అధ్యాయము 11

 

పరమహంస పిలువగానే వంటవాడు ఎదురుగా వచ్చి నిలబడగానే....వాడితో 

అవును! ఈ రోజు ఏమి వంట చేస్తున్నావు?అనగానే.....

స్వామి! అతిధులు వచ్చారు గదా!అందుకని నరమాంసము ఆపి శాఖాహారము  వండాలని అనుకుంటున్నాను.

అంటే అతిధుల కోసము నేను ప్రతిరోజు ఇష్టముగా తినే నరమాంసవంటకాలు ఆపాలా?నా ఆహార నియమాలు మార్చుకోవాలా?అదేమీ కుదరదు! ఈ అతిధులకి గూడ నేను తినేది పెట్టాలి! నరమాంసమును యధా విధిగా వండి పెట్టాలి. నేను ఏది తింటే వాళ్లు గూడ అదే తినాలి. నువ్వు గంగానది ఒడ్డుకి వెళ్లి శవము ఏదైనా కొట్టుకొని వస్తోందేమోనని చూడు లేదా మణికర్ణికా ఘాట్ వద్ద చితి మంటలలో కాలుతున్న శవమైనా ఎత్తుకొనిరా!

నువ్వు ఈరోజు నరమాంసము తేవాలి! లేదంటే నువ్వు నరమాంసమవుతావు! అనగానే వాడిలో ఈయన అన్నంత పనిచేస్తాడనే అనుమాన భయము కళ్లలో మొదలై కాళ్లల్లో భయము కనబడుతూ శరవేగముగా చేస్తున్న వంట పనిగూడ ఆపివేసి బయటికి చచ్చిన శవమును తేవటానికి బయలుదేరాడు.

           ఈయన మాటలను,చేష్ఠలు చూసిన ఈ ముగ్గురికి కక్కలేక మింగలేక అవస్థలు పడుతూంటే....  నరమాంసము చాలా రుచిగా ఉంటుంది. దానితో చేసిన వంటకాల ముందు అమృతము గూడ పనికి రాదు. వంటవాడు తేస్తాడులే నరమాంసముతో రుచికరమైన వంటకాలను చేయిస్తాను. సిగ్గుపడకుండా, భయపడకుండా, బాధపడకుండా, నిర్భయముగా తినండి! మీ ఆకలి తీర్చుకొండి! అంటూ వంటవాడి కోసము వీరంతా ఎదురుచూడసాగారు.

రెండు గంటల తర్వాత ఒక గోనె సంచి మూటతో వంటవాడు రావడము చూసిన ముగ్గురికి ఏదో తెలియని అనుభవ భయము మొదలైంది.వాడు లోపలికి వచ్చి మూట విప్పి తియ్యగానే....చచ్చిన మగ మనిషి శవ తాలూకా వాసన గ్రుప్పున వీరి ముక్కులకి సోకగానే....వాంతి అవుతుంది అనే భయముతో ముఖాలు ప్రక్కకి తిప్పుకున్నారు.

అంటే తామంతా నిజముగానే నరమాంసముతో చేసిన నర వంటకాలు తినాలా? నరమాంస వంటకాలు నరుడు తినడము ఏమిటో? నరమాంస భక్షులుగా ఈయనకి కనబడుతున్నామా ఎవరికి వారే తమలో తాము గొణుక్కున్నారు కాని బయటికి అనలేకపోయారు.

వాడు తెచ్చిన శవమును వంట గదిలోనికి తీసుకొని వెళ్లకుండా.... తమ కళ్ల ముందే గోనెసంచి తీస్తూ....శవమును బయటికి తీసి....స్వామి! ఈరోజు 40 సంవత్సరాల వయస్సు ఉన్న వాడిది దొరికింది. వంట రుచి పెరుగుతుంది అంటూ కోడిని కోసినట్లుగా ఈ శవము యొక్క కాళ్లు, చేతులు, తల, మొండెము, నడుము, పాదాలు అంటూ నవఖండ భాగాలుగా కత్తితో విడదీస్తూ.... ఏయే భాగాలతో ఏయే వంటకాలు చెయ్యాలో పరమహంసతో చెపుతున్న వాడి మాటలు విన్న ఈ ముగ్గురికి నోట మాట రావడము లేదు.ఖర్మ కాకపోతే..... ఎక్కడో చికెన్ లేదా ఫిష్ లేదా మటన్ బిర్యానీలు తినవలసిన తాము నరమాంస వంటకాలు తినడము ఏమిటో వీళ్లకి అర్ధముగాక అయోమయ పరిష్టితిలో పడ్డారు.రెండు గంటల తర్వాత....

వంటవాడు వంట పూర్తి అయినదని అనడముతో ఈ ముగ్గురి గుండెకాయ నోటిలోనికి వచ్చినంత పని అయ్యింది. ఎందుకంటే వీళ్ల కళ్ల ముందే చచ్చిన వాడి శరీర భాగాలు నూనెలో వేయించి, మసాలాలు దట్టించి, వాటితో కూర, పులుసు, వేపుడులాగా చేస్తూ  ఉండడము వీళ్ల దగ్గర ఉండి చూశారు. వాడు తెచ్చే వంట పాత్రలలో ఏయే భాగాలతో ఏమి వండినాడో వీళ్లకి బాగా తెలుసు. దానితో నరమాంస వంటకాలు తినక తప్పని స్థితిలో తాము ఉన్నామని వీళ్లకి అర్ధమైన గూడ చేసేది ఏమి లేక భారమంతా దైవము మీద వేసి వడ్డించిన విస్తరాకుల దగ్గరికి చేరుకున్నారు!

తీరా....వడ్డించిన పదార్ధాల మీద ఉన్న విస్తారాకులు తొలగించగానే......తమకి ఇష్టమైన పదార్ధాలు ఉండేసరికి వీళ్లకి నోటమాట రాలేదు. ఆశ్చర్యానందాలకి గురియై....

స్వామి! మీరు నిజముగా మాకు నరమాంస వంటకాలు పెడతారేమోనని చచ్చేంత భయము వేసింది. వచ్చే వాంతులను ఆపుకున్నాము. కాని ఇక్కడ మాకు మాత్రమే తెలిసిన మాకు ఇష్టమైన వంటకాలున్నాయి. ఇది ఎలా సాధ్యమో మాకయితే అర్ధముగావడం లేదు.

పిచ్చివాళ్ళా! ప్రకృతిలో లేనిది నేను ఏమి చెయ్యలేదు. ప్రకృతి ఎలా అయితే రూపాలు మార్చి రూపాంతరము చెందుతుందో అలా నేను గూడ నరమాంస వంటకాలను రూపాంతరము చెందేటట్లుగా చేశాను. పదార్ధ మాయను దాటిన  అఘోరకి ఇలా పదార్ధాలను మార్చడం కష్టమైనది గాదు. మొక్కలు, జంతువులు, వీటిని తినే నరులు మాకు అంతాగూడ ఒకే బ్రహ్మ పదార్ధముగా కనబడతారు.మీకు మాత్రము వేరు వేరు రూపాలతో కనబడతారు. అదే మీది భౌతిక దృష్టి అయితే నాది సమదృష్టి అన్నమాట. మీరేమో మీరు తినే వాటిని పెంచుకుంటూ.. నేనేమో మిమ్మల్ని తినే వాటిని వండుకున్నట్లు కనబడుతాము.మా దృష్టిలో నరుడికి, నరమాంసానికి తేడా ఉండదు. ఈ రెండు గూడ మా దృష్టిలో శవాలే. అనగా ఒకటి చచ్చిన శవము మరొకటి బ్రతికున్న శవము అన్నమాట. నిజానికి వాడు శవ మూట తీసుకొని రాలేదు. ఆకుకూరలు,కూరగాయల మూట తెచ్చాడు.

అది మీ కళ్లకి శవమూట లాగా కనిపించే విధంగా కనికట్టు చేశాను! వాడు నిజానికి శాఖాహారమే వండాడు. కాని మీ కళ్లకి నరమాంసము వండినట్లుగా అగుపించేటట్లుగా నా మంత్ర బలముతో చేశాను. పదార్ధము దాటితే కాని యధార్ధము ఏమిటో బోధపడదని అందుకే అన్నాను.

ఎప్పుడూ లేని రుచితో తమకి ఇష్టమైన వంటకాలు ఉండేసరికి అమితముగా తిని భుక్తాయాసము పడుతూ ఈ ముగ్గురు కూర్చోలేక..... నిల్చోలేక.... పడుకోలేక....ఎవరికీ తమ బాధను పంచుకోలేక.... అవస్థలు పడుతున్నారు.


2 comments:

  1. అంత శూన్యం అని తెలిసి మీరేందుకు గుప్తంగా ఉంటున్నారు sir....

    ReplyDelete
    Replies
    1. Guruvugaariki anta sunyam Ani telisina kuda ... Bayata prapanchaniki teliyadukada swamy...anduke konnisaarlu tappadu 🙏

      Delete