అధ్యాయము 61

 కాలాముఖుడు విశ్రాంతి స్థితికి వచ్చి వీరితో

నాయనలారా! కంగారుపడకండి! ఇక్కడి నుంచి నా అంతర్గత సాధన మొదలు అవుతుంది. అంటే అంతర్యామి నా ఆత్మ శరీరము, నా యోగ చక్రాల యందు ప్రవేశించి పరమహంస స్థితి గతులు తెలుసుకొనే అవకాశాలున్నాయి. ఇపుడిదాకా అయన అంతర్యామి సాధన కాస్త సర్వాంతర్యామిగా మారితే.... నా సర్వాతర్యామి సాధన కాస్త ఇపుడు అంతర్యామిగా మారుతుంది. అంటూ సమాధి స్థితిలోనికి వెళ్లిపోయారు. నీలిరంగు కాంతి పుంజము ఒకటి ఈయన శరీర యోగ చక్రాలలోనికి ప్రవేశించి అన్ని చక్రాలను దాటుకుంటూ బ్రహ్మరంధ్ర గుహలోని 64 కపాలధారి దగ్గరికి 48 క్షణాలలో చేరుకుంది. అక్కడ అపుడికే పసుపు లేదా అగ్ని వర్ణము లేదా బంగారపు వర్ణకాంతి పుంజము ఒకటి 3 వ కపాలము నుండి 4 వ బ్రహ్మ కపాలములోనికి ప్రవేశిస్తున్న దృశ్యము ఈ హార్వే పరికరములో కనిపించడము మొదలైంది. అంటే వీరిలో నీలిరంగు కాంతి పుంజము కాలాముఖుడిదని అలాగే అగ్ని వర్ణ కాంతిపుంజము పరమహంసదని ఈ ముగ్గురు గుర్తించి అమిత ఆనందమును పొందారు. గాకపోతే ఇపుడు వీళ్ల శరీరాలు కన్పించవు. కాని కాంతి పుంజాలు కనబడతాయని వీళ్లకి అర్ధమైంది. అలాగే కాలాముఖుడు మనస్సు వాయిస్ మాత్రమే రికార్డు అవుతోందని గ్రహించారు. ఇంతలో....... కాలాముఖుడు గూడ 4th డైమెన్షన్ లోనికి అడుగుపెట్టగానే.....

వీరి పరికరము యందు....

4th డైమెన్షన్ లోనికి ప్రవేశించిన పరమహంస కన్పించారు. అక్కడ కొంత మంది తెల్లని కాంతి శరీర ప్రతి నిధులతో ఈయన మాట్లాడుతూ కన్పించారు.ఈ దృశ్యాలు చూడగానే ఈ ముగ్గురికి అమిత ఆశ్చర్యానందాలు వేశాయి. ఇవి ఎలా తమకి అందుతున్నాయో ఒక పట్టాన అర్ధము కాలేదు. గాజు బాక్స్ లో ఉన్న కాలాముఖుడి భౌతిక శరీరము యొక్క భ్రూమధ్య ప్రాంతము నుండి ఒక దివ్య తేజస్సు కాస్త ఈ పరికరము మీద పడటముతో ఈ కాంతి రేణువులలో ఉండే దృశ్యాలను ఈ పరికరము తీసుకొని వాటిని వీడియోలాగా మార్చి తమకి దృశ్యాలుగా యధా విధిగా చూపిస్తోందని హార్వే తెలుసుకొని మిగతా వాళ్లకి చెప్పి చెప్పలేని ఆనంద స్థితిని పొందాడు.

శంబాలయోగులు లేదా గ్రహాంతర వాసులు వాడే అడ్వాన్సు టెక్నాలజీని ఈ కాలాముఖుడు తన త్రినేత్రముతో క్షణాలలో చూస్తున్నారని హార్వేకి అర్ధమైంది. ఈయనకి మనస్సులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ధ్యానానుభవాలు లోకానికి శాస్త్రీయముగా అందించాలనే తమ ఆకాంక్షను ఈ విధంగా సంపూర్తి చేస్తున్నందుకు అందరు ఈయనకి మనస్సులో కృతజ్ఞతలు చెప్పుకొని తమ బాధ్యతలు కొనసాగించడము మొదలుపెట్టారు. గాకపోతే కాలాముఖుడు కదలరు, ఉలకరు, పలకరు. వారి మనస్సు మాత్రమే మాట్లాడుతుంది. ఈ మాటలు కాస్త తమ పరికరములో వాయిస్ రికార్డింగ్ మరియు టైపింగ్  గాను మారతాయి.వీటిని విని లేదా చదువుకొని అక్కడ స్థితిగతులు తెలుసుకోవాలని వీళ్లకి అర్ధమైంది. ఇది ఏ మాత్రము అంత పెద్ద సమస్య గాదని వీళ్లు గ్రహించారు.

అపుడు కొద్దిసేపటికి....

4th డైమెన్షన్ లో పరమహంస మాటలు కాస్త వాయిస్ రూపములో వీరికి కనబడటము మొదలైంది. అలాగే అక్కడి దృశ్యాలు కనిపించడము మొదలైనాయి. దానితో వీరంతాగూడ అసలు అక్కడ ఏమి జరుగుతుందో చూడటము అలాగే వినడము మొదలు పెట్టారు.

అనగా.....

4th డైమెన్షన్ లోనికి అడుగు పెట్టిన పరమహంసకి స్వాగతము ఇస్తూ వచ్చిన ప్రతినిధులు ఈయనను లోపలకి తీసుకొని వెళ్లారు. అక్కడ వీరికి మరొక లోకములో తను ఉన్నట్లుగా అన్పించసాగింది. ఇక్కడ పంచభూతాలు లేవు కాని అంతరిక్షము దర్శనమైంది. దాదాపుగా వేల సంఖ్యలో ఎరుపు రంగు కాంతి గోళాలు నక్షత్రాలుగా కన్పించాయి. పైగా ఒక్కొక్క ఎరుపు కాంతి గోళానికి అనుసంధానముగా తొమ్మిది రంగుల కాంతి గోళాలు అనుసంధానమైనట్లుగా కన్పించింది. ఇలా ఈ తొమ్మిది కాంతి గోళాలకి అనుసంధానము ఇస్తూ 12 కాంతి పుంజాలున్నట్లుగా దర్శనమిచ్చింది. విచిత్రము ఏమిటంటే కాంతి పుంజము రంగు మారినప్పుడల్లా నవ కాంతుల గోళాలలో ఏదో ఒక రంగు బాగా కనబడుతోంది. దాని ప్రభావము ఎరుపు రంగు కాంతి గోళము మీద పడుతోందని ఈయన గమనించారు.

కాని ఇవి ఏమిటో ఒక పట్టాన అర్ధముకాలేదు. అపుడు ఒక ప్రతినిధి కాస్త ఈయనతో .... ....

"పరమహంస! ఎరుపు రంగు కాంతి గోళాలు 3rd  డైమెన్షన్ లాంటి భూగోళాలు. కుజుడి గ్రహ ప్రభావము వలన ఇవి ఎరుపుగా కనబడుతున్నాయి. ఎందుకంటే కుజ గ్రహము యొక్క రంగు ఎరుపు గదా. అలాగే వీటిపైన ఉన్న తొమ్మిదిరకాల రంగుల కాంతి గోళాలు అనేవి నవ గ్రహాలు అన్నమాట. ఇవి తొమ్మిది రంగులలో ఉంటాయి గదా. వీటి పైన ఉన్న 12 కాంతి పుంజాలు అనేవి 4th డైమెన్షన్ కి చెందిన ద్వాదశి ఆదిత్యులు అన్నమాట. అంటే ఈ డైమెన్షన్ అంతా గూడ కాలానికి సంబంధించింది. సంవత్సరానికి 12 మాసాలలో 12 మంది ద్వాదశాదిత్యులు కాలము నందు ప్రయాణము చేస్తూ నవగ్రహాల మీద తమ ప్రభావము ఈ విధంగా చూపుతారు అన్నమాట. తద్వారా మాకు 3rd  డైమెన్షన్స్ లోని 84 లక్షల జీవజాతుల మీద ఆధిపత్యము వహించడము జరుగుతుంది. 

అలాగే భూలోక మంచి చెడ్డలకి మేమే కారకులము. ఎలా అంటారా? ఈ తొమ్మిది గ్రహాల కాంతిగోళాలు మా ఆజ్ఞలతో నడుస్తాయి. తద్వారా వీటి ప్రభావము మీ భూలోక సకల జీవరాశుల మీద నవగ్రహాల ప్రభావముగా పడుతుంది. అనగా నవగ్రహాలు కాస్త భూలోక జీవులను తొమ్మిది వర్ణాలుగా విభజించి తొమ్మిది వర్ణాల ప్రభావముతో తొమ్మిది గుణాలు ప్రతీజీవిలో ఏదో ఒక గుణమును తీవ్రస్థాయిలో ఉంచి మిగిలిన ఏనిమిది గుణాలు తక్కువ స్థాయిలో ఉంచుతాము. అంటే ఒక్కొక్క జీవి మీద సరాసరిగా ఒక్కొక్క గ్రహ ప్రభావము అమితముగా ఉంటుంది. ఆ జీవికి ఈ గ్రహ ప్రభావము అనుకూలమైతే మంచి కర్మ ఫలితాలు, మంచి కర్మలు చేస్తాడు. అదే వ్యతిరేకమైతే చెడు కర్మలు, చెడు కర్మ ఫలితాలు పొందుతాడు. వాడి జనన కాలమును బట్టి ఈ నవగ్రహాల స్థితిగతుల సంచారము ఆధారపడి ఉంటుంది. ఈ కాలము అనేది వాడు పూర్వజన్మల కర్మ ఫలితాలను బట్టి వాడుకున్న బలమైన కర్మను మేము ఎంచి వాడి కర్మ- జన్మ ఎత్తే టట్లుగా దానికి తగ్గ గ్రహ సంచారమును జనన కాలమునందు ఉండేలా మేమే ఏర్పాటు చేస్తాము. ఇదంతా జీవుడి అరా (AURA ) శక్తిలో తొమ్మిది రంగుల కాంతుల వలనే మాకు సాధ్యపడుతుంది. మాకు మీ లోక అన్ని జీవరాశుల భవిష్యత్ తెలుసు. కనుక అలా జరిగే విధంగా మేమే భూలోకము నందు సంఘటనలు కలిగిస్తుంటాము.

ఇదియే మేము మార్ఫిక్ రిజోనెన్స్ (Morphic Resonance ) ద్వారా చేస్తాము. అనగా మీ ఆలోచనలే మాకు చేరిపోతాయి. మాకు భాషలు, భావాలు అవసరమే లేదు. మేము గూడ 5th డైమెన్షన్ వాళ్లు మా మీద ఆధిపత్యము వహిస్తారు. వాళ్ల ఆజ్ఞలు మేము పాటిస్తాము. మా ఆజ్ఞలు భూలోకవాసులు పాటిస్తారు. 5th డైమెన్షన్ నుండి సుమారు 64 ,800  డైమెన్షన్స్ ఉన్నట్లుగా మా వాళ్లకి త్రికాల జ్ఞానము ద్వారా తెలిసింది అనగానే...

పరమహంస వెంటనే...

అది ఏమిటి? 64 డైమెన్షన్స్ నే నేను చూశాను. మీరేమో 64 ,800 డైమెన్షన్స్ ఉన్నాయని ఖచ్చితముగా ఎలా చెపుతున్నారు.

హంస! నువ్వు ఈ డైమెన్షన్స్ కి ప్రవేశించే ముందు అదే విశ్వమాత రూపమైన త్రితల రూపధారి యైన  అనగా దుర్గ,కాళీ,చంఢీ అంశయైన త్రీమాత  దర్శనమైంది గదా. వాళ్లే ఈ విశ్వ సృష్టి, స్థితి, లయ కారకులు అని నీకు తెలుసు గదా. వీరంతా గూడ తమ శ్వాసలు ద్వారానే ఈ ప్రక్రియలు చేస్తుంటారు. 21 ,600 శ్వాసలు ఒక క్రియ అయితే మూడు ప్రక్రియలకి 21 ,600 X 3 = 64 ,800 శ్వాసలు అవుతాయి. ఇవే కాలమునకు ఉన్న 64 డైమెన్షన్స్ కి సమానము అన్నమాట. అంటే నువ్వు నీ శక్తి సామర్ధ్యాలతో 64 డైమెన్షన్స్ కి వెళ్లగలిగితే అపుడు నీకు 64 ,800 డైమెన్షన్స్ కనబడతాయి. ఇవే విశ్వాలు అవుతాయి. ఈ 64  డైమెన్షన్స్ యే 64 తత్త్వాలు. ఈ 64 తత్త్వాలే 64 విశ్వాలు. ఈ 64 విశ్వాలే 64 ,800 విశ్వాలుగా మనకి గోచరిస్తాయి అనగానే.....

ఈ అన్ని విశ్వాలకి అధిపతి భగవంతుడా? ఆయన ఎవరు? ఆయన ఉనికి ఏది? మనకి భగవంతుడుఏ డైమెన్షన్ లో  కనబడతాడు అనగానే.....

ఏమో... అది అయితే మాకు తెలియదు. ఆయన ఉన్నాడో లేడో గూడ మాకు తెలియదు. మేము గూడ ఎపుడు ఆయన్ని చూడలేదు. బహుశ ఈ అన్ని డైమెన్షన్స్ దాటి వెళ్లితే ఆయన ఉనికి మీకు కనిపించవచ్చును లేదా కనిపించకపోవవచ్చును. ఏ విషయము ఇతిమితముగా చెప్పలేము. గాకపోతే భూలోక వాసులు చేసే పూజలు అన్ని గూడ భగవంతుడికి సరాసరిగా చేరవు. ముందుగా మాకు చేరతాయి. మీ కోరిక పూజలలో సత్వగుణముంటే మీ కర్మ ఫలితముగా అదే పూజ ఫలితము ఇవ్వడానికి 5th డైమెన్షన్ అనుమతి కోసము పైకి పంపిస్తాము. అదే మీ పూజలలో తమో గుణము అనగా స్వార్ధము, రాగ, ద్వేషాలు,ఈర్ష్య, అసూయలు ఎక్కువగా ఉంటే ఆ పూజ ఫలితాలు పైకి పంపించకుండా మేమే వాటికి తగ్గట్లుగా పరిహర దోష శిక్షల సంఘటనలు సృష్టిస్తాము. తద్వారా ఆ కోరిక కోరినవాడు మానసిక, శారీరక ఈతి బాధలకి గురి అయ్యేటట్లుగా మేమే చేస్తాము అన్నమాట. గాకపోతే నిస్వార్ధముగా, నిష్కామ కర్మతో ఎవరైతే కర్మ, భక్తి, జ్ఞాన, ధ్యాన 18 యోగాలలో ప్రయాణించి సాధన చేస్తారో వారి సాధన శక్తి ఎక్కడ ఆగకుండా సరాసరి భగవంతుడు ఉండే చోటుకి చేరుతుందని మేము విన్నాము, చూస్తున్నాము. ఆ ఫలితాలు మా చేతులలో కాదు ఈ 64  డైమెన్షన్ లోని చేతులలో గూడ ఉండవని మా స్వానుభవాల ద్వారా తెలుసుకున్నాము. ఎందుకంటే వీరి సాధన శక్తితో ఆ కర్మలు-జన్మలు నశింపచేసుకొని కర్మ, జన్మ,కోరిక, భయం, ఆనంద, సంకల్ప, ఆలోచన రాహిత్యాల స్థితికి చేరుకుంటారని మాకు అర్ధమైంది. కోరికలున్నవాడికి వరాలతో అదే మాతో పని ఉంటుంది. అదే కోరిక లేనివాడికి వరాలు ఇచ్చి ఏమి లాభముంటుంది గదా?

ఇపుడు మనము ప్రస్తుతము మీ భూలోకములో శ్రావణ మాసము నడుస్తోంది. ఈ మాస ఆదిత్యుడిని మనము కలువడానికి వెళదాము అనగానే.... పరమహంసతో ఒక ప్రతినిధి ముందుకి సాగిపోతూండగా భూలోక కాల దృశ్యాలు అటూ నిటూ కనబడటము మొదలు పెట్టాయి. తను జలసిద్ధితో సాధన చేస్తున్న దృశ్యము నుంచి శ్రీ కృష్ణుడి నిర్యాణము, రావణాసురిడి నిర్యాణము, శ్రీరాముడి నిర్యాణము, విష్ణువు దశ అవతారాలు, కలి, ద్వాపర, త్రేతా, సత్య, యుగాలలో జరిగిన సంఘటనలు, లయ ప్రళయాలు అన్ని గూడ టి.వి స్క్రీన్ ల మీద కనిపించే సినిమా దృశ్యాలుగా పరమహంసకి కనబడుతూ వస్తున్నాయి. అంటే వీళ్ల కాలానికి మూడు కాలగతులు అనగా వర్తమానము (Present ) గతము (Past ) భవిష్యత్ (Future ) కాల విభజన లేదని.... ఉన్నదంతా present కాలమేనని.... అదే భూలోక వాసులకి ఈ మూడు కాలాల విభజన ఉన్నదని ఈయనకి అర్ధమయ్యే లోపల ఏక చక్ర రధము మీద నల్లని కాళాశ్వముతో... ఒక ఆదిత్యుడు కాలగమనములో ప్రయాణిస్తూ కన్పించారు. అపుడు ఈయన పరమహంసను చూడగానే.... తన రధమును ఆపకుండా కాలముతోపాటే పరమహంస గూడ నడిచే విధంగా చేశారు. కాని పరమహంసకి మాత్రము విచిత్ర  అనుభూతి కలుగుతోంది. ఎందుకంటే ఈయన ఈ కాలారధముతో పాటే ప్రయాణిస్తున్న ముందుకి తన ప్రమేయము లేకుండా కదులుతూ ఉన్నారు. నిలబడేందుకు అలాగే నడిచేందుకు ఎలాంటి నేల ఉన్నట్లుగా కన్పించలేదు. కాని కాంతి మాత్రమే దారిగా కనబడుతోంది. కాంతిలో తాముగూడ కాంతిగా మారి ప్రయాణిస్తున్నామని ఈయనకి అర్ధమైంది. కాలములో ప్రయాణించడము అంటే ఇదే కాబోలు అని ఈయన అనుకున్నాడు. అపుడు ఆదిత్యుడు కాస్త....

పరమహంస! నా పేరు పర్జన్య. నేను ద్వాదశాదిత్యులలో ఒకరిని. నేను 72 కిరణాలను కలిగి ఉంటాను.ఈ మాసము మీకు వర్ష ఋతువు కావడము వలన నా సూర్యకాంతి తగ్గుతుంది అలాగే మా 12  మంది ఆదిత్యులలో వరుసగా చైత్ర మాసములో విష్ణు ఆదిత్యుడు కాస్త 1200 కిరణాలతో ప్రకాశిస్తాడు. అదే వైశాఖ మాసములో ఆర్యమ ఆదిత్యుడు కాస్త 1300  కిరణాలతో, జ్యేష్ఠములో వైవస్వనుడు 72 కిరణాలతో,ఆషాఢ మాసములో అంశుమన 15 కిరణాలతో, ఆ తర్వాత వచ్చే బాధ్రపదములో వరుణుడు 1300 కిరణాలతో, ఆశ్వియుజములో ఇంద్ర ఆదిత్యుడు 2200 కిరణాలతో, కార్తీకముతో ధాత కాస్త 1100 కిరణాలతో, మార్గ శిరములో మిత్ర కాస్త 1000  కిరణాలతో, పుష్యమాసములో పుషా ఆదిత్యుడు కాస్త 900 కిరణాలతో, ఫాల్గుణ మాసములో త్వష్ట ఆదిత్యుడు కాస్త 1100 కిరణాలతో ప్రకాశిస్తారు. 

అవును! ఇంతకీ నువ్వు ఎందుకు మా లోకానికి వచ్చావు అనగానే....

స్వామి! నాకంటూ ఏమి కోరికలేదు అలాగే ఆశ, ఆశయము లేదు. కేవలము ఈ విశ్వ సృష్టి రహస్య చేధన కోసము అనగా ఈ విశ్వము యొక్క ఆదిలోని అలాగే అంతములోను ఏమి ఉందో తెలుసుకుందామని వచ్చాను. ఇలా నేను ఉండే 3rd డైమెన్షన్ నుండి మీరు ఉన్న 4th డైమెన్షన్ కి రావడము జరిగింది అనగానే.....

మంచిది! నీలాంటి నిస్వార్ధ, నిష్కామ కర్మ జీవులకే మా కాల డైమెన్షన్స్ చూసే అర్హత, యోగ్యత, యోగముంటాయి. అయితే నీకు మీ భూలోక విశ్వమునకు విశ్వాధినేత అయ్యే యోగముంది. ఈ బ్రహ్మ పదవి అందుకో. మమ్మల్ని చరితార్ధుల్ని చెయ్యి. అనగానే......

స్వామి! నాకు ఎలాంటి బ్రహ్మ పదవులు అలాగే విశ్వాధినేత అవ్వాలనే ఆకాంక్ష నాలో లేవు. నాకు మీరు అనుమతిని ఇస్తే మీ పైన ఉన్న 5th  డైమెన్షన్ కి వెళ్తాను అనగానే....

పరమహంస ఇక్కడికి రావడమే నీ చేతులలో ఉంటుంది. ఇక్కడ నుండి బయటికి అనగా క్రిందికి 3rd తిరిగి భూలోకమునకు పంపించాలా లేదా మాపైనే 5th ఉన్న డైమెన్షన్స్ కి నిన్ను పంపించాలా అనేది మా చేతులలో ఉండదు. మా వాళ్లు నిన్ను వాళ్ల డైమెన్షన్ కి రమ్మని అనుమతిని ఇస్తే పైకి పంపించగలము లేదంటే 3rd డైమెన్షన్ కి తిరిగి పంపిస్తాము. ఈ రెండు వద్దు అనుకుంటే మాకు లాగా నువ్వు గూడ విశ్వాధినేత అయ్యి మీ భూలోక విశ్వమును పాలించు అనగానే.... 

పరమహంస ఏమి చెయ్యాలో అర్ధముకాని స్థితిలో ఉండిపోయారు.

ఇంతలో.....

ఈ ఆదిత్యుడికి 5th డైమెన్షన్ ప్రతినిధి నుండి ఈయనను తమ డైమెన్షన్ కి పంపించమని అనుజ్ఞ రావడముతో.... ఈ ఆదిత్యుడు సంతోషముతో పరమహంసను 5th డైమెన్షన్ యొక్క ప్రధాన ద్వారము దగ్గరికి తన ఏక చక్ర రధము మీద ఎక్కించుకొని దింపడము జరిగింది. 

ఈ దృశ్యాలు అన్నిగూడ హార్వే పరికరములో కన్పిస్తూ ఉండడము అలాగే వీరి సంభాషణలు అన్నిగూడ వాయిస్ రూపములో వినిపిస్తూ ఉండేసరికి ఇది విన్న హార్వే, జోషి, దేవి కాస్త తమ గురువైన పరమహంస కాస్త 4th డైమెన్షన్ నుండి 5th డైమెన్షన్ లోనికి అడుగుపెడుతున్నారని తెలుసుకొని అమిత ఆనందమును పొందసాగారు.

No comments:

Post a Comment