కర్కోటకుడు,చారుకేశ కలిసి
తమ కంటి చూపు మేరలో ఉన్న పరమహంస ఇంటి వద్దకి చేరుకొని....
ఇంటి కంచె బయట ఉన్న తుమ్మ పొదల చాటుకు వీరిద్దరు చేరుకొని.....
ఇంటి పరిసరాలు గమనించడము మొదలు పెట్టారు.
వీరికి కాపలాగా కుక్క కనిపించకపోయేసరికి ఊపిరి పీల్చుకున్నారు. తాపీగా ఇంటికేసి చూస్తుండగా.....
వారికి..... ఈ ఇల్లు ఒక పర్ణశాల లాగా కనబడింది.
చిన్నపాటి కొలనులో బాతులు, కొంగలున్నాయి. మరో వైపున్న పాకలో ఆవు, దూడ కనిపించాయి. చెట్ల మీద వివిధ రకాల చిలుకలు, పావురాలు, నెమళ్లు కనిపించాయి. చెట్ల క్రింద కుందేళ్లు గెంతుతూ కనిపించాయి. ఇలాంటి సుందరమైన వాతావరణమును వీరిద్దరు తన్మయత్వముతో చూస్తున్న సమయములో వీరి వెనుక వైపు నుంచి......
"ఎవర్రా మీరు?" అపుడే బయటి నుంచి ఇంటి లోపలికి వెళుతున్న పనివాడిగొంతు....వినబడింది.
చారుకేశ వెంటనే వెనక్కి తిరిగి....
వంట వాడిని చూస్తూ....
స్వామి! ఆ కనిపించే ఇల్లు ఎవరిది?
ఆ వివరాలు మీకెందుకు?
లేదు! స్వామి! మాకు పరమహంస స్వామి ఇల్లు గావాలి. కొయ్యజాతి వారిని అడిగితే ఈ ఇల్లు చూపించారు. అది అవునో గాదో అని అనుమానముతో మేమిద్దరం ఇక్కడ ఉండి చూస్తున్నాము.
ఆ ఇల్లు ఆయనదే. ఆయనతో మీకు ఏమి పని? అనగానే......
కర్కోటకుడు అందుకొని....
అయ్యా! ఆయనతో మాకు ఏ పని లేదు. ఒకసారి అలాంటి మహానుభావుడి ప్రత్యక్ష దర్శనము చేసుకుంటే వందకోట్ల జన్మల మహా పాపాలు పోతాయని మా గురువుగారు చెపితే ఇక్కడిదాకా వచ్చాము అనగానే.....
అవును! నిన్ను నీ అవతారమును నేను ఎక్కడో చూసినట్లుగా ఉంది. ఆ! ఆ! ప్రొద్దున మా గురువుగారు నీలాంటి వ్యక్తి బొమ్మ గీసి దాని క్రింద 'కర్కోటకుడు' అని పేరు గూడ రాశారు అనగానే.....
కర్కోటకుడు గతుక్కుమన్నాడు. అంటే తను ఎవరో తను ఎందుకు వచ్చాడో ఈయనకి ముందుగానే తెలిసిపోయిందా? అంటే తను ఎదుర్కోపోయే వ్యక్తి ఎంత ప్రమాదకరమైన ఉన్నత సాధనశక్తి స్థాయిలో ఉన్నాడో వీడికి అర్థమై చిరుచెమటలు పట్టడము మొదలైంది.
ఏమిటి? ఆలోచిస్తున్నారు? కొంపతీసి నీ పేరు కర్కోటకుడా? అనగానే....
లేదు! లేదు! అయ్యా! నా పేరు అదిగాదులే.
ఏమో! మా గురువుగారు గీసిన బొమ్మకి ఉన్న దుస్తులే నువ్వు గూడ వేసుకున్నావు. అందుకే అలా అన్నాను.
వెంటనే చారుకేశ అందుకొని....
అంటే స్వామి! మీ గురువు గారు గీసిన బొమ్మలోని వ్యక్తికి ఈయనకి పోలికలున్నాయా? ఆ బొమ్మ వివరాలు చెప్పు...
ఏమో నాకెలా తెలుస్తుంది? మా గురూజీ గీసిన బొమ్మ వ్యక్తికి మనిషి తలకి బదులుగా పాము తల గీశారు. దుస్తులు మాత్రమే ఈయన వేసుకున్నవే ఉన్నాయి అనగానే.....
చారుకేశ కొంత స్థిమితపడి......
స్వామి! పూర్వము నీలాంటి వాడు ఎర్ర కోక కట్టిన ప్రతీ ఆడది తన పెళ్లాము అని అన్నాడట. అలా ఉంది. మీ గురూజీ గీసిన బొమ్మ లో ఉన్న దుస్తులే మా గురూజీ వేసుకున్నంత మాత్రాన ఆయనను అనుమానిస్తావా?అనగానే......
ఏదో అనుమానము వచ్చి అడిగినానులే. అంతగా కోపము తెచ్చుకోకు. అయినా మీరు ఎలా ఉంటే నాకెందుకు. నేను నా దారి పోతాను అంటూ అక్కడి నుండి వెళ్లిపోతున్న వంటవాడితో....
స్వామి! అలా బాధపడదవెందుకు? అనుమానాలు రావడం సహజమే. వాటిని తీర్చుకోవడము సహజమే. ఇదిగో ఈ రెండు వేలు తీసుకో. మాకు కొన్ని వివరాలు గావాలి చెప్పగలవా? డబ్బులు ఇవ్వక పోయినా చెప్పేవాడిని. మీరు ఇస్తున్నారు గదా! తీసుకొని చెపుతాను. ఏమిటి ఆ వివరాలు?
అనగానే.....
లౌక్యము తెలిసిన వాడే అనుకొని......
స్వామి! ఆ ఇంటిలో ఎవరెవరు ఉంటారు? అనగానే....
నేను, మా గురూజీ, ఒక డాక్టర్, శాస్త్రవేత్త, ఒక జ్యోతిష్యవేత్త అయిన అమ్మాయి ఉంటుంది.
ఆ అమ్మాయి అందముగా ఉంటుందా?
ఆమె నాకు అక్క అవుతుంది. ఆ దృష్టితో నేను ఎప్పుడూ చూడలేదు. అనగానే.....
సరే స్వామి! నువ్వు వెళ్లవచ్చును అనగానే.....
వీళ్లు వెళుతున్నట్లుగా నటిస్తూ కొంతదూరము వెళ్లి..... వంటవాడు ఇంటి లోపలికి వెళ్లాడని గమనించి మళ్లీ వెనక్కి తిరిగి వచ్చి పొదల చాటున చేరారు. ఇది గమనించని వంటవాడు యధావిధిగా కూరల సంచితో ఇంటిలోనికి వెళ్ళిపోయాడు.
చారుకేశ వెంటనే....
గురూజీ! ఇప్పుడు ఏమి చేద్దాం? మన రాక గూర్చి మనకి గావాలసిన వ్యక్తికి ముందుగానే తెలిసిపోయింది. మనము ఏమి చెయ్యాలని అనుకుంటున్నామో గూడ ఆయనకి తెలిసిన ఎందుకు ప్రశాంతముగా ఉన్నాడో నాకైయితే అర్థముగావడము లేదు అనగానే.....
శిష్య! నాకు అర్థమయింది. ఎందుకంటే ఇక్కడున్న వీళ్లలో ఎవరికో బలహీన జాతక గ్రహస్థితి లేదా మరణ మారక దశ గ్రహస్థితి ఉండి ఉండాలి. నా వలన వాళ్లకి ప్రయోగ ప్రమాదము కలుగుతుందని తెలుసుకొని ఈయనకి అన్ని తెలిసిన శాంతముగా ఉండి ఉండాలి. అనగానే......
మరి గురూజీ! ఆ వ్యక్తి ఎవరో మనకి ఎలా తెలుస్తుంది అనగానే.......
శిష్య! ఈ మంత్రించిన నిమ్మకాయలు, మిరపకాయలు, ఈ వేరులు, ఈ నల్లని గుడ్డముక్క, ఈ కోడి తల, ఇదిగో పిండి బొమ్మతో కలిపి వాళ్ల ఇంటి పరిసరాలలో ఉన్న పచ్చని చెట్టు క్రింద పాతిపెట్టి రావాలి. కొన్ని నిమిషాల తరువాత ఎవరైతే ఈ వస్తువులున్న చోటుకి వచ్చి వీటిని బయటికి తీస్తారు లేదా తాకుతారో వారికి బలహీన గ్రహస్థితి ఉన్నట్లే. అప్పుడు మనము చేసే తంత్ర ప్రయోగానికి వాళ్ల ప్రాణాలు పోతాయి అనగానే....
గురూజీ! మనకి గావాలసింది పరమహంస ప్రాణాలు గదా. వేరే వారి ప్రాణాలు గాదు గదా.
ఓరి పిచ్చివాడా! ఇంటిలోని కుటుంబ సభ్యులకి ఎవరికైనా ఒంట్లో బాగు లేదంటే ఆ ఇంటి యజమాని కంగారు పడతాడుగదా. ఈ విషయము ఆధారముగానే మనము ఈ ఇంటిలోని బలహీన జాతక వ్యక్తి మీద మంత్ర ప్రయోగము చేస్తే వాడు కళ్ళముందే మరణయాతన పడుతూ చనిపోతుంటే పరమహంస ఎలా శాంతముగా, తాపీగా ఉంటాడో ఆలోచించు. అప్పుడు బలమైన ఆయన గ్రహస్థితి బలహీనపడుతుంది గదా. అప్పుడు చేప చేతికి చిక్కుతుంది. మన వలలో సునాయాసంగా పడుతుంది గదా. బలవంతుడిని ఎదుర్కోవాలంటే వాడి బలహీనతల మీద దెబ్బ కొట్టాలి. గురువుని శిష్యులు అలాగే దేవుడికి భక్తులు ఎప్పుడూ బలహీనము అవుతారు.
గురూజీ! అంటే ఇప్పుడు చేపను పట్టడానికి బలహీన జాతక వ్యక్తి అనే ఎరను సిద్ధము చేస్తున్నారు అన్నమాట. సరే! ఆ మూట ఇవ్వండి. ఎదురుగా ఉన్న అరటి చెట్టు క్రింద పాతి పెడతాను. తప్పనిసరిగా భోజన సమయానికి అరటి ఆకుల కోసము ఎవరో ఒకరు రాక తప్పదు గదా అంటూ తనని ఎవరు చూడటము లేదని నిర్ధారణ చేసుకొని.... మంత్రించిన మూటను అందుకొని.....
ఇంటి కంచె లోపలికి ప్రవేశించి అనుకున్న చోటులో ఈ మూటను పాతిపెట్టి తనని ఎవరు చూడలేదని మరొకసారి నిర్ధారణ చేసుకొని బయటపడి తిరిగి యధావిధిగా పొదల చాటుకి చేరుకున్నాడు. ఈ మూటను తాకటానికి వచ్చే అమాయక నర జీవి కోసము ఎదురుచూడసాగారు.
No comments:
Post a Comment