అధ్యాయము 12

 

కర్కోటకుడు స్మశానమునకు చేరుకొని కాళీమాత ప్రత్యక్ష దర్శనము కోసము అన్ని రకాల పూజ తంతు ఏర్పాట్లు చేసుకోవడము ప్రారంభించాడు. తన బలి కోసము ఒక హోమ గుండము గూడ ఏర్పాటు చేసి.... తను నిత్యము పూజించే రుద్రకాళీ అమ్మవారి విగ్రహమూర్తి తన సంచిలోంచి బయటికి తీసి అష్ట దిగ్భంధనముగా వేసిన పసుపు, కుంకుమ, ముగ్గు మధ్య ఇది ఉంచి...మంత్రించిన నిమ్మకాయలు, అష్ట దిక్కులలో మంత్ర బంధన యుతముగా మేకులు దించి.... కోడిని బలి ఇచ్చి... హోమాగ్ని వెలిగించి అమ్మవారి ప్రసన్నము కోసము మనస్సును ఆధీనము చేసుకుంటూ ఏకాగ్రత స్థితికి చేరుకుంటున్న సమయములో....స్మశాన ప్రేతాత్మలు గగ్గోలు పెట్టసాగాయి. అయినగూడ పట్టించుకోలేదు. గబ్బిలాల రెక్కల చప్పుళ్లు, గుడ్లగూబల అరుపులు ఆ నిశ్శబ్ద వాతావరణములో గూడ చాలా భయంకరముగా వినబడుతున్నాయి. కుక్కల అరుపులు, నక్కల కోతలు, తోడేలు అడుగుల చప్పుళ్లు గూడ కర్కోటకుడి మనస్సుని కదిలించ లేకపోయినాయి. అయిన వీటి అన్నింటిని పట్టించుకునే స్థితిలో ఇతని మనస్సు లేదు. మనస్సు లేని మనస్సు అతీత స్థితిలో వెళ్ళిపోతూండగా అప్పుడు.....

మంత్ర దేవతలు వరుసగా అనగా మానవ, రాక్షస, ప్రేత, భూత, గాంధర్వ, యక్షిని, కిన్నెర దైవ ఇలా..... ఎనమిది జాతి స్త్రీ మూర్తులు నగ్నముగా రావడము..... కవ్వించడము..... చేస్తున్నా గూడా చలించలేదు.

ఆఖరికి లజ్జ గౌరి రూపములో నగ్నముగా అమ్మవారు వచ్చిన గూడా మనస్సు చెలించలేదు. ఎందుకంటే అపుడికే మనస్సు లేని స్థితికి కర్కోటకుడు చేరుకున్నాడు.ఆ తర్వాత.....గుప్త నిధులు, బంగారపు నిధులు, వజ్రాలు, మణులు, వైడూర్యాలు, రత్నాలు  ఇలా ఎన్నింటినో చూపించి ఆశపెట్టారు.వీటిని అన్నింటిని తన మనో దృష్టితో సాక్షి భూతముగా చూడటము తప్ప  దేనికి స్పందించలేదు. ఇసుమంత గూడా ధ్యానము నుండి తప్పుకోలేదు. మనోదృష్టిని మళ్లించలేదు. మంత్రము ఆపలేదు. అంటే ఏ సాధకుడైన..... ఏ సత్ సాంప్రదాయమైన పాటించాలన్న అందులో సిద్ధి పొందాలన్న ప్రకృతి మాత తప్పనిసరిగా ఆ సాధకుడికి కనకము, కాంత యందు (అదే స్త్రీలకి అయితే పురుషుడు, సువర్ణ ) పరీక్షలు పెడుతుంది.వీటిని దాటుకొని వచ్చిన వారికి మాత్రమే తన యదార్ధ జ్ఞానమును ప్రసాదించును! ఈ విషయము తెలిసిన గూడ కర్కోటకుడికి ఇన్ని సంవత్సరాలు  అనుకోని విపత్కర పరిస్థితులు తప్పు అయిన తప్పక చెయ్యక తప్పలేదు. కామము యందు పడిపోయిప్రణవ మంత్రము కాస్త ప్రణయ మంత్రముగా మారిపోయేది. దానితో చేసేది ఏమిలేక వెను తిరిగి వచ్చేవాడు! ఈ రోజు ఇలా జరగకూడదని తన మర్మాంగమును కోసుకొని ఈ పూజకి వచ్చాడని పాపము తన శిష్యుడైన చారుకేశకి మాత్రమే తెలుసు.కాని ఏమి చెయ్యగలడు. చూస్తూ ఉండటము తప్ప. తన సంకల్ప సిద్ధి కోసము ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధపడిన వాడికి శరీర భాగము పోతే బాధ  ఉండదు గదా. అనుకొని తను గూడ రాబోవు కాలములో ఇలాంటి గుండె నిబ్బరముతో ఉండాలని అనుకున్నాడు.

ఇంతలో....

తన మనోదృష్టి ముందు అన్ని రకాల ప్రకృతి మాయలు దాటిపోగానే.....ఒక ప్రచంఢ దివ్యమైన కాంతిపుంజము ప్రత్యక్షమైంది.ఈ కాంతి పుంజము వెలుగు శక్తిని తన మనోనేత్రము గూడ తట్టుకోలేక పోవడము కర్కోటకుడు గమనించాడు. దానితో తన మనోదృష్టి కొన్ని క్షణాల పాటు తట్టుకోలేకపోవడము, ఆ కనిపించిన కాంతి పుంజము అదృశ్యమయ్యేసరికి.....ఎక్కడ లేని కోపావేశానికి గురియై....అమ్మా! నీ మనో మాయలు దాటాను.అయిన గూడ నువ్వు కనిపించి కనిపించకుండా పోయావు. నీ ప్రత్యక్ష దర్శనము నాకు ఇవ్వడము లేదు. ఇంకా సాధన చేసి ఏమి లాభము. నా కోరిక తీరనపుడు నా సంకల్పము తీరనపుడు ఈ దేహము యొక్క శ్వాసతో నాకు పని లేదు. ఈ శ్వాసను నీవే తీసుకో అంటూ తను తెచ్చుకున్న ఖడ్గముతో తన తలను నరుక్కోగానే......

సరిగ్గా అది అక్కడే ఉన్న హోమ గుండము నందు పడగానే......ఈసారి మళ్లీ ప్రచంఢమైన కాంతి పుంజము ప్రత్యక్షమై..... అందులోంచి 18 చేతులతో ౩6 కపాలాల మాలలతో..... ఒక చేతిలో కర్కోటకుడి తల.... మరొక చేతిలో ఇతడి తల యొక్క రక్తమును పట్టుకున్నపాత్రతో  మహాకాళీ మాత  ఉద్భవించి.....వాడి తలను...అక్కడే నేల మీద పడి నిర్జీవముగా ఉన్న వాడి  దేహమునకు అతికించి.... కర్కోటకుడిని తిరిగి బ్రతికించి.....

మానవా! ఏమి నీ కోరిక.....

తల్లి! నాకు పునఃజన్మ ప్రసాదించావు అంటే నా సంకల్పము ఏమిటో నీకు తెలియకుండా ఉండదు. నేను ఈ విశ్వానికి విశ్వాధినేతను గావాలి. ఈ విశ్వము నా చెప్పుచేతలలో నడవాలి. అనగానే..... 

మానవా! బ్రహ్మదేవుడికే అది కొంతమేర సాధ్యపడింది. ఆయుష్ తీరగానే మరొక బ్రహ్మ వచ్చి ఈ విశ్వము యొక్క సృష్టి, స్థితి, లయ ప్రక్రియలు చేస్తాడు. మరి నీకున్న ఆయుష్ లో విశ్వాధినేతవి ఎలా అవుతావు?

అమ్మా! నా దగ్గర సంజీవిని మంత్ర సిద్ది ఉంది. దానితో ఆయుష్ ను  పెంచుకుంటూ పోతాను. నాకు మరణము లేకుండా చేసుకుంటాను. కాని నా సంకల్పమైన విశ్వాధినేత కోరిక తీరే మార్గమును చూపించు తల్లి!

మానవా! మానవులు-------  కోరికలు లేని సమాజము చూడాలని కోరిక పెట్టుకున్నట్లుగా ఉంది. ఒక ప్రక్క మరణము లేని స్థితి..... మరో ప్రక్క విశ్వాధినేత పదవి గావాలి.సరే! నన్ను 36 సంవత్సరాలు నీ మంత్ర సాధనతో ప్రసన్నము చేసుకున్నావు. నీ సంకల్పము తీరాలంటే 36 దైవ తత్వాలున్నోడు లేదా 18 దైవిక లక్షణాలున్నవాడి తలను నాకు బలిగా ఇవ్వవలసి ఉంటుంది. అప్పుడే వాడి ఆత్మశక్తి  నీలో ప్రవేశించి నీవు విశ్వాధినేతవి కాగలవు. అలాగే మరణము లేని స్థితిని పొందగలవు.

అమ్మా! అలాంటి పరమ పురుషుడు ఎక్కడ ఉన్నాడు.

మానవా! అవి నీవే చూసుకోవాలి.వాడు ఎక్కడ ఉన్నాడో నువ్వే తెలుసుకొని నాకు నరబలి ఇవ్వాలి. మార్గము చెప్పడమే నా వంతు. ఆ మార్గము వెతుక్కోవడము అందులోనికి వెళ్లడము నీ వంతు అంటూ ఆవిడ అదృశ్యమైంది.

అమ్మా ప్రసన్నమైనందుకు ఒక ప్రక్క ఆనందముగా ఉన్న మరో ప్రక్క ముడివేసి నరబలి గావాలని కోరడమే కొంచెము ఇబ్బందిగా ఉంది. ఆ నరబలి అయ్యే వ్యకి ఈ విశ్వములో ఎక్కడ ఉన్నాడో వెతకడమే తన ప్రధమ కర్తవ్యముగా భావించి.... స్మశానము నుండి బయటికి వస్తుండగా....

ఎదురుగా.....తనకోసము ఎదురుచూస్తున్న చారుకేశతో "ఒరేయి! అమ్మ పలికింది. నరబలి గావాలని అంటోంది. ఆ వ్యక్తి కోసము వేట మొదలు పెట్టాలి. పద! ముందు మన ఆశ్రమానికి వెళ్లి.... ఆ తర్వాత ఏమి చెయ్యాలో.... ఎలా చెయ్యాలో.....ఆలోచన చేద్దాము అంటూ...." వీరిద్దరూ ఆశ్రమానికి బయలుదేరారు.


1 comment:

  1. సగంలో ఆపేసారేమి స్వామి చాలా బాగుంది 👌👌🙏👌🙏

    ReplyDelete