ఆశ్రమానికి చేరుకున్న
కర్కోటకుడు,చారుకేశలు ఎదురెదురుగా కూర్చొని..... తమ ఆశయము తీర్చే
పరమపురుషుడు ఎవరా ? అని తీవ్ర ఆలోచనలో కర్కోటకుడు ఉన్నాడు.
ఇంతలో.....
చారుకేశకి ఎదో ఆలోచన వచ్చి....
గురూజీ! అంజన ప్రశ్న వేస్తే ఆయన ఎవరో మనకి తెలుస్తుంది గదా అనగానే......
కర్కోటకుడికి అమిత ఆనంద మేసి "నువ్వురా! నా నిజమైన శిష్యుడువి. గురువుకి రాని ఆలోచనను గుర్తు చేసినావు. చంకలో పిల్లవాడిని పెట్టుకొని ఊరంతా తిరిగినట్లుగా ఉందిరా. మన చేతిలో అంజనీ ప్రశ్న విద్య పెట్టుకొని కానరాని వాడిని కనిపించే విధంగాచెయ్యవచ్చుననే జ్ఞానమే మర్చిపోయాను రా! ఇక ఆలస్యమెందుకురా. అంజన ప్రశ్నకి అన్ని సిద్ధం చెయ్యి. ఈ లోపలనేను నదీ స్నానము చేసి మంత్ర జపము విధి విధానము పూర్తి చేసుకొని వస్తాను" అంటూ నది వైపు బయలుదేరాడు.
ఈయన తిరిగి వచ్చే లోపల
చారుకేశ కాస్త అన్ని సిద్ధము చేశాడు.
కాటుక అంజన ప్రశ్న వేశాడు. ఏమీ కనిపించలేదు. ఇలా గాదనుకొని తమలపాకు అంజన ప్రశ్న వేశాడు.
ఏమీ కనిపించలేదు. ఇలా నూనె, జలము తో వేసిన ఎలాంటి ఫలితము కనిపించకపోయేసరికి ఆశ్చర్యము చెందుతూ.... ఆఖరికి అంజన ప్రశ్న సృష్టికర్త అయిన ఆంజనేయ అంజన ప్రశ్న వేయగానే..... హనుమ అంజనములో కనబడుతున్నాడు కాని తనకి కావాలసిన ఆ వ్యక్తి వివరాలు కాని ఆ వ్యక్తిని చూపించక పోయేసరికి తీవ్రమైన అసహనానికి గురై అంటే తను వెతకపోయే వ్యక్తి సామాన్యుడిగా కనిపించే అసమాన్య వ్యక్తియని.....ఇలాంటి అంజన ప్రశ్నలకే ఆయన వివరాలు తెలియడం లేదంటే పంచ మహాయోగాలు పట్టిన జాతకుడు అయ్యుండాలి లేదా 54 దైవిక శక్తులను ఆధీనము చేసుకున్న వ్యక్తి అయ్యుండాలి లేదా దైవిక లక్షణాలున్న వ్యక్తి లేదా దైవిక శక్తుల మధ్యలో ఉన్న వ్యక్తి లేదా దక్షిణాచారములో ఆరితేరిన వ్యక్తి అయ్యుండాలి అనుకుంటూ
ఇలా గాదనుకొని....
తను వెతికే వ్యక్తి రూపురేఖలు ఎలా ఉంటాయో ఇప్పడిదాకా అంజన ప్రశ్నలో అడిగినా చూసినా ఎలాంటి ప్రయోజనము కనిపించలేదు. ఈసారి ఆయన ఉండే ప్రాంతమును చూపించమని ప్రశ్న వెయ్యగా.... ఒక త్రిశూలము మీద ఉన్న దేవాలయము అలాగే శవాల చితి మంటలుకన్పించాయి. కర్కోటకుడికి ఈ ప్రాంతము ఏమిటో అర్థము కాలేదు. సరే ఇలా గాదనుకొని తను వెతికే వ్యక్తి పేరు ఏమిటో చూపించమని అడగ్గా..... హిమాలయాలలో మానససరోవర నీటిలో ఈదుతున్న రాజహంస కన్పించింది. దీని అర్థము ఏమిటో ఒక పట్టాన ఇతనికి అర్థము కాలేదు. ఈ రోజుకి ప్రశ్నలు అడగడము అయిపోవడము ఈ పూజ నుంచి బయటికి వచ్చి తనకి కన్పించిన దృశ్యాల గూర్చి తన శిష్యుడైన చారుకేశకి చెప్పగా వాడు గూడ ఆలోచనలో పడ్డాడు. కొంతసేపు అయిన తర్వాత......
గురూజీ! త్రిశూలము మీద గుడి అలాగే చితిమంటల దృశ్యాలు అనేవి నాకు గుర్తు ఉన్నంతవరకు మహా స్మశాన క్షేత్రమైన కాశీక్షేత్రము సూచనగా చూపిస్తున్నాయని నా అనుమానము. ఎందుకంటే ప్రళయము జరిగిన తర్వాత ఈ ఒక్క కాశీ క్షేత్రమునకు ఏమి గాకుండా ఉండేందుకు మహాశివుడు తన త్రిశూలము మీద ఈ క్షేత్రమును ఉంచుతాడని కాశీఖండము చెపుతోంది. అలాగే అక్కడ ఉన్న మణికర్ణికా ఘాట్ యందు ప్రతి 18 నిమిషాలకి ఒక శవము నిత్య శవాగ్నిఅవుతూనే ఉంటుందని లోకానికి తెలియనిది గాదు కదా అనగానే....
కర్కోటకుడిలో ఆనందము వేసి....
భళా! భళారా! నువ్వు చెప్పిన సమాధానము నిజమే. మరి రెండవ దృశ్యము సంగతి ఏమై ఉంటుంది అనగానే.....
అదే స్వామి! నేను ఆలోచిస్తున్నాను! హిమాలయాలకి అలాగే మానస సరోవరము మరియు రాజహంసకి ఈయన పేరుకి ఏమి సంబంధమున్నదో నాకైయితే అర్థమై చావడము లేదు అంటూండగా.....
కర్కోటకుడికి ఏదో తెలియని విషయము తెలుసుకున్నట్లుగా.....
భళా! నాకు తెలిసిందిరా! ఈ రెండవ దృశ్యము ఏమిటో అర్థమయిందిరా! వాడి పేరు ఏమిటో తెలిసిందిరా. అంటే మనము వెతుకుతున్న వ్యక్తి కారణజన్ముడు లేదా పరమయోగి అయ్యుండాలి. ఎందుకంటే యోగ సాధనలో చిట్టచివరి సాధన స్థితి పరమహంస సాధన స్థితిని పొందడమే.
అంటే వీళ్లు హంస ఎలా అయితే పాలు అలాగే నీళ్లు వేరు చేస్తుందో......
ఈ స్థితిని పొందినవారు గూడ ఏది మాయో ఏది రహితమో......ఏది జ్ఞానమో ఏది అజ్ఞానమో.... ఏది మంచో... ఏది చెడో తెలుసుకొని వేరు చేసే స్థితిలో ఉండగలరు. అందుకే మనకి నీటిలో తేలియాడుతున్న రాజహంస కనిపించింది అంటే ఈయన పేరు పరమహంస లేదా ఏదైన హంసతో సంబంధమున్న పేరు అయ్యుండాలి అనగానే....
చారుకేశ వెంటనే....
స్వామి! మనకి గావలసిన వ్యక్తి వివరాలు తెలిసినాయి గదా. ఇక ఆలస్యము చెయ్యడమెందుకు. మనము కాశీ యాత్ర చేసి ఆయనను వెతికి పట్టుకొని కాళీమాతకి బలిద్దాం. మీరు విశ్వాధినేత అవ్వడము నేను చూడాలి అంటూ ఈ యాత్రకి గావలసిన సామాగ్రిని మూటకట్టే ప్రయత్నాలుమొదలుపెట్టాడు. కాశీక్షేత్రములో ఉన్న ఈ వ్యక్తిని ఎలా ఎదిరించాలో కర్కోటకుడి మనస్సులో క్షుద్ర పన్నాగము మొదలైంది.
No comments:
Post a Comment