టము నాలుగు పలకలుగా చతురస్రముంటుంది. అదీ తేడా. మేము నలుచెదురుముగా  ఉన్న స్త్రీ శివలింగారాధన చేస్తాము అన్నమాట. అలాగే మాకు గూడ పంచనియమాలున్నాయి. అహింస, పవిత్రత, నిజాయితి, దొంగతనం చెయ్యకుండా ఉండటం, అవసరమైన దానికంటే ఎక్కువ ఉంటె దానిని తిరస్కరించడం మా పూజలు అన్నిగూడ వామచార, దక్షిణాచార పద్దతులలో జరుగుతాయి. మమ్మల్ని కోరి వచ్చిన స్త్రీలకి మేము కామ సుఖాలు ఇస్తాము. అంతే కాని శవాలతో శృంగారాలు చెయ్యము. మా దృష్టిలో స్త్రీలంతా దేవి సమానులు. అపుడు మాలో కామోద్రేకము కల్గితే వాళ్లు కామేశ్వరిగాను, మేము కామేశ్వరుడిగా మారి శృంగార ప్రక్రియలు చేస్తూ అద్వితీయమైన ఆనందస్థితిని పొందుతాము. ఈ స్థితి కోసము మేము శృంగారములో పాల్గొంటాము అంతేకాని స్త్రీ దేహము మీద భ్రాంతి, మోహము, వ్యామోహముతో కాదు.మా శాఖ కర్ణాటక ప్రాంతము నందు 8 వ శతాబ్దము నుండి 13  వ శతాబ్దము వరకు ప్రాచుర్యములో ఉండేది. కాలములో మార్పులు, పరిస్థితులలో మార్పులు రావడముతో మా శాఖలో గూడ వామాచార పద్ధతులు పూర్తిగా తగ్గి దక్షిణాచార పద్ధతులు ఎక్కువైనాయి. బసవేశ్వరుడు మా ఈ కాలాముఖ సాంప్రదాయమునకు మార్పులు-చేర్పులు చేసి సంస్కరించి దక్షిణాచార ఇష్టలింగ లింగాయతుల శాఖ గా మార్చడము జరిగింది. మా శాఖ దేవాలయాలు అన్నిగూడ వీరి ఆధీనములోనికి వచ్చి నడుస్తున్నాయి. ఇది మా శాఖ గాధ. అనగానే


"అంటే స్వామి! నరమాంస భక్షకులా?"


అంటే నువ్వు కాదా? నువ్వు అయితే బ్రతికున్న కోడిని చంపి దాని మాంసమును మసాలాలతో తింటే తప్పులేదు కాని నేను మాత్రము చచ్చిన వాడి మాంసము తింటే తప్పు వచ్చిందా? నా దృష్టిలో కోడి, అలాగే నరమాంసానికి తేడా లేదు. ఈ రెండు గూడ బ్రహ్మ పదార్ధాలే.అంతెందుకు ప్రతీ మానవుడు గూడ మాంస భక్షకుడే. ఎందుకంటే వాడు తినే అన్నములో ముక్కు పురుగులు, బియ్యపు పురుగులు ఉంటాయి. వాటిని చూసుకోకుండా తింటాడు గదా. నరమాంసము ఆరు అడుగులుగా కనబడితే ఈ పురుగులు అర మిల్లి మీటర్ లో ఉంటాయి. అంతే తేడా.

అనగానే.....


హార్వేకి ఈ వాదన నిజమేనని అన్పించి ఆయనకి నమస్కారము చేశాడు.


స్వామి! ఆ కనిపించే గాజు అద్దాల పెట్టెలోనికి వెళ్లి కూర్చోండి లేదా పడుకోండి. మీకు మా పరికరాల వైరులు అనుసంధానము చేస్తాము. అపుడు మీ మనోదృష్టికి వచ్చే అన్ని రకాల ధ్యానదృశ్యాలు ఆ ప్రక్క గదిలో ఉన్న మా పరికరాలలో 3D బొమ్మలుగా కనబడతాయి. వాటి గూర్చి మీరు మనస్సులో అనుకుంటే అవి మాకు వాయిస్ గా, టెక్స్ట్ గా రికార్డు అవుతాయి.


నాయనా! అక్కడ మీ గురూజీ నీటిలో 48 నిమిషాలకి మించి జలసమాధి స్థితిలో ఉండలేడు. ప్రతి 48 నిమిషాలకి 48 నిమిషాల విశ్రాంతి ఇవ్వాల్సి ఉంటుంది. అపుడు నేను ఏమి చెయ్యాలి.


స్వామి! ఆయన 48 నిమిషాల పాటు ధ్యాన నిష్ఠలో  ఉండి తెలిపతి ద్వారా వాటిని మీ మనో దృష్టితో చూడండి. ఆ తర్వాత అయన అక్కడ 48 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకొనే సమయములో మీరు మాకు ఈ ధ్యాన దృశ్యాల గూర్చి వివరించండి.


బాగుంది! ఇలా చెయ్యవచ్చు. అయితే నేను ధ్యాన దృశ్యాలు చూసేటపుడు పడుకొని ఉంటాను. విశ్రాంతి తీసుకొనే సమయములో కూర్చొని మీకు ఆ దృశ్యాల వివరణ ఇస్తాను.


స్వామి! మరి మీ భోజనము గూర్చి చెపితే అది ఏర్పాటు చేస్తాను.


నాయనా! నేను ఆహారాలు తినడము మాని చాలా సంవత్సరాలే అయ్యింది. వాయు భక్షణ చేస్తాను.


అంటే?


నాకు వాయువే ఆహారము అన్నమాట అనగానే.....


ఇది విన్న ఆ ముగ్గురికి నోట మాట రాలేదు. ఈయనను గాజు గదిలోనికి పంపించి అన్ని పరికరాల వైరులు ఈయన శరీరానికి సంధానము చేసి.... బయటికి వచ్చి.... గది బయటికి వీరంతా చేరుకొని.....ఆయన చూడబోయే ధ్యాన దృశ్యాలు రికార్డింగ్ చేసే పనిలో పడ్డారు. ఆయనను గాజు బాక్స్ లో చూస్తూ......


No comments:

Post a Comment