అధ్యాయము 9

కొద్దిసేపటికి

పరమహంస గది నుండి బయటికి వచ్చి తాపీగా కుర్చీ బల్ల మీద కూర్చొని పేపర్చచదువుకుంటూండేసరికి...... ఏదో వింత చూపుతానని చెప్పి పేపర్ చదువుతున్న పరమహంసను  చూసిన ఈ ముగ్గురికి ఏమి అర్ధము కాలేదు! ఒక అరగంట పైగా ఎదురు చూశారు! కాని ఎలాంటి వింతలు లేదా మహిమవాళ్లకి కన్పించలేదు! వీళ్లలో సహనము చచ్చిపోయి పరమహంసనే అడిగి ఏదో ఒకటి తేల్చుకోవాలని అనుకొనే లోపుల..... గది లోపల నుండి సుమారు 5 అడుగుల ఎత్తులో ఈయన లాంటి వ్యక్తి బయటికి వచ్చి తాపీగా వంట గది వైపు వెళ్లేసరికి నోటమాట రాలేదు!

కుర్చీలో ఉన్న వ్యక్తి యధావిధిగా కూర్చొనే ఉన్నాడు! మరి ఈయనలాంటి ఈ క్రొత్త వ్యక్తి ఎవరో అర్ధముగాక ఈ ముగ్గురు చూస్తున్న సమయములో......

కొన్ని క్షణాల తర్వాత తాపీగా మూడు అడుగులున్న ఈయన లాంటి మరో వ్యక్తి ఈ గది నుండి బయటికి వచ్చి హోమగుండము వైపుకి వెళ్ళడము గమనించేసరికి వీళ్లకి మతిపోయింది! మరి కొన్ని క్షణాల తర్వాత అడుగున్నర ఎత్తులో ఈయన లాంటి మరో వ్యక్తి బయటికి రావడము జరిగింది! అసలు అక్కడ ఏమి జరుగుతుందో ముగ్గురికి ఒక పట్టాన ఏమి అర్ధము కాలేదు!ఆ తర్వాత అరచెయ్యంత లిల్లీపుట్ సైజ్ లో ఉన్న ఈయన లాంటి వ్యక్తి వచ్చి మొదటి వ్యక్తి కూర్చున్న వాలు కుర్చీ యొక్క చెక్క మీద కూర్చొనేసరికి..... ఆత్రము ఆపుకోలేక

హార్వే వెంటనే....ఈ గదిలో ఈయనలాంటి వాళ్లు ఇంక ఎంతమంది ఉన్నారోనని గదిలోపలికి వెళుతూంటే......హార్వే! ఆగు! నీ ఆలోచన మానుకో! ఎందుకంటే నీ పాదము క్రింద నాలాంటి వాడు ఒకడున్నాడు! వాడు చచ్చిపోతాడు అంటూ...

మొట్టమొదట వాలు కుర్చీలో కూర్చున్న వ్యక్తి వెంటనే లేచి తన అరచెయ్యి నేలమీద పెట్టి పెట్టగానే.... దాని మీదకి ఒక అంగుళ పరిమాణమున్న ఈయన లాంటి వ్యక్తి ఎక్కడము చూసేసరికి వీళ్లు నోర్లు వెళ్ల బెట్టక తప్పలేదు!

అప్పుడు....వాలుకుర్చిలో కూర్చుని పరమహంస వీరికేసి చూస్తూ......ఇపుడిదాకా వీరందరికి స్థూలశరీరము అదే భౌతిక శరీరము అలాగే జీవధాతు శరీరము అంటే సూక్ష్మశరీరమైన ఆత్మ గూర్చి మాత్రమే తెలుసు! నిజానికి ప్రతీ జీవికి సప్త వర్ణాలతో సప్త శరీరాలుంటాయి! అవే స్థూల, సూక్ష్మ,కారణ,సంకల్ప,వాయు,ఆకాశ,ఆత్మ శరీరాలు అన్నమాట! అనగా స్థూలశరీరము పరిమాణము 84  అంగుళలుంటే, సూక్ష్మ శరీరము 83 అంగుళాలు నుండి మూడు అడుగుల దాకా కారణ శరీరము మూడు అడుగుల నుండి మూడు అంగుళాలు దాకా అదే సంకల్ప శరీరముఅయితే అడుగు నుండి అంగుళము దాకా అదే వాయుశరీరము అయితే అంగుళము నుండి అణువు దాకా.... అదే ఆకాశ శరీరమైతే అణువు నుండి పరమాణువు దాకా అలాగే ఆత్మశరీరము అయితే పరమాణువు నుండి రేణువు అంత పరిమాణములో ఉంటాయి! 

అంటే ఇపుడు మీరు చూసిన నాలాంటి వ్యక్తులందరుగూడ నా సప్త శరీర రూపాలే! ఎవరైతే ఆజ్ఞ చక్రమును ఆధీనము చేసుకుంటారో వారికి ఈ సప్త శరీరాలు చూసే అవకాశము అలాగే ఇతరులకి చూపించే అవకాశముంటుంది! ఎందుకంటే ఈ శరీరాల సమస్త కర్మ చక్ర బంధము అంతా సహస్రచక్రములో ఉంటుంది! అనే జీవుడు చేసే కర్మలు వాటి ఫలితాలు అన్ని గూడ తన మెదడులోని సహస్రచక్రములోనే నిక్షిప్తమవుతాయి అన్నమాట! దీనినే విధివ్రాత, కర్మఫలితము, కర్మఫలము తలరాత, కర్మ ప్రదాత అని చెపుతూ ఉంటారు! ఎవరి కర్మకి వాళ్లే బాధ్యులు ఎలా అవుతారో మీకు అర్థమయి ఉంటుంది ఇలా ఈ సప్తశరీరాల సర్వకర్మలను నివారణ చేసుకోవాలంటే సహస్ర చక్రమును శుద్ధి చేసుకున్నవారికి కర్మ రాహిత్యము కలుగుతుంది. తద్వారా కర్మ-జన్మ అనే పునః జన్మలుండవు! అలాగే ఈ సప్త శరీరాలు వరుసగా మూలాధార చక్రములో స్థూల, మణిపూరకలో సూక్ష్మ, అనాహతలో సంకల్ప,ఆజ్ఞ చక్రములో వాయు, సహస్రచక్రములో ఆకాశ శరీరాల మూలకేంద్ర స్థానాలుగా ఉంటాయి!

ఇక ఆత్మశరీరము అనేది హృదయ చక్రస్థానములో ఉంటుంది! గాకపోతే వీటికి కొన్ని పరిధులుంటాయి! ఒక శరీరము తమ స్దాన చక్రమును దాటి మరొక చక్రములోనికి వెళ్ళడము జరిగితే ఆ శరీరము నాశనమైనట్లే అన్నమాట! అంటే మనకున్న మూడు గ్రంధులలో లోపలే ఆరు శరీరాలు నిక్షిప్తమై.... హృదయ చక్రములోని  హృదయ గ్రంధి వద్ద ఆత్మ శరీరము ఆత్మజ్యోతిగా.... పరమాణు పరిమాణము అంత ఉంటుంది! అందుకే మన పూర్వీక మునులు మంత్రపుష్పములో మన హృదయములో పరమాత్మ పరిమాణము ఒక వడ్లగింజకున్న తెల్లని మొక్కు భాగమంత అని చెప్పడము జరిగింది!

డాక్టర్ జోషి...

స్వామి! మీరు చెప్పిన ప్రకారము చూస్తే మేము మీ ఆరు శరీరాలే చూశాము!మరి మీ ఏడవ ఆత్మ శరీరమునుచూడలేదు అనగానే......

మీరు నన్ను మొట్టమొదటిసారిగాగది కిటికీ నుండి చూసినపుడు కన్పించిన ఆత్మలింగ రూపమే అదే నా ఆత్మజ్యోతి.... అదే నా 7 వ ఆత్మ శరీరము! గాకపోతే దాని పరిమాణము తగ్గించాలి! అదే ప్రయత్న సాధనలో ఉన్నాను అంటూండగా....

హార్వే వెంటనే...

గురూజీ! అంటే ఆత్మశరీరము అయిన పిండిరేణువు యొక్క జూమ్ యే ఈ high definition స్థూలశరీరము అనే గదా మీరు చెపుతోంది అనగానే....

'అవును' అని పరమహంస అనేసరికి శకుంతలాదేవి వెంటనే....

గురూజీ! ఇపుడిదాకా మనిషిని పోలిన ఏడుగురు వ్యక్తులుంటారని అనే నానుడి వినడము అలాగే గురు చరిత్ర గ్రంధములో శ్రీ దత్తతేయ రెండవ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు తమ శిష్యుడి ఇంటికి భిక్షకి ఏడు శరీరాలతో వెళ్లారని కధనము వినడమే తప్ప ఇపుడిదాకా ఇలా సప్త శరీరాలుంటాయని శాస్త్రీయ నిరూపణగా మా స్వానుభవముగా చూడటము ఇదే మొట్ట మొదటిసారి! అలాగే విజ్ఞాన వేత్తల విజ్ఞానము ప్రస్తుతానికి సూక్ష్మశరీరము దగ్గర ఉంటే....అదే భారతీయ పూర్వీక మహర్షుల జ్ఞానము ఏకముగా దాని మూలాది మూలమైన ఆత్మ శరీరము దాకా వెళ్లి ఎలా..... తెలుసుకున్నారో మీ ద్వారా మాలాంటి వారికి అర్ధమవుతుంది! ధన్యోస్మి!

అంటూ....

యోగసాధన అంటే ఏమిటి? అమ్మా! నిజానికి సాధన అంటూ ఏమిలేదు!

చెయ్యటానికి గూడా ఏమి లేదు! ఖాళీ గుప్పిట మూసి ఉంచి అందులో ఏముందో తెలుసుకొండి అని చెప్పడమే సాధన అవుతుంది! నిజానికి గుప్పిటలో ఏమిలేదని తెలుసుకున్నవాడు చెప్పితే మనము నమ్మము! ఎలా అంటే గౌతమ బుద్ధుడు ఎపుడో ఏనాడో దేవుడు లేడు! ఆత్మ లేదని నెత్తి నోరు బాదుకున్న మనము నమ్మలేదు! ఆది శంకరాచార్యుడు గూడ చివరికి ఉన్నది శూన్యమే అని దానికి ఆయన కాస్త 'శివ' అని నామము పెడితే.... మనము ఏకముగా శివను శివుడిగా ఆకారస్వరూప దైవమును ఏర్పరచారు!

 'శివ'అంటే 'లేనివాడు' అనే అర్ధము మరుగున పర్చారు! అందుకే శివమ్.. శవము అని చెప్పకనే చెప్పారు! కాని ఎవరు అర్ధము చేసుకున్నారో..... ఎంతమందికి అది అర్ధమైందో చెప్పు! ఎవరికి వారే  సాధన చేసి ఏదో లేని దానిని తెలుసుకోవాలని ఉన్నదానిని వదిలి పెట్టి ప్రాకులాడి చివరికి తమ స్వానుభవముగా 'ఏమిలేదు ' అని తెలుసుకొనేసరికి ఒక జన్మ కాస్త సహస్ర కోటి జన్మలకి కారకమవుతోంది! మానవ జన్మ అనుభవాలు అనుభవించడానికి మాత్రమే ఉంది! 

సాధనకి సాధించడానికి అసలు ఏమిలేదు! ఉన్న శూన్యము ఉందో లేదో గూడ తెలియదు! ఎందుకంటే గది బయట ఉన్నవాడు గదిలోపల ఏముందని తెలుసుకోవటానికి లోపలికి వెళ్లితే గదిలో ఏమిలేదు! చూసేవాడు లేడు! చేసేదిలేదు! చూపించేది లేదు! చూడటానికి ఏమి లేనపుడు ఉన్నది శూన్యమే గదా! ఒక ఉల్లిపాయ యొక్క పొరలు తీసుకుంటూ పోతే ఎలా అయితే ఉల్లిపాయ ఆకారము కన్పించదో అలా సప్త శరీరాల ఈ దేహము గూడ కనిపించకుండా పోతుంది! దానికి సాధన చెయ్యాలని మన పెద్దలు చెప్పారని అర్ధ జ్ఞానులు ప్రచారము చేశారు! చేస్తున్నారు! ఏది ఎపుడు ఎలా జరగాలో కాలానికి, ప్రకృతికి తెలిసినపుడు అదే అనుభవాలు నువ్వు సాధన చేసిన లేదా చెయ్యకపోయిన నీకు ఇవ్వవలసిన సమయములో ఏదో రకముగా అనుభవ సత్యముగా అవగతమవుతుంది! అది భోగపరముగా లేదా యోగపరముగా గావచ్చును! ఉదాహరణకి భోగికి రాజకీయ పదవి మీద మోజు ఉంటే యోగికి బ్రహ్మ పదవి మీద మోజు ఉంటుంది!ఎవరి పదవులు వాళ్లకి వస్తే అదే బ్రహ్మానందము లేదా రాకపోతే ఎవరికి వాళ్లకి స్మశాన వైరాగ్యము కలుగుతుంది! ఈ రెండు అనుభవాలు చూడటానికి ఒకటే అని అవి చూసే కళ్లు రెండు గావడము వలన ఈ అనుభవము రెండుగా కనపడుతుంది!అదే మాయ అవుతోంది! ఒక వస్తువు మీద రెండు విభిన్న భావాలు కల్గించే ఆలోచనయే మహా మాయ అవుతుంది! అదే రెండు పదవులు గూడ సమదృష్టితో అనగా త్రినేత్రముతో చూసేవాడికి ఈ వస్తువు అనేది ఏక వస్తువు భావము కల్గుతుంది!

   ఇలాంటి ఏకాగ్రత దృష్టి కోసము, సమదృష్టి, సమభావ దృష్టి కోసము అరిషడ్వార్గాలైన కామము, కోపము, లోభి, ఈర్ష్య,గర్వము,అహములను అదుపులో ఉంచుకోవాలని అపుడే మనస్సు , బుద్ధి అదుపులో ఉంటాయని, తద్వారా వివేక బుద్ధి కలిగి స్థిర మనస్సు ఏర్పడుతుందని..... ఇదే దైవత్వానికి దారి చూపుతుందని మన పూర్వీకులు సాధన చెయ్యాలని చెప్పడము జరిగింది!

ఇలా ఎంతమంది తమ మనస్సును ఆధీనము చేసుకున్నారో చెప్పగలవా? నిత్యము అజప గాయత్రి జపము చేసే వాడికి అలాగే నిత్య ప్రాణాయామ సిద్ధి పొందిన సాధకుడికి ఆడదాని నగ్న దేహము చూస్తే మర్మాంగ యంత్రము పని చెయ్యకుండా పోతుందా? ఆలోచించు! ఖచ్చితముగా పని చేస్తుంది! అంటే మనస్సును ఆధీనము మనిషి చేతిలో ఉండదు! వీటి ఆలోచనలు మారితే కానీ మనస్సు ఆధీనమవ్వదు ! జపాలు, తపాలు, పూజలు, ఉపాసనలు, జ్ఞానాలు ఎన్ని పొందిన ఎన్ని చేసిన వ్యర్ధమే!

వీడు చూసే దృష్టిని బట్టి భావము ఏర్పడుతుంది! భావము బట్టి ఆలోచన కలుగుతుంది! ఆలోచన బట్టి బుద్ధి ఉంటుంది! బుద్ధిని బట్టి మనస్సు ఉంటుంది! ఇదంతా రావాలంటే వాడికి ధ్యానసిద్ధి ఉండాలి! ధ్యానమంటే మనము చేసే ప్రతి పని గూడ ధ్యానము అవ్వాలి! అంతేకాని ధ్యానమంటే ఏదో గదిలో ఏకాంతముగా కూర్చొని కళ్లు మూసుకొని జపమాల లేదా పద్మాసనములో కూర్చొని గంటల కొద్దీ కూర్చోవడము గాదు! దాని వలన నిద్ర రావడం తప్ప ఏమి ఉపయోగముండదు!వాడికి పోన్ లో ఏదో చూడాలనే ఆలోచన ఉంటుంది కాని ధ్యానము చెయ్యక తప్పదు అని ధ్యానము చేస్తుంటారు! అంటే ఇలాంటి వాళ్లు నూటికి 99% మంది ధ్యానము అనేది శరీరమే చేస్తుంది కాని మనస్సు చెయ్యదు! అదే మనస్సుతో చేసిన వాడికి ఏకాంతం కోసము గదితో పని యుండదు! ఇలాంటి వాళ్లు మంది గూర్చి కాకుండా మది గూర్చి ఆలోచనలు చేస్తుంటారు! అందువలన మనస్సు చేసే ధ్యానము వలన ధ్యానసిద్ధి కలుగుతుంది! ఇలాంటి మనస్సు గావాలంటే ప్రతివాళ్లు తమ పంచేంద్రియాలు అలాగే ఇవి చేసే పంచ కర్మేంద్రియాల మీద దృష్టి పెడితే ఏక దశేన్ద్రియైనమనస్సు అదే సహజ సిద్ధముగా  ఆధీనమవుతూ తద్వారా ఇంద్రియ నిగ్రహము కల్గుతుంది! జితేంద్రియుడవుతాడు! మనస్సు ఆధీనము కాని వాడు ఇంద్రియాలకి లోనై ఇంద్రియ జిత్తుడు అవ్వక తప్పదు! నిజానికి సాధకుడు ఎలాంటి అనుభవాలు పొందాలో కాలమే నిర్ణయిస్తుంది!అప్పటిదాకా సాధకుడు తాను ఏదో సాధన చేస్తున్నాననే  భ్రమ భ్రాంతిలో ఉండక తప్పదు!

 దేవి వెంటనే....

గురూజీ! ప్రతి జీవుడు మోక్షము పొందాలని దానికి సాధన చెయ్యాలని  అంటారు గదా!

 అమ్మాయి! మోక్షము అంటే ఏమిటో నిజానికి అర్థము తెలియక దానిని పొందడానికి ఈ సాధన చెయ్యాలని చెప్తున్నారు! అసలు సాధన చేసి ఏమి సాధించాలి! మోక్షమా? అంటే ఏమిటో తెలుసా? అన్ని భవబంధాల నుండి విముక్తి పొందడమే మోక్షమంటారు! శరీరానికి బాధ్యతలు మనస్సుకి విముక్తి కల్గించినవాడే నా దృష్టిలో నిజమైన మోక్షగామి! వాడే మోక్షుడు! మోక్షమును పొందుతాడు! 

అనగా ఎక్కడ నుండి వచ్చినాడో తిరిగి అక్కడికి వెళ్లిపోవడము అనగా శూన్యము నుండి వచ్చినవాడుతిరిగి శూన్యమవ్వడమే నిజమైన మోక్షపధము అవుతుంది! అసలు ఇలాంటి స్థితి పొందిన వాడికి తాము పొందామో లేదో గూడ తెలియని విచిత్రస్థితి!ఈ స్థితికి మోక్షము అని పేరు పెట్టి దానికి సవాలక్ష సాధనలు పెడుతూ చెపుతూ జనాలను మభ్యపెట్టడము అవసరమా? దీని కోసము ఎంతో మంది జీవితాలను నాశనము చేసుకొని నకిలీ గురువుల వద్ద ధనాలు, మానాలు సమర్పించి వాళ్లు చెప్పిన విధివిధానాలు చేసుకుంటూ మతి భ్రమణము చెంది పిచ్చివాళ్లు అయిన వాళ్లను చూశాను! ఉద్యోగాలు వదిలి ఆశ్రమాలు,క్షేత్రాల చుట్టూ తిరిగిన సాధకుల్ని చూశాను! ఫలితము  మాత్రము శూన్యమని వాళ్లు తెలుసుకొనే మానసికస్థాయికి ఇంక వాళ్లు రాలేకపోతున్నారు! జపాలు, ఉపాసనల పేరులతో ఆడవాళ్లు కాస్త సంసార సుఖ జీవితాలను దూరము చేసుకుంటున్న అమాయక స్త్రీ జాతిని చూడటము జరిగింది!

వెంటనే హర్వే అందుకొని....

స్వామి! ఇందాక మీరు మోక్షమంటే భవ బంధ విముక్తి అన్నారు గదా! అంటే ఇపుడు నాకున్న బంధాలు అన్ని గూడ భ్రమ, భ్రాంతి, మాయ అనుకోవాలా? నా దగ్గర ఉన్న ఈ స్నేహితులు, మీరు, తల్లిదండ్రులు, నా బంధుమిత్రులు, నా ఆఫీసువాళ్లు ఇలా మీరందరూ గూడ మాయలే  అనుకోవాలా? అపుడు ఏది నిజమో - ఏది అబద్ధమో తెలియక మరింత అయోమయములో పడతాము గదా ?

నాయనా! హార్వే! దీనినే మిడిమిడి జ్ఞానం అంటారు! నేను అన్నది వేరు! నువ్వు అనుకున్నది వేరు! నేను భవబంధ విముక్తి అంటే ఉన్నవాళ్లని, ఉన్న బాధ్యతలను వదిలిపెట్టి మాయలు అనుకొని అడవుల వెంట, ఆశ్రమాల వెంట, ఆశయాల వెంట, క్షేత్రాల వెంట తిరగమని అడగడము లేదు! వీరందరి మీద ప్రేమ, మోహ,వ్యామోహాలను మానసికముగా వదిలిపెట్టాలి! ఇపుడు వీళ్లలో ఎవరైనా చనిపోతే వాళ్ల కోసము మన జీవితము నాశనము చేసుకోవడము  అవివేకమవుతుంది గదా! అదే మోహ, వ్యామోహలలో ఉంటే మాత్రము  వాళ్లు చనిపోతే మనము విలవిలలాడుతూ ప్రాణాలు వదిలేస్తాము! ఇది ఉండకూడదు రుణమున్నంత వరకు బంధాలుంటాయి రుణము  తీరితే  ఈ బంధాల నుండి మనకి విముక్తి కల్గి బంధవిముక్తి పొందడము  జరుగుతుంది! అనగా మామిడి పండు బాగా పండిన తర్వాత తొడిమ వేరై చెట్టు నుండి పండు రాలినట్లుగా మోక్షగామి మామిడి పండుగా మారాలి అన్నమాట! గాకపోతే చాలా మంది పండు మగ్గకుండానే పచ్చిగానే పోతగా,పిందెగా రాలిపోయి పునః కర్మ జన్మలు పొందుతారు! అదే నా బాధ.ఉన్నవాళ్లని వదిలిపెట్టి లేనివాడి కోసము ఎక్కడికో వెళ్లి సాధన చేస్తున్నపుడు ఉన్నవాళ్ల ఆవేదన తనకి టెలిపతి ద్వారా ఆవేదన శక్తి తరంగాలు తన మనస్సు అందుకొని లేనిపోని అనుమాన భయ ఆలోచన భావాలు కల్గి వాడి మనస్సు స్థిరము గాకుండా పోతోంది! అది తప్పు అంటాను! రుణాలు తీరిన తర్వాత నువ్వు ఎక్కడికైనా వెళ్లవచ్చు!బంధ విముక్తిని పొందగలవు! చాలా మంది ఏకాంతముగా ఉండాలని అనుకుంటారు! నిజానికి ఏకాంతములో 'ఏ' 'కాంత' లేనపుడు విసుగు వస్తుంది! ప్రశాంత స్థితిని పొందలేడు! ఏకాంతము, ఒంటరితనము,ప్రశాంతత, మనఃశ్శాంతి, ఆత్మ శాంతి, ఆనందము ఇలాంటి స్థితులు గావాలని మనస్సు కోరుకుంటుంది! అంటే దానికి ఏదో తెలియని కోరిక స్థితిలో ఉన్నట్లే! అది ఏమిటో ముందు సాధకుడు తెలుసుకోవాలి! అపుడే మనసు అధీనమవుతుంది! కోరిక తీరితే అనగా పదార్ధ మాయ దాటితే యదార్ధ జ్ఞానము మనస్సుకి తెలుస్తుంది!

దేవి వెంటనే....

 స్వామిజీ! అయితే మోక్షము సాధించడానికి అతి సులువైన మార్గము ధర్మ జీవితమేనని మీరు చెపుతున్నారు! ఇది ఎలా సాధ్యమో నాకైయితే ఇంకా అర్థముకాలేదు!

తల్లి! ఇది నేను చెప్పడము లేదు! మన భారతీయ వేదధర్మాలే  చెపుతున్నాయి! ధర్మ, అర్ధ, కామ, మోక్షమని చెప్పాయి గదా! ఇందులో ప్రథమంగా ధర్మమునకే అగ్రపీఠము ఇచ్చారు గదా! ధర్మ జీవితముతో అర్ధము అనగా సంపాదన అంటే ధర్మ సంపాదన లేదా ధర్మయుత ధనము అలాగే కామము అంటే కోరికలు అనగా ధర్మయుత కోరికలు తీర్చుకుంటుంటే సహజ సిద్ధముగా నువ్వు అన్ని రకాల బంధాల నుండి విముక్తి పొంది మోక్షమును పొందుతావని సూక్ష్మములో మోక్షముగా చెప్పడము జరిగింది! 

అంతెందుకు నాలుగు అడుగుల కర్రను ఒక అడుగు కర్రగా చెయ్యాలంటే మొదట ఒక అడుగు కర్రను కోస్తే మూడు అడుగుల కర్ర మిగులుతుంది!ఆ తర్వాత మరో అడుగు కర్రను కోస్తే రెండు అడుగుల కర్ర మిగులుతుంది! ఆ తర్వాత మరొకసారి ఒక అడుగు కర్రను కోస్తే కొయ్యకుండానే మరో అడుగు కర్ర సహజ సిద్ధముగా ఎలా అయితే మిగులుతుందో అలా మన జీవితములో ధర్మ గుణములు ఆపాదిస్తే అంతే సహజముగా మోక్షము వస్తుంది గదా! నీ నిత్య శ్వాసయే శ్వాస మీద ధ్యాన   చేసే ప్రాణాయామము, నీలో విన్పించే ఓంకారనాదమే నీ మంత్రారాధన, నీ మాటలే నీ అజపగాయత్రి,నీ చూపులే త్రాటకక్రియ, నీ చేతలే నీ ధ్యానము అవుతాయి నీ నిద్రయే సమాధి స్థితి అవుతుంది!

స్వామి! మీరు చెప్పే మనస్సు సాధించడానికి సాధన అనేది పూర్వము వాళ్లు ఏర్పరచి  ఉంచినారేమో గదా!

నాయనా! మన మనస్సుకి ఏమి గావాలో ఎలాగావాలో మనకి తప్ప వేరే వారికి తెలియదు గదా! మన గురువులకి, మన దైవాలకి మన మనస్సు  ప్రవర్తన ఎలా తెలుస్తుంది! నా శరీరము గూర్చి నాకు తెలిసినంతగా నీకు తెలుస్తుందా?

తెలియదు గదా! నేను అనేది గూడ ఇదే! మన అభిమతాలు ఏమిటో మనకి తెలుసు! కాని వాళ్ల అభిమతాలను మతాలుగా మార్చి దానికి  కొన్ని సాధన పద్ధతులు పెట్టి వాటిని చేస్తేనే మోక్షపధము వస్తుందని చెప్పడమే తప్పు అని నేను అంటున్నాను! నాకు స్వీట్ ఇష్టము! నీకేమో కారము ఇష్టము! నువ్వేమో డాక్టర్ గా వచ్చి స్వీట్ తినవద్దు కారము తినమని నాకు చెపితే నా మనస్సు వింటుందా?

ఒకసారి ఆలోచించు! నువ్వు ఒకటికి వంద సార్లు చెప్పితే మహా అయితే పది సార్లు మాత్రమే అది వింటుంది! కారము మీద మమకారము పెంచుకోదు! అలాగని స్వీట్ మీద మమకారము తగ్గించుకోదు! ఈ రెండు తినలేక ఏదితినాలో అర్థమవ్వక మతి చెడి ఉన్నది పోయి ఉంచుకున్నది పోయి అనగా కొండనాలికకు మందు వేస్తే ఉన్ననాలుక పోయినట్లుగా మన పరిస్థితి మారుతుందని నేను చెపుతున్నాను! అదే నువ్వు మాత్రము నీకు ఇష్టమైన స్వీట్ తిన్నా గూడ నీవు పొందవలసిన మోక్షమును తేలికగా పొందుతావు గదా! ఎందుకంటే ఇందులో నీ మనస్సు నీ మాట వింటుంది! అంటే సాధనకి గురువు అలాగే దైవము మరియు మంత్ర, యంత్రాలు, తంత్రాలు, జపాలు, తపాలు, ఉపాసనాలు, ఆసనాలు, ప్రాణాయామాలు అనేవి అవసరమే లేదు! నీ మనస్సే నీ గురువు! నీ ఆత్మయే దైవము!అని తెలుసుకొని నీ మనస్సుకి నచ్చిన పనులు చేస్తూ వాటి మీద దానికున్న ప్రేమ, మోహ,వ్యామోహాలు తగ్గించుకుంటూ పోతే అంతే సహజ సిద్ధముగా మళ్లీ ఆ కోరిక వైపు నీ మనస్సు చూడదు! అది గావాలని తపించదు దాని పొందు కోసము ప్రయత్నించదు! ఆలోచించదు! ప్రాకులాడదు! దీనినే స్పందన రాహిత్యము, ఆలోచన రాహిత్యం, సంకల్ప రాహిత్యం,ఆశ-భయ రాహిత్యం,  కర్మ రాహిత్యం, జన్మరాహిత్యము అవుతుంది! ఇదియే పరమ పధమైన మోక్ష స్థితి! అంటే నీ మనస్సు సహజ స్థితిలో ధర్మయుతముగా ఉంటే అదియే మోక్షస్థితిని  పొందడము జరుగుతుంది!

       నీ మనస్సుకి ఏది మంచో, ఏది చెడో తెలియదు! అందమైన అమ్మాయిని చూస్తే పొందు గావాలని అంటుంది! ఆమెనే వివాహము  చేసుకుంటే నీకు గావాల్సిన విధంగా కామ కోరిక తీర్చుకొనే అవకాశముంటుంది! ఇది తప్పు గాదు! ధర్మయుతమైన పని అవుతుంది! అదే పెళ్లైన అందమైన పరాయి స్త్రీని గూడ నీ మనస్సు గావాలని కోరుకుంటుంది! అప్పుడు నువ్వు ఇది తప్పు! మనము ఏక పత్ని ధర్మతో ఉండాలి! పరాయి స్త్రీ మనకి దేవతతో సమానము అని నీ మనస్సుకి హితబోధ చేస్తే నువ్వు ఇంద్రియ నిగ్రహమును పొంది జితేంద్రియుడవు కాగలవు! లేదంటే ఆ ఇంద్రియాలకి బలి అయ్యి ఇంద్రియ జిత్తుడు అవ్వక తప్పదు! ఏది ధర్మమో....... ఏది అధర్మమో.... మన మనస్సుకి మన బుద్ధికి తెలియాలి! అంటే మన మెదడు మధ్య భాగములో ఉండే పిట్యూటరీ గ్రంధి మన ఆధీనములో ఉంటే సర్వము ఆధీనమైనట్లే!ఎందుకంటే అన్ని రకాల భావాలకి,ఆలోచనలకి, ఆశలకి, ఆశయాలకి, సంకల్పాలకి, స్పందనలకి మూల బిందు స్థానము ఇదే గదా అనగానే....

డాక్టర్ జోషి వెంటనే......

స్వామి! డాక్టర్ చదివిన వాళ్లకి మాత్రమే తెలిసిన ఈ విషయము మీకు ఎలా తెలుసు? నాయనా! నేను డాక్టర్, యాక్టర్, ఫిలాసఫర్, ఆస్ట్రాలజర్, వేదాంతి, ఆధ్యాత్మికవేత్త, పరిశోధకుడు,శాస్త్రవేత్త, యోగి, భోగి, గృహస్థుడు, బ్రహ్మచారి, ఆయుర్వేద వైద్యుడు ఇలా 36 తత్వాలున్నాయి! అవి నెమ్మది నెమ్మదిగా కాలానుగుణంగా అవే బయటికి వస్తాయి! అపుడిదాకా మీరంతా విశ్రాంతి తీసుకోండి! రాబోవు రోజులలో విశ్వానికి విశ్రాంతి మనమే ఇవ్వాలి! అదియే మన మధ్యన ఉన్న అతి పెద్ద కర్మ బంధనము! ఈ బంధ విముక్తి ఎలాగో 'ది గాడ్ కోడ్' చెపుతుంది! అప్పుడే ఈ ఆత్మ లింగమునకు విముక్తి కల్గి పరమశూన్యమైన  పరమలింగమునందు ఐక్యమై శూన్యమవుతుంది ! ఈ చిట్టచివరి కర్మ నివారణ కోసము నేను ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాను! దీని కోసము రాబోవు కాలము మనము ఎన్నో ప్రమాదాలు, అవాంతరాలు, అడ్డంకులు ఎదుర్కోవలసి ఉంటుంది! అందుకే మీరంతా సంసిద్ధంగా ఉండండి! ఏమి జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది!

                  అవును! నాకు బాగా ఆకలి వేస్తుంది.మీకు గూడ వేస్తుందా? అయితే  నరమాంసముతో నిండిన భోజనము ఈరోజు చేద్దాము! అంటూ పరమహంస కాస్త వంటవాడిని పిలిస్తూండేసరికి......అపుడిదాకా ఈ ముగ్గురు జంతు మాంసముతో వండిన పదార్ధాలే తిన్నారు కాని నర మాంసముతో వండిన పదార్థాలు రుచి చూడలేదు! ఇలాంటివి అఘోరులు తింటారని వీళ్లు పుస్తకాలలో చదివారు! ఇప్పుడు ఏకముగా తాము గూడ నరమాంస వంటకాలు రుచి చూడవలసి వస్తుందని అనుమాన భయముతో..... ఒకరి ముఖాలు ఒకళ్లు చూసుకుంటూ పరమహంస వైపు భయముతో గూడిన గౌరవముతో చూడటము తప్ప ఏమీ చెయ్యలేక అవునని..... కాదని చెప్పలేక మనసులో అవస్థలు పడసాగారు!

No comments:

Post a Comment